కాసు మార్జు చీజ్‌: లోపలి పురుగులు చనిపోతే.. అంతే ఇక!

Food: Interesting Facts Of Pufferfish And Casu Marzu Cheese - Sakshi

ఆహారం.. అప్రమత్తత .. అవసరం..

‘ఆరోగ్యానికి అవసరమైంది ఏంటో తెలుసా? ఆహారం.. అది మితంగా తింటే ఔషధం.. అమితంగా తింటే విషం.’ అనే మాట అక్షరాల నిజం. ఎందుకంటే..  ఆహార పదార్థాలు ఆరోగ్యాన్నే కాదు.. అనారోగ్యాన్ని కూడా అందించగలవు. అంతేకాదు, కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం తెస్తాయి. సాధారణంగా ఆహార పదార్థాలు ఏవైనా శరీరానికి పోషకాలతో పాటు శక్తిని అందిస్తాయి. కానీ మనలో చాలామందికి కొన్ని రకాల ఆహార పదార్ధాలు పడవు.

అంటే అవి తిన్నప్పుడు అలెర్జీని కలిగిస్తాయి. ఈ సమస్య ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కానీ కొన్ని పదార్థాలను తింటే దాదాపు అందరిలో ఒకేరకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆహార పదార్ధాలను సరిగా వండకపోయినా, నిల్వచేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా వాటిని తిన్నప్పుడు వాంతులు, విరేచనాలు, జ్వరంతో పాటు కొన్ని సార్లు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అటువంటి కొన్ని రకాల ఫుడ్స్‌ గురించి తెలుసుకుందాం..

సోయా బీన్స్‌ లేదా రాజ్మా
బీన్స్, చిక్కుడు ఆరోగ్యానికి మంచివని మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇందులో ఉన్న కొన్ని రకాల గింజలను సరిగ్గా వండకుండా తింటే అనారోగ్యం బారిన పడక తప్పదు. ఎరుపు బీన్స్, సోయాబీన్స్‌ ఈ కోవలోకి వస్తాయి. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారత దేశంలో అధికంగా వినియోగించే ఈ బీన్స్‌లో ప్రోటీన్లు, పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలం గా ఉంటాయి. కానీ పచ్చి బీన్స్‌ లో ’ఫైటోహెమాగ్లుటిన్‌’ అనే కొవ్వు పదార్థం ఉంటుంది. ఆ కొవ్వు మన శరీరరంలో త్వరగా జీర్ణం కాదు.

అందువల్ల దీనిని సరిగా ఉడికించకుండా తింటే కడుపులో నొప్పి, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. రెడ్‌ బీన్స్‌ మాదిరిగానే, సోయాబీన్స్‌లో కూడా ప్రోటీన్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటితో పాటు వీటిలో సహజ టాక్సిన్‌గా పిలిచే ట్రిప్సిన్‌ అనే ఎంజైమ్‌ కూడా ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకుండా నిరోధిస్తుంది. అందువల్ల ఈ రెండు రకాల బీన్స్‌ను 12 గంటల సేపు నీటిలో నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఉడకబెట్టి, ఆ తర్వాత ఆరబెట్టి అప్పుడు వండుకుని తింటే ఏ సమస్యలూ దరిచేరవు.

జాజికాయ
మసాలా దినుసులలో ప్రముఖంగా వినిపించే పదాల్లో జాజికాయ కూడా ఒకటి. ఈ మసాలా దినుసు ఇండోనేషియాలో ఎక్కువగా దొరుకుతుంది. కొన్ని రకాల వంటకాలలో అదనపు రుచికోసం దీనిని విరివిగా వాడతారు.బంగాళదుంపలు, మాంసం, సాస్‌లు, కూరగాయలు వంటకాలతోపాటు, కొన్ని పానీయాల తయారీలోనూ జాజికాయను వాడతారు.

అయితే దీనిని అధిక మొత్తంలో తీసుకుంటే కొన్ని దుష్‌ప్రభావాలు ఎదురవుతాయి. వికారం, నొప్పి, శ్వాస సంబంధ సమస్యలు, మూర్ఛతోపాటు మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది. జాజికాయ తినడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అరుదుగా ఉన్నప్పటికీ దీనిని మితంగా వాడుకుంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కాసు మార్జు చీజ్‌..
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీజ్‌గా దీనికి పేరుంది. ఈ చీజ్‌లో పురుగులు ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ పురుగులను చూస్తే తినాలన్న ఆసక్తి కొందరికి కలగకపోవచ్చు. కానీ ఇటలీలోని సర్డీనియాలో బాగా ప్రాచుర్య ఉన్న ఈ చీజ్‌ను ఇష్టపడేవారు ఎక్కువ మంది ఉన్నారు. పెకోరినో రొమానో అనే ఇటాలియన్‌ చీజ్‌కు లార్వాలను కలిపి కాసు మార్జును తయారు చేస్తారు. లోపల ఉండే ఆ చిన్న పురుగులు చీజ్‌ను మెత్తంగా, జిగురులా చేస్తాయి. దాంతో దానిని తినేటపుపడు చీజ్‌లోపలి మధ్య భాగం దాదాపు ద్రవ పదార్థంలా ఉంటుంది.

ఈ పురుగుల వల్ల చీజ్‌ రుచి బావుంటుంది. అయితే ఈ చీజ్‌ చాలా అరుదుగా దొరుకుతుంది. యూరోపియన్‌ యూనియన్‌ అనుమతిపొందిన ఆహార పదార్థాల జాబితాలో కాజు మార్జును చేర్చలేదు. అందువల్ల దీనిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి లేదు. ఇది తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ లోపల ఉన్న పురుగులు చనిపోతే ఆ చీజ్‌ చెడిపోయినట్లు. ఏదైనా అనారోగ్యం తో ఉన్నప్పుడు ఈ చీజ్‌ తింటే వాంతులు, విరోచనాలతోపాటు కడుపులో అసౌకర్యంగా ఉంటుంది.

రుబర్బ్‌..
బ్రిటిష్‌ వంటకాలలో రుబర్బ్‌ కాడలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చాలా బ్రిటీష్‌ ఫలహారాలు, పానియాలలో వీటిని వినియోగిస్తారు. కానీ రుబర్బ్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రుచికరమైన కాడలతోపాటు వీటిలో ఉండే పచ్చని ఆకుల్లో విషం ఉంటుంది. వీటి ఆకుల్లో ఆక్సాలిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది కడుపులోకి వెళ్లిన తరువాత వికారం కలిగించి ఖనిజ లవణాలను జీర్ణం చేసుకునే శక్తిని తగ్గిస్తుంది. ఇంకా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు ఈ పదార్థం దోహదం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాడల్లో కూడా ఆక్సాలిక్‌ ఆమ్లం ఉన్నప్పటికీ ఆకులతో పోలిస్తే చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఆకులను తింటే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి, అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

పప్ఫర్‌ ఫిష్‌..
పఫ్ఫర్‌ ఫిష్‌..ఇది అత్యంత విషపూరితమైన చేప. దీని శరీరంలో టెట్రోడోటాక్సిన్‌ ఉంటుంది. ఇది సైనైడ్‌ కంటే ఎక్కువ ప్రమాదకరమైనది. అయినప్పటికీ ఈ చేపతో చేసే వంటకాలకు కొన్ని దేశాల్లో భారీ డిమాండ్‌ ఉంది. జపాన్‌లో పఫ్ఫర్‌ ఫిష్‌తో చేసే పుగు అనే వంటకానికి మంచి ఆదరణ ఉంది. ఈ వంటకం తయారు చేసే చెఫ్‌లు కొన్నేళ్లపాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వంటకంలో చేప మెదడు, చర్మం, కళ్లు, బీజకోశాలు, కాలేయం, పేగులు లేకుండా మిగతా అవయవాలతో పుగు వండుతారు. ఈ చేపను వండడానికి ప్రత్యేకంగా డిగ్రీ ఉంది. దీనిని పూర్తి చేసిన వ్యక్తులు మాత్రమే దీన్ని వండుతారు.
– డి. శాయి ప్రమోద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top