
జల ప్రపంచంలో అలలే పాఠాలు. అలలే అరుదైన గురువులు. అలా ఎంతో మంది గురువుల దగ్గర ఎన్నో గెలుపు పాఠాలు నేర్చుకున్న నాగాయలంకకు చెందిన నాగిడి గాయత్రి వాటర్ స్పోర్ట్ ‘కయాకింగ్’లో సత్తా చాటుతుంది. జాతీయ స్థాయిలో రాణిస్తోంది.
సాగర సంగమ తీరం నాగాయలంకలో ‘వాటర్ స్పోర్ట్స్ అకాడమీ’ నెలకొల్పడంతో గ్రామీణ్ర ప్రాంతాలకు అంతగా పరిచయం లేని కయాకింగ్–కెనోయింగ్ జలక్రీడలు దివిసీమ వాసులకు చేరువయ్యాయి. కృష్ణా జిల్లా తీరప్రాంత నాగాయలంక గ్రామానికి చెందిన నాగిడి గాయత్రి ‘వాటర్ స్పోర్ట్స్ అకాడమీ’లో శిక్షణ పొంది కయాకింగ్–కెనోయింగ్ జలక్రీడల్లో మెలకువలను ఒడిసి పట్టుకుంది. జల క్రీడలలో జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది.
మొదట నాటు పడవతోనే శిక్షణ పొందిన గాయత్రి 2022లో గుజరాత్‌లో జరిగిన 36వ జాతీయ స్థాయి కయాకింగ్ పోటీలలో 4వ స్థానంలో నిలిచి పతకాల బోణీ కొట్టింది. గత సంవత్సరం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన 5వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ కయాకింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో రజత పతకం గెలుచుకుంది. గోవాలో జరిగిన నేషనల్ వాటర్ స్పోర్ట్స్ ΄ోటీల్లో మరోసారి రజత పతకం గెలుచుకుంది.
గత నెల ఉత్తరాఖండ్‌లో జరిగిన 38వ కెనోయ్ స్లాలమ్–2025 నేషనల్స్ ΄ోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో బంగారు పతకం అందించి తన సత్తా చాటింది. కయాకింగ్–కెనోయింగ్‌లోనే కాదు...కరాటే, థైక్వాండోలోనూ గాయత్రి ప్రతిభ చూపుతూ ఎన్నో పతకాలు సాధించింది. 2017లో ఢిల్లీలో జరిగిన 33వ నేషనల్ తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం, 2021లో రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీల్లో బంగారు పతకం గెలుచుకుంది.
ఇటీవల నాగాయలంక పర్యటించిన కృష్ణాజిల్లా కలెక్టర్ డికె బాలాజీ వాటర్ స్పోర్ట్స్‌లో గాయత్రి చూపుతున్న ప్రతిభను ప్రశంసించారు. ఆమెకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం’ అంటున్న ఇరవై సంవత్సరాల గాయత్రి కల నెరవేరాలనే ఆశిద్దాం.
చేపల వేటలో తనకు తానే సాటి
నాగాయలంక కృష్ణానదిలో తండ్రి నాగబాబు సాగించే చేపల వేటలో గాయత్రి సాయపడుతూ ఉంటుంది. రాత్రి వేళల్లో సైతం తండ్రితోపాటు బోట్‌పై సాగర సంగమ ప్రాంతంలోకి వెళ్ళి చేపల వేటలో గాయత్రి తన నైపుణ్యం ప్రదర్శిస్తుంటుంది. వేటలో తలపండిన మత్స్యకారులు చేయలేని పనులను ఆమె సునాయాసంగా చక్కబెడుతుంది.
మగవారితో దీటుగా పడవ నడుపుతూ అవసరమైన చోట లంగరు వేసేస్తుంటుంది. గాలం తాడు వేటలో గాలానికి రొయ్యను ఒడుపుగా గుచ్చడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. నాగాయలంక రేవులో గాలానికి రొయ్య గుచ్చడంలో నలుగుౖరైదుగురికే నైపుణ్యం ఉంటే వారిలో ఒకరు గాయత్రి కావడం విశేషం.
మా కుటుంబానికి చేపల వేటేజీవనాధారం. నాన్న ఎంతో కష్టపడి నాకు శిక్షణ ఇప్పించాడు. ఏపీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అడ్వయిజర్ తిప్పిరెడ్డి శివారెడ్డి ప్రోత్సాహాం మర్చిపోలేనిది. మొదట్లో కోచ్‌లు శ్రీనివాస్, నాగబాబు, చినబాబు ఇచ్చిన శిక్షణ మెలకువలే నన్ను ఈ స్థాయికి తెచ్చాయి. ఎప్పటికైనా ఒలింపిక్స్ వాటర్ స్పోర్ట్స్‌లో పాల్గొని బంగారు పతకం సాధించాలన్నదే నా లక్ష్యం అంటోంది నాగిడి గాయత్రి
– సింహాద్రి కృష్ణప్రసాద్, సాక్షి, నాగాయలంక
(చదవండి: వారెవ్వా..! ఏం సందేశం ఇది..! వైరల్‌గా డైరీ మిల్క్ అడ్వర్టైస్‌మెంట్)
Comments
Please login to add a commentAdd a comment