ఫ్యామిలీ మ్యాన్‌గారూ ఇది వినండి

Family Man Listen About House Making - Sakshi

ఆఫీసుకు వెళ్లి టైముకు ఇల్లు చేరుకుని భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ కూచునే వారిని ‘ఫ్యామిలీ మ్యాన్‌’ అని కితాబిస్తారు. కాని స్త్రీ ఉద్యోగానికి వెళ్లి కష్టపడితే ‘కెరీర్‌ ఓరియెంటెడ్‌ ఉమన్‌’ అంటారు.
మగవారు ‘డబ్బు సంపాదించని పని’ చేయరని నేషనల్‌  స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) తాజా నివేదిక తెలిపింది. అంటే డబ్బు రాని ఇంటి పని వారు చేయరు. దాంతో భారతదేశంలో స్త్రీలు రోజుకు
‘విలువ లేని’ 5 గంటల ఇంటి చాకిరీ చేస్తున్నారు. దేశంలో కేవలం 27 శాతం స్త్రీలనే ఉద్యోగాలు చేయనిస్తున్నారు. ఈ అసమానతపై గొంతెత్తే హక్కు స్త్రీలకు ఉంది
.

‘ఆడవాళ్లకు పనేం ఉంటుందండీ. చాడీలు చెప్పుకోవడం తప్ప. టీవీ సీరియల్స్‌ చూడటం తప్ప’ అని అంటూ ఉంటారు మగవారు. పూర్వం అనేవారు. రోజులు మారాయి అనుకుంటున్నారా? ఇప్పుడూ అంటున్నారు. భవిష్యత్తులోనూ అనకుండా అడ్డుకోవాలి. ‘స్త్రీలకు పనేముంటుందండీ.. ఒక అన్నం ఒక కూర వండేసి హాయిగా కూచోవడమే కదా’ అని కూడా అంటూ ఉంటారు. ఆ ఒక అన్నం, ఒక కూర ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఒకరోజు చేయమనాలి ఈ మగవారిని. వారంలోని ఏడురోజులు, నెలలోని ఐదు వారాలు, సంవత్సరంలోని పన్నెండు నెలలు వంట చేయడం... చేసి చూపించడం ఇలా అనేవారికి సాధ్యమా? స్త్రీలు చేస్తున్నారు. చేయలేకపోయినా చేస్తున్నారు. కుటుంబం మీద ప్రేమతో చేస్తున్నారు. వారు దానిని తప్పించుకోవాలని నిలదీస్తే పురుషుడి కాళ్ల కింద భూకంపం వస్తుందని వారికి తెలుసు. అంతమాత్రాన చేస్తూ పోనివ్వడమేనా?

వంటగది భారతం
నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌.ఎస్‌.ఓ) దేశంలోని స్త్రీ పురుషుల ఉపాధి, ఇంటిపనికి సంబంధించి 2109 జనవరి నుంచి డిసెంబరు వరకు నిర్వహించిన సర్వేలో స్త్రీలు ఎదుర్కొంటున్న అసమానత మరోసారి తేటతెల్లం అయ్యింది. దేశవ్యాప్తంగా లక్షా ముప్పైతొమ్మిది వేల ఇళ్లని, నాలుగున్నర లక్షల మంది వ్యక్తులను సర్వే చేసి ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం దేశంలో 70 శాతం మంది పురుషులు ఉద్యోగ, ఉపాధుల్లో తమ వాటా ఆక్రమించుకున్నారు. 21 శాతం మంది మహిళలే ఉద్యోగ, ఉపాధుల్లో చోటు సంపాదించుకుంటున్నారు. ఇక దేశంలో 90 శాతం మంది స్త్రీలు ఇంటి పనిలో తలమునకలుగా ఉన్నారు. కాని పురుషులు మాత్రం 27 శాతం మంది మాత్రమే ఇంటి పనులు చేస్తున్నారు. ఈ సర్వేలో ఎక్కువ మంది పురుషులు (15–59 వయసు మధ్యవారు) తాము ‘డబ్బు రాని పని’ చేయము అని చెప్పారు.

ఇలా చెప్పే వీరంతా ‘డబ్బు రాని’ ఇంటి పని గురించి తమకు ఎటువంటి బాధ్యత లేదని చెప్పినట్టే అయ్యింది. దాంతో స్త్రీలు ఉద్యోగం చేసినా చేయకపోయినా రోజుకు ఐదు గంటల పాటు ఇంటి పనికి నడుము విరుచుకోవాల్సి వస్తోందని ఈ నివేదిక తెలియచేసింది. పురుషుడు ఉద్యోగం కోసం 8 గంటలు పని చేసి 30 వేలు సంపాదిస్తే స్త్రీ ఇంట్లో  అందులోని అరవై శాతం జీతానికి సమానమైన శ్రమ చేస్తోంది. ఇది కాకుండా భర్తకు సేవ, పిల్లలకు సేవ అదనం. ఈ నివేదిక ప్రకారం దేశంలో పురుషులు ఇంటి పని కోసం రోజుకు 97 నిమిషాలు, పిల్లల కోసం 1 గంట 16 నిమిషాలు కేటాయిస్తున్నారు. మిగిలిన సమయమంతా తల్లులదే అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.

గౌరవం అవసరం
నలుగురుకి అవసరమైన పప్పుచారు శ్రద్ధగా వండాలంటే అందుకోసం కనీసం పదిహేను రకాల పనులను సమన్వయం చేసుకోవాలి. కాని అది పని కాదు మగవారి దృష్టిలో. ఒక రోజులో సరుకుల షెల్ఫ్‌ను స్త్రీలు ఎన్నిసార్లు తెరిచి మూస్తారో అన్నిసార్లు ఒక వ్యాయామం కోసం పురుషులను తెరిచి మూయమంటే వారికి అందులోని శ్రమ అర్థమవుతుంది. విచారించాల్సిన విషయం ఏమిటంటే తమ మేధను, చదువును, భిన్నమైన అభిరుచులను, సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని స్త్రీ భావిస్తే కనుక బయట ఎంత పని చేయాలో అంత పని చేసి ఇంటి పనిని కూడా’ తప్పించుకోవడానికి వీల్లేకుండా’ చేస్తేనే పురుషుడు సంతృప్తి చెందుతాడు.

ఆమె వాటి నుంచి తప్పించుకుంటే కొద్దిగా ఇంటికి దూరమైతే ‘కెరీర్‌ ఓరియెంటెడ్‌’ అని ముద్ర వేస్తాడు. తాను మాత్రం ఆఫీసులో చేసిన శ్రమ చాలు అని ఇంటికి చేరుకుని పైజమా, టీషర్ట్‌ వేసుకుని టీవీ ముందు కూచుంటే ‘ఫ్యామిలీ మ్యాన్‌’ అనిపించుకుంటాడు. అతను ఇంటికి దూరమై కష్టపడినా ప్రశంసే, ఇంట్లో కూచున్నా ప్రశంసే. స్త్రీకి ప్రత్యేకంగా ఇవి దక్కవు. పని చేయని పురుషుణ్ణి ఏ ఆఫీసూ ఉంచుకోదు. పని చేయకపోయినా పురుషుడు హాయిగా ఇంట్లో ఉండొచ్చు. పని చేస్తున్నవారి శ్రమపై ఆధారపడొచ్చు. దీని గురించి ఆలోచించండి ఫ్యామిలీ మ్యాన్‌ గారు. దీనిని న్యాయంగా, ప్రజాస్వామికంగా ఎలా మార్చవచ్చో చూడండి. అప్పుడే మీరు నిజమైన ఫ్యామిలీ మ్యాన్‌ అవుతారు.
– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top