మే 10 మదర్స్ డే ప్రత్యేక కథనాలు
పిల్లలకు క్రష్ ఉంది. మరి అమ్మకు ఉందా? అమ్మను బాగా చూసుకోవాలనుకునే కూతురి సాయానికి, అత్తగారిని సౌకర్యంగా చూడాలనుకునే కోడలు జాబ్‌కు వెళ్లడానికి, అమ్మ ఒక్కర్తే ఉంటే సేఫ్ కాదేమో అనుకునే కొడుకు కోడళ్ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మను బాగా చూసుకునే ‘డే కేర్ సెంటర్’ ఎందుకు ఉండకూడదు? ఉన్నాయి. వాటితో మనం పొందే సాయం ఏమిటి?
చంటి పిల్లలను గుండెలకు హత్తుకుని పెంచుకోవాలి. కాని మారిన కాలంలో, పని చేయక తప్పని పరిస్థితుల్లో వారిని ‘క్రష్’లో వదలడం అలవాటు చేసుకున్నాం. మన పని ముగియగానే వెళ్లి తెచ్చుకుంటున్నాం. అమ్మకు కూడా ఈ ఏర్పాటు ఎందుకు ఉండకూడదు? ‘ఎల్డర్ కేర్ సెంటర్’లు ప్రభుత్వ, ప్రయివేటు ఆధ్వర్యంలో ఎన్ని వస్తే అంత మంచిది కదా...
ఒక ఆందోళన పోయింది...
స్వాతికి చాలా రోజులుగా ఆందోళన ఉంది. ఇంట్లో అత్తగారు ఉంటారు. తను, భర్త ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లాలి. అత్తగారు ఉండటం తనకు ఇష్టమే. కాని ఆమె వయసు 73. గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు హుషారు లేదు. డిమెన్షియా లక్షణాలు కనిపిస్తున్నాయి. బి.పి. మాత్ర వేసుకోవడం మర్చిపోతుంది. ఒకవేళ తాము లేనప్పుడు కాలు జారి పడితే? గ్యాస్ ఆన్ చేసి మర్చిపోతే? ఫోన్ చేస్తే ఒక్కోసారి తీయదు. ఆమె టీవీ ముందు ఉండి ఫోన్ తీయకపోతే తనకు ఆఫీసులో చాలా టెన్షన్ వచేస్తుంది– ఏమయ్యిందో అని. సాయంత్రం తను ఇంటికొచ్చి చూసే వరకు అత్తగారికి మరో మనిషి దిక్కు లేదు. ఇదంతా మైండ్‌లో తిరుగుతుంటే సరిగా పని చేయలేకపోతోంది. పైగా ఏదో గిల్ట్. ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్తగారిని బాగా చూసుకునే, అత్తగారి వయసు వాళ్లు తోడు ఉండే, కబుర్లు చెప్పే, కాలక్షేపం చేయించే ఒక ‘ఎల్డర్ డే కేర్ సెంటర్’ ఎందుకు ఉండకూడదు. అని ఆలోచించింది. వెతికింది. అలాంటిది ఉంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.
ఇదేదో బాగుందే..!
హైదరాబాద్‌లో కొంచెం దూరంలో దొరికిన ‘సీనియర్ డే కేర్ సెంటర్’లో స్వాతి తన అత్తగారికి అడ్మిషన్ తీసుకుంది. దీనికి ముందు భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. తర్వాత పెద్దావిడకు వివరించి చెప్పారు. ముందు ఆమె కొంచెం ఇబ్బంది పడినా ‘సరే... కొన్నాళ్లు చూస్తాను... నచ్చితే సరే’ అంది. అడ్మిషన్ అయ్యాక అత్తగారి జీవితం మారింది. ఆమె ఉదయాన్నే లేచి రెడీ అయితే ఉదయం తొమ్మిదికి వ్యాన్ వచ్చి తీసుకెళ్తుంది. సీనియర్ డే కేర్ సెంటర్‌లో ఆమెలాంటి ఇరవైమంది ఇదివరకే ఉన్నారు. వారంతా అమ్మమ్మలు, నానమ్మల వయసు వారే. పరిచయాలై మొదటి రోజే ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ ఉదయం 10 గంటలకు యోగా, 11 గంటలకు భజన, మధ్యాహ్నం ఫిజియో, అందరితో కలిసి భోజనం... బీపీ, షుగర్ చెక్ చేస్తారు. మాత్ర వేస్తారు. సాయంత్రం నాలుగుకి గేమ్స్, అయిదు గంటలకు స్కూల్ నుంచి వచ్చిన మనవడితో వీడియో కాల్ చేయిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి.
మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్టే...
‘దీనిని సీనియర్ డే కేర్ సెంటర్ అనడం కంటే అమ్మమ్మ–తాతయ్యల బడి అనడం సరదాగా ఉంటుంది. అందరం ఈ వయసులో మళ్లీ బడికొచ్చినట్టే కదా’ అంటారు సీనియర్ కేర్ సెంటర్‌లో చేరినవారు. ‘ఇంట్లో ఉంటే నేను పేషెంట్‌ని. ఇక్కడికి వస్తే పర్సన్‌ని. ఇక్కడ నాకు పేరు ఉంది, పాట ఉంది, పని ఉంది’ అంటారు మరొకరు. హైదరాబాద్‌లో ఇప్పటికి మూడు నాలుగు ప్రయివేట్ ఎల్డర్ కేర్ సెంటర్లు నడుస్తున్నాయి. బెంగళూరులో ‘నైటింగేల్స్ ఎల్డర్ కేర్’, చెన్నైలో ‘ధరణి సీనియర్ కేర్’ పేర్లతో ఇవి ఉన్నాయి. హైదరాబాద్‌లో, తెలంగాణ అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లు 40 వరకూ ఉన్నాయి. వీటిలో ఖర్చు చాలా తక్కువ.
మరి ఖర్చు ఎంత?
ప్రయివేట్ ఎల్డర్ కేర్ సెంటర్లలో నెలకు ఖర్చు రూ.8,000 నుంచి రూ.15,000 ఉంటుంది. పెద్దవాళ్లకోసం ఫుల్ టైమ్ అటెండర్‌ని ఇంట్లో పెడితే 18,000 కు పైనే అవుతుంది. పైగా ఆ అటెండర్‌కి ట్రైనింగ్ ఉండదు. ఇక్కడ ట్రైన్డ్ నర్సులు, ఫిజియోథెరపిస్టులు ఉంటారు.‘అమ్మ సేఫ్’ అనే అనే ధైర్యం ఉంటుంది. ప్రమోషన్ మిస్ కావడం, జాబ్ మానేయడం ఉండదు. ఎందుకంటే ‘హెల్ప్‌ఏజ్ ఇండియా’ లెక్కల ప్రకారం దేశంలో 62 శాతం మహిళలు తల్లిదండ్రుల బాగోగుల కోసం కెరీర్‌ని త్యాగం చేస్తున్నారు. అదే ‘డే కేర్’ ఉంటే ఆ త్యాగం అవసరం లేదు. పైగా ఇలాంటి సెంటర్ల వల్ల అమ్మకు/అత్తగారికి ఒంటరితనం బాధ పోయి మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. కాబట్టి మారిన కాలానికి తగ్గట్టు అమ్మ/కూతురు.. అత్త/కోడలు మారాలి. అందరూ అమ్మలే. అమ్మలు బాగుండాలి.
మంచి డే కేర్ ఎలా ఎంచుకోవాలి?
మీరు అమ్మను ఇక్కడ చేర్చాలనుకుంటే ఈ కింద పాయింట్స్ చెక్ చేయండి.
1. అయిదు మందికి కనీసం ఒక ట్రైన్డ్ నర్స్ ఉండాలి.
2. సిసి టీవీ ఉందా...ఫోన్‌లో లైవ్ చూసే సౌకర్యం ఉందా కనుక్కోండి.
3. ఎమర్జెన్సీ సమయానికి తగినట్టుగా దగ్గర్లో ఆస్పత్రితో టై–అప్, అంబులెన్స్ సౌకర్యం ఉందా చూడండి.
4. యోగా, ఫిజియో, భజన, గేమ్స్– రోజూ షెడ్యూల్ ఉండాలి.
5. వారానికి రెండుసార్లు జనరల్ ఫిజీషియన్ విజిట్ ఉండాలి.
– సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


