19 దేశాల అగ్రనేతల సమక్షంలో దావోస్‌లో అధికారికంగా ప్రకటించిన ట్రంప్
కొత్త కూటమితో ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగిసిపోనుందన్న ట్రంప్
ఐరాసతోనూ కలిసి పనిచేస్తానన్న అమెరికా అధ్యక్షుడు
సభ్యదేశంగా చేరిన పాకిస్తాన్
గైర్హాజరైన భారత్
దావోస్/న్యూఢిల్లీ: మాటలతోనే పెనుకుంపట్లు రాజేసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతికాముకుడి అవతారమెత్తి ప్రపంచ యవనికపై కొత్త కూటమిని కొలువుతీర్చారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు జరుగుతున్న దావోస్ నగరంలో 19 దేశాల అగ్రనేతల సమక్షంలో బోర్డ్ ఆఫ్ పీస్(శాంతి మండలి)ని ట్రంప్ గురువారం అధికారికంగా ప్రకటించారు.
అగ్రనేతల సమక్షంలో సంబంధిత పత్రంపై ట్రంప్ సంతకం చేసి కొత్త కూటమిని ఉనికిలోకి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా తన కనుసన్నల్లో పనిచేసేలా గాజా పునర్‌నిర్మాణ, అభివృద్ధి మాటున శాంతి మండలిని ఏర్పాటుచేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలను ట్రంప్ ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ‘‘ శాంతి మండలిలో భాగస్వాములుగా ఉండేందుకు ప్రతి దేశం అమితాసక్తి కనబరుస్తోంది.
ఇవేగాక మరెన్నో దేశాలతో కలిసి పనిచేస్తాం. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తా. ఇప్పుడిప్పుడే ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. ఐరోపా, అమెరికా, పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఏడాది క్రితం యుద్ధాలతో ప్రపంచం అగ్నిగోళంగా ఉండేది. ఇది చాలా మందికి తెలీదు. సమకాలీన పరిస్థితుల పర్యవసానంగా ఏర్పడిన ఈ ‘శాంతి మండలి’ అంతర్జాతీయ కూటముల్లో ఒకటిగా గొప్పదిగా ఉండబోతోంది.
శాంతి మండలి అనేది ప్రపంచానికి చాలాచాలా ప్రత్యేకమైంది. ఐక్యరాజ్యసమితిలో ఎంతో సత్తా ఉంది. ఒక పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–హమాస్ యుద్ధమేకాదు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ముగింపు కోసం ఐరాసతో కలిసి పనిచేస్తా. ఐరాస, కొత్త శాంతి మండలి కలిసి పనిచేస్తే అది ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
ముఖ్యంగా పశ్చిమాసియాకు కొత్త రోజులొస్తాయి. గాజా యుద్ధం దాదాపు చివరి దశకు చేరుకుంది. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నా వాటిని మనం ఆపేయబోతున్నాం. వాగ్దానం చేసినట్లు హమాస్ వాళ్లు ఆయుధాలు విడనాడాలి. ఆయుధాలను త్యజించని రోజున అదే వాళ్లకు ఆఖరి రోజు అవుతుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు. కొత్త కూటమితో ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగిసిపోనుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
35 దేశాలతో మొదలు..
35 దేశాలతో శాంతి మండలిని ఆరంభిస్తున్నామని ట్రంప్ తెలిపారు. వేదికపై ఆసీనులైన పలువురు అగ్రనేతలను ట్రంప్ పేరుపేరున పొగిడారు. తనతో కలిసి ముందడుగువేస్తున్నందుకు అభినందించారు. ‘‘మేమంతా ఎంతో కీలకమైన పనులు చేయబోతున్నాం. ఇంతటి ఘనకార్యాలు చేయడానికి ఇంతకు మించిన వేదిక మరోటి లేదు. వ్యవస్థాపక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. గర్వంగానూ ఉంది’’ అని ట్రంప్ అన్నారు. శాంతి మండలి డాక్యుమెంట్‌పై ట్రంప్ సంతకంచేశాక అక్కడి 19 దేశాల అగ్రనేతలను సంతకాలుచేశారు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం కార్యక్రమంలో పాల్గొని కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముష్కరులను ముద్దుచేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి అశాంతిని రాజేసే పాకిస్తాన్.. శాంతికాముక∙బోర్డ్‌లో చేరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాలు శాంతి మండలిలో చేరేందుకు ఆసక్తి చూపించగా ఐరోపా సమాఖ్యలోని కొన్ని సభ్యదేశాలు నిరాకరించాయి. ఆహ్వానం అందుకున్నా ఇంకొన్ని దేశాలు తమ వైఖరిని బయటపెట్టలేదు. భారత్ సైతం ఈ కార్యక్రమం నుంచి దూరంగా ఉండిపోయింది.
నేనింకా రియల్ ఎస్టేట్ మనిషినే..
గాజా పునర్‌నిర్మాణలో భాగంగా గాజాను సము ద్రతీర ప్రాంతాలకు, రవాణా, ఇంధన మౌలిక వసతులను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ అన్నారు. ఇదే వేదికపై ఆయన నూతన గాజా ఇలా ఉండబోతోందంటూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. ‘‘ సముద్రతీర ప్రాంతం ఎంత బాగుందో చూడండి. బీచ్‌లతో అలరారుతున్న గాజా స్ట్రిప్‌లో ఆకాశహ ర్మ్యామ్యలను నిర్మించబోతున్నాం. తీరప్రాంత పర్యాటకం ఊపందుకోబోతోంది. ఇన్నాళ్లూ ఇదే ప్రాంతంలో కడు పేదరికంలో మగ్గిపోయిన పాలస్తీనియన్లు మేం చేసే అభివృద్ధి తర్వాత అద్భుతజీవనం కొనసాగిస్తారు. భవిష్యత్‌లో సాక్షాత్కారం కాబోయే ఈ భవంతులను చూస్తుంటే నాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి మేల్కొంటున్నాడు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నేను రియల్ ఎస్టేట్ వ్యక్తినే’’ అని ట్రంప్ అన్నారు.
మండలిలో చేరతామన్న దేశాలు
ఖతార్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, మంగోలియా, పాకిస్తాన్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఇండోనేసియా, జోర్డాన్, అల్బేనియా, అర్మేని యా, అజర్‌బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, కజకిస్తాన్, కొసోవో, మొరాకో
సమ్మతి తెలపని దేశాలు..
ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, బ్రిటన్
తటస్థ వైఖరితో ఉన్న దేశాలు
రష్యా, భారత్, సింగపూర్, థాయ్‌లాండ్, ఉక్రెయిన్, ఇటలీ, జర్మనీ, కాంబోడియా, చైనా, క్రొయేషియా, సైప్రస్, గ్రీస్, పరాగ్వే, యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం


