అమ్మ పుట్టినరోజు | evaram katha funday | Sakshi
Sakshi News home page

అమ్మ పుట్టినరోజు

Mar 22 2026 12:55 AM | Updated on Mar 22 2026 12:55 AM

evaram katha funday

భాద్రపద మాసం, ఋషి పంచమి. నిండా పూలతో మందారం చెట్టు ఆకుపచ్చ చీరలో అప్పుడే కుంకుమ పూజ చేయించుకున్న అమ్మవారిలా ఉంది. ఇంటిముందు విరజాజి మొక్క రోజూ ఫోన్‌లో పలకరించే కూతురిలా పరిమళం వెదజల్లుతోంది.అటూ ఇటూ ఉన్న మామిడి, పనస సీజనల్‌ చెట్లు అప్పుడప్పుడూ వచ్చిపోయే కొడుకుల్లా గంభీరంగా ఉన్నాయి.‘‘అమ్మా రావాలి కేక్‌ కరిగిపోతోంది’’ చిన్నోడు తొందరపెట్టాడు.‘‘అయిపోయిందిరా వచ్చేస్తున్నాం’’ గదిలోంచి అమ్మకి పట్టుచీర కట్టి తీసుకొచ్చింది కూతురు.  పెద్ద కొడుకు కవర్‌లోంచి శాలువా తీసి ట్యాగ్‌ చింపి పట్టుకుని రెడీగా ఉన్నాడు. 

జయంతి సోఫాలో కూర్చుంది. ఎదురుగా టీపాయ్‌ మీద ‘బిస్కఫ్‌’ కేక్‌ ఆమె వయసు డెబ్బై ఐదుగా ప్రకటిస్తోంది. కొడుకులిద్దరూ, కోడళ్ళు, కూతురు ఆమె చుట్టూ కూర్చున్నారు. అదే వీధిలో ఉంటున్న చిన్ననాటి స్నేహితురాలు శాంతమ్మ కూడా వచ్చింది. అల్లుడు కొంచెం దూరంగా కూర్చుని ఫోన్‌ చూసుకుంటున్నాడు. అతనికీ అత్తగారంటే అభిమానమే కాని, ఇలాంటి ఆర్భాటాలు అంతగా నచ్చవు. ఎక్కడెక్కడో ఉన్న మనవలు వీడియో కాల్‌లో చూస్తుండగా కేక్‌ కట్‌ చేసింది. పెద్దకొడుకు శాలువా కప్పాడు. పెద్దకోడలు అక్షింతలు కలిపి తెచ్చింది. 

ఒక్కొక్క జంటా కాళ్ళకి నమస్కారం పెడితే, బట్టలమూటతో వీధి వీధి తిరిగే బంగారయ్య దగ్గర కొన్న లుంగీ, తువ్వాలు, డజను జేబురుమాళ్ళు, ఆడవాళ్ళకి చీర జాకెట్టుతోబాటు పసుపు కుంకుమ, కవర్లో కొంత డబ్బు సర్ది ఉంచి కూతురిచేత అందరికీ ఇప్పించి, తనని కూడా తీసుకోమంది. వాళ్ళు సంతోషంగా తీసుకున్నారు. చిన్నోడు అక్క చేసిన మామిడికాయ పులిహోర క్యాన్‌తో తీసుకెళ్లి పక్కవీధిలో ఉన్న ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ కి ఇచ్చి వచ్చాడు. జయంతి ఆరోజు ఉపవాసం ఉండటంతో మిగిలిన వాళ్లంతా కలిసి భోంచేస్తూ కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం టీ తాగి రాత్రికి ఇంత పులిహోర బాక్స్‌ కట్టుకుని ఎవరి ట్రైన్‌కి వాళ్ళు వెళ్లిపోయారు. దగ్గరే కాబట్టి కూతురు అల్లుడు కార్లో బయలుదేరారు. అలా ఆ ఏడు కూడా జయంతి  పుట్టినరోజు వినాయకచవితి మర్నాడు ఘనంగా జరిగింది. జయంతి, ఆమె పెంచుకున్న వనం, పనమ్మాయి  మిగిలారు. 
∙∙ 
‘‘ఏవండీ అత్తయ్యగారి ఫోను. చాలాసార్లు చేశారు’’ అంది రాధ ఫోన్‌ చిన్నోడి చేతికిస్తూ.‘‘టైం లేదు, దార్లో మాట్లాడతాలే’’ అన్నాడు టక్‌ సరిచేసుకుంటూ.‘‘చాలాసార్లు చేశారు. ఏం అర్జెంటో? ఒకసారి మాట్లాడొచ్చు కదా’’ అంది రాధ కొంచెం ఆందోళనగా ‘పోనీ నేనెత్తనా’ అన్నట్టు సైగ చేస్తూ.‘‘అదేం లేదు. సెప్టెంబర్‌ లో ఆవిడ పుట్టినరోజు కదా. మళ్ళీ టిక్కెట్లు దొరకలేదంటామని అరవైరోజుల ముందే చెప్పటాని కయ్యుంటుంది’’ అన్నాడతను లంచ్‌ బాక్స్‌ బ్యాగ్‌లో పెట్టుకుంటూ.‘‘అవును కదూ. అయితే మనం ఊరెళ్తున్నామోచ్‌’’ అంది రాధ చిన్నపిల్లలా. ‘‘లేదు, లేదు. ఈసారి వెళ్ళటానికి కుదరదు’’ అన్నాడతను విసుగ్గా.‘‘అదేంటండీ, ప్రతీ ఏడూ వెళ్తున్నాం. పేరుకి ఆవిడ పుట్టినరోజైనా ఎంజాయ్‌ చేసేది మనమే కదా. ఓ వేడుకలా జరుగుతుంది. నాకెంతో ఇష్టం అలా గడపటం’’ అందామె గుర్తుచేసుకుంటూ.

‘‘నీకేం, చక్కగా ఆవిడిచ్చిన చీర కట్టుకుని డబ్బులు తీసుకుంటావు’’ అంటూ ఉండగానే రాధ అడ్డుపడి, ‘‘పాపం పెద్దావిడ అంత అభిమానంగా పిలిస్తే అలా అంటారేంటి’’ అంది.దానికతను సోఫాలో కూర్చుని షూ వేసుకుంటూ, ‘‘నిజమే. ఆవిడదేం పోయింది? అందరూ రావాలంటుంది. మన నలుగురూ ఫ్లైట్‌లో వెళ్ళొస్తే కనీసం ఏభైవేలవుతుంది. పిల్లలతో రైల్లో రోజున్నర కూర్చోగలమా. పోనీ వాళ్ళని వదిలేసి వెళదామా అంటే మనం ఎదురుగా ఉంటేనే చదవట్లేదు. ఇంక వదిలి వెళితే ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలిచి గందరగోళం చేస్తారు. పైగా చవితి మర్నాడు వర్కింగ్‌ డే. అమ్మ పుట్టినరోజుకి ఆఫీస్‌లో వారం సెలవంటే నవ్వుతారు. వెళ్లినంతకాలం వెళ్ళాం. ఇక చాల్లే. నువ్వు కూడా ఓ రెండు రోజులు ఫోనెత్తకు. తర్వాత ఫోన్‌ చేసి టికెట్స్‌ అయిపోయాయి అని చెబుదాం. పండక్కి ఎలానూ వెళతాం కదా.’’ అన్నాడు.

‘‘పోనీ ఇప్పుడెళ్ళి పండక్కి మానేయొచ్చుగా?’’ అందామె.‘‘పండక్కి నా ఫ్రెండ్స్‌ అంతా వస్తారు. వాళ్ళని కూడా కలవొచ్చు’’ అన్నాడతను కార్‌ కీస్‌ తీసుకుని బయల్దేరుతూ. ఆమె చేతిలో ఫోన్‌ మోగుతూనే ఉంది. భర్త వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయింది రాధ.∙ ‘‘చెప్పమ్మా’’ అంది పద్మ భర్తకి ఇడ్లీలోకి రెండో పచ్చడి మిక్సీ చేస్తూ. ‘‘అదేనే ఈ ఏడు చవితి సెప్టెంబర్‌ ఆరున పడింది. ఆ మర్నాడే నా పుట్టిన రోజు. ఓ నాలుగు రోజులు ముందుగా వస్తే, జంతికలు, మిఠాయి చేసుకుందాం. మీరు చవితి ఇక్కడే చేసుకోవచ్చు’’ అంది జయంతి.‘‘అమ్మా ఆయనతో ఈ టాపిక్‌ ఎత్తాలంటేనే భయంగా ఉంది. ‘అస్తమానూ మీ ఇంటికి నన్ను రమ్మనకు, కావాలంటే నువ్వెళ్లిరా’ అని తిడుతున్నారమ్మా’’ అంది పద్మ మిక్సీ జార్లోని పచ్చడి బాక్స్‌లోకి ఒంపుతూ.

‘‘అదేంటే, పెళ్ళై నలభై ఏళ్లయినా ఇంకా అత్తవారింటికి వెళ్లే అదృష్టం ఎంతమందికి ఉంటుంది. ఉన్న వారం రోజులూ ఎంత మర్యాదగా చూస్తాం. అక్కడైనా అతను ఇంట్లో కూర్చోవటమేగా. అదేదో ఇక్కడే కూర్చోమను. అల్లుడుగారికి ఫోన్‌ ఇవ్వు నేను మాట్లాడతా’’ అనగానే టిఫిన్‌ ప్లేట్‌తో బాటు ఫోన్‌ కూడా భర్తకిచ్చింది పద్మ. దగ్గరి బంధువే కావటంతో జయంతికి అల్లుడంటే అభిమానంతో బాటు చనువెక్కువ.   ‘‘నమస్తే అత్తయ్యా. మీ ఆరోగ్యం బావుందా?’’ అన్నాడతను.‘‘బావున్నాను అల్లుడుగారూ. అదే.. వినాయకచవితికి మీరు అమ్మాయిని తీసుకుని రావాలి, ఆ మర్నాడు నా పుట్టినరోజుకి  కూడా ఉండి వెళ్ళాలి’’ అంది జయంతి అభిమానంగా.  ‘‘శుభం అత్తయ్యా. 

మీరు ఇలా నిండు నూరేళ్లు పుట్టినరోజులు జరుపుకోవాలి’’   ‘‘అది సరే, అల్లుడూ మీరు రావాలి’’దానికతను ‘‘అత్తయ్యా, నేనూ పెద్దవాడినైపోయాను. ఎక్కడివాళ్ళు అక్కడ ఇంత తిని రెస్ట్‌ తీసుకుంటే మంచిది. మీ జనరేషన్‌ వాళ్లకి ఇమ్యూనిటీ ఎక్కువ. మా దినచర్యలో చిన్న మార్పు వచ్చినా దగ్గో, జలుబో వచ్చేస్తోంది. ఈ తిరుగుళ్లు వల్ల, నీరు మార్పిడి వల్ల ఏమైనా వస్తే మీ పిల్లలు దేశంలోనే ఉన్నారు, వస్తారు.  నా పిల్లలు విదేశాల్లో ఉన్నారు, రాలేరు, అక్కడ స్థిమితంగా ఉండలేరు. అంచేత మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీ అమ్మాయికి నచ్చచెప్పండి. మీరు పెద్దవారు, నొప్పిస్తే క్షమించండి’’ అన్నాడు అనునయంగా. జయంతి మరేం మాట్లాడలేకపోయింది. 

జయంతి పెద్దకొడుకు ఇల్లు. ‘‘ప్రశాంతీ’’ పిలిచాడు సాగర్‌.‘‘మీకు రెండోసారి కాఫీ ఇచ్చేసినట్టు గుర్తు. కావాలంటే మళ్ళీ ఇస్తాను’’ అంది ప్రశాంతి పూజకి ఏర్పాటు చేసుకుంటూ. ‘‘అదికాదు నీతో ఓ విషయం మాట్లాడాలి’’‘‘నేను దేవుళ్ళని తోముకోవాలి. ఓ గంట పడుతుంది. అంతవరకూ టిఫిన్‌ చెయ్యను. టాబ్లెట్‌ కూడా వేసుకోటానికి లేదు. ఈ మూడ్‌లో మీరు చెప్పే విషయం నాకు నచ్చినదైతే పరవాలేదు, నచ్చనిదైతే కొంచెం నెగటివిటీ పెరుగుతుంది. అదే టిఫిన్‌ చేసి మాత్ర వేసుకున్నాక ప్రశాంతంగా వింటే ఒకవేళ నచ్చకపోయినా మనం శాంతంగా పరిష్కరించుకోవచ్చు.  ఇప్పుడు చెప్పండి ఏమిటి విషయం’’ అంది ప్రశాంతి దగ్గరకొచ్చి.  ‘‘అర్జెంటేమీ లేదులే. నీ పని చూడు. తర్వాత మాట్లాడుదాం’’ అన్నాడతను పేపర్‌ తిరగేస్తూ. 

ఓ గంట పోయాక అతనికి టిఫిన్‌ ఇచ్చి, తనూ తెచ్చుకుని ఎదురుగా కూర్చుని ‘‘ఇప్పుడు చెప్పండి’’ అంది ప్రశాంతి. ‘‘అదే అమ్మ ఫోన్‌ చేసింది’’‘‘అవునా!  ఏమిటట? బావున్నారా?’’ ‘‘హా! బావుంది. అదే భాద్రపద మాసంలో ఆవిడ పుట్టినరోజు కదా. ఎప్పటిలానే రమ్మంటోంది’’ అన్నాడు నసుగుతూ. ‘‘మీరేమన్నారు?’’ అడిగింది ‘‘నిన్నడిగి చెబుతానన్నాను’’ ‘‘దానికి ఆవిడేమన్నారు?’’ అతనేం మాట్లాడలేదు.   ‘‘పర్లేదు చెప్పండి’’ ‘‘భార్యకి సమాన విలువ ఇవ్వటం, ఏదైనా నిర్ణయం కలిపి తీసుకోవటం, ఇవన్నీ నేనూ సమర్థిస్తానురా. కానీ ఇంత చిన్న విషయం కూడా ఆవిడని కనుక్కుని చెబుతాను అనటం అన్యాయంరా’’ తల్లి అన్న మాటలు గుర్తు చేసుకుని తలదించుకున్నాడు. 

‘‘అర్థమైంది’’ అంది ప్రశాంతి నెమ్మదిగా ఎరుపెక్కుతూ. ‘‘అలా అని కాదు శాంతీ, ఆవిడ అన్నది కూడా నిజమేగా, ఇది చాలా చిన్న విషయం’’ అన్నాడతను నెమ్మదిగా.‘‘నిజమే. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. మామూలుగా అయితే వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు. రాత్రి స్వామి పవళింపు సేవ అనంతరం ఎక్కితే సుప్రభాత సేవ టైంకి దిగిపోతాం. చక్కగా మీకూ నాకూ బట్టలు పెడతారు, మనం కూడా ఓ చీర, స్వీట్స్‌ కొని పట్టికెళతాం, ఓ పూట అందరం కలుస్తాం. కానీ ఆ ముందురోజు వినాయక చవితి. ఇంట్లో వినాయకుణ్ణి పెట్టుకుని దీపం, నైవేద్యం పెట్టకుండా ఇల్లు తాళం పెట్టటం మంచిది కాదు. అలా అని మీరొక్కరూ వెళితే ఇప్పటికే గడుసుదానిగా పడిన ముద్ర మరింత బలపడుతుంది. పోనీ మీరు నా తరఫున బలంగా చెబుతారా అంటే ఏమీ మాట్లాడరు. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం’’ అని, ఇలా  కొనసాగించింది. 

‘‘ఈ వయసులో ఆవిడకి ఈ సరదాలు అవసరమా అని నేననను. చెప్పానుగా ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం?’’ సాగర్‌  ఏమీ మాట్లాడలేదు. ∙∙ మరో నాలుగు సంవత్సరాల తర్వాత  భాద్రపద మాసం, ఋషి పంచమి.పనమ్మాయి సాయంతో జయంతి తలస్నానం చేసింది. పెద్దకోడలు కేక్‌ ఆర్డర్‌ పెట్టింది. చిన్న కొడుకు ఫ్లవర్స్‌ పంపాడు. కూతురు ఆన్‌లైన్‌లో చీర పంపింది. 
అందరూ వీడియో కాల్‌లోకి వచ్చారు.  జయంతి కేక్‌ కట్‌ చేసింది, ఆమె ఎడం కన్ను అదే పనిగా నీరు కారుతోంది. మొహం పొంగి ఉండటం గమనించి కాళ్ళ వాపు చూసి, తనకున్న సోషల్‌ మీడియా పరిజ్ఞానంతో డై యూరెటిక్‌ టాబ్లెట్‌ వేసుకోమన్నాడు చిన్నోడు. 
పండక్కి వచ్చినప్పుడు టోటల్‌ బాడీ చెకప్‌ చేయిద్దామన్నాడు పెద్దోడు. అంతా ఫోన్‌ పెట్టేసారు. మూణ్నెల్లు ముందే ఎవరి కవర్లలో వాళ్ళకి సర్ది ఉంచిన బట్టలు, పసుపు కుంకుమ ఎదురింటి అబ్బాయికిచ్చి కొరియర్‌ చేయించింది. డబ్బులు కూడా అతనికే ఇచ్చి యాప్‌ ద్వారా పంపమంది. కేక్‌ని వీధిలో పిల్లలందరికీ పంచింది పనమ్మాయి.  
∙∙ 
ధనుర్మాసం.జయంతికి వొంట్లో బాగోలేకపోవటంతో అందరూ పండక్కొచ్చారు. అంతకుముందు హాల్లోనే కూర్చుని హడావిడి చేసే జయంతి గదిలో మంచానికి పరిమితమైంది. పెద్దగా తిండి సహించటం లేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు, వార్ధక్యం మినహా పెద్దగా జబ్బులేవీ బయటపడలేదు. ఆకలి పెరగటానికి టానిక్‌ రాసి పంపేశారు.  ‘పుట్టినరోజు జరుపుకోకపోతే ఇంతలా బెంగ పడిపోవాలా’ అని పిల్లలు బాధపడ్డారు. ‘బర్త్‌డే బ్లూస్‌’ గురించి, ‘నార్సిజం’ గురించి కాసేపు మాట్లాడుకున్నారు. అంతలో శాంతమ్మ మనవడి సాయంతో వచ్చింది. జయంతిని పలకరించి హాల్లోకొచ్చింది. జయంతి పిల్లలు ముగ్గురూ ఆవిడని బాగా ఎరుగుదురు. ఆవిడకి కాఫీ ఇచ్చి కూర్చున్నారు. 

‘‘అదే పిన్నీ, టెస్ట్‌లు చేయిస్తే అంతా నార్మల్‌గానే ఉంది అన్నారు. ఎనభై వచ్చాయి, ఇంకా ఒంటరిగా ఉండొద్దు, వచ్చెయ్యమంటే వినదు. ఈమధ్య ఏవో కారణాలవల్ల ముగ్గురం రాలేక పోయాం. అప్పటి నుంచి ఇలా మంచం పట్టింది. మా చిన్నప్పుడెప్పుడూ అమ్మ తన పుట్టినరోజు జరుపుకున్నట్టు గుర్తులేదు. అదేంటో మేమంతా వేరే ఊళ్ళల్లో స్థిరపడ్డాకే మొదలెట్టిందీ అలవాటు’’ అని విసుక్కున్నారు.  శాంతమ్మ అంతా విని, నెమ్మదిగా చెప్పటం మొదలు పెట్టింది. ‘‘మనుషుల మధ్య ఇప్పటికీ గోడలుగా ఉన్న కులం అప్పట్లో కోటలుగా ఉండేది. ఒకర్నొకరు ఇష్టపడ్డ కారణానికి  రెండు కుటుంబాలనీ వదులుకోవలసి వచ్చింది. అప్పుడు మీరు చిన్నపిల్లలు. మీ నాన్న పుట్టినరోజున శాంతి ఆశ్రమానికి వెళ్లొస్తూ ఉండగా ఓ కారు గతితప్పి దూసుకొచ్చింది. మీ అమ్మని తప్పించబోయే ప్రయత్నంలో మీ నాన్న ప్రమాదానికి గురయ్యారు. 

ఆసుపత్రిలో రెండు నెలలు ట్రీట్‌మెంట్‌ జరిగినా లాభం లేకపోయింది. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు దూరమైన బాధ ఆ క్షణం అతనిలో స్పష్టంగా తెలిసింది. చివర్లో వాళ్ళు వచ్చినా ఐసీయూలో ఒకరి తర్వాత ఒకరిని, అదీ కొన్ని నిమిషాలపాటు మాత్రమే చూడగలిగారు. అప్పుడే ఆయన తన చివరి కోరికగా మీరంతా పెద్దయ్యాక ఎక్కడెక్కడ స్థిరపడినా కనీసం ఏడాదికోసారైనా కలిసి సంతోషంగా గడిపేలా చూడమని మీ అమ్మకి చెప్పాడు. పండక్కి కలుద్దామంటే ఆడపిల్ల వాళ్ళ అత్తవారింటికి వెళుతుంది. పెద్దోడిని అతని భార్య తన పుట్టింటికి తీసుకువెళ్తుంది. చిన్నోడు వచ్చినా వాడి స్నేహితులతో గడపటానికే సరిపోతుంది’’ అనగానే ముగ్గురూ తలదించుకున్నారు. 

ఆమె కొనసాగించింది. ‘‘మీ నాన్న పుట్టినరోజు వేడుకంటే ఎవరైనా ఆక్షేపిస్తారేమోనని అదే రోజు మీ అమ్మ తన పుట్టినరోజుగా మిమ్మలందర్నీ రప్పిస్తోంది. ఆ రోజు మీరంతా కలిస్తే మీ నాన్న ఆత్మకి శాంతి కలుగుతుందని తన నమ్మకం. ఈమధ్య మీరు రావటం మానేశారు. బహుశా అదే ఆమె బెంగకి కారణం కావొచ్చు. ఈ విషయాలేవీ మీ అమ్మెప్పుడూ మీకు చెప్పాలనుకోలేదు. నేను చెప్పినట్టు తనకి తెలియనివ్వకండి’’ అని, కాసేపాగి ఆయాసం తగ్గాక పక్కనే ఉన్న వాటర్‌ బాటిల్‌ తీసుకుని కొద్దిగా తాగింది.ఇదంతా విని అందరి కళ్ళూ చెమర్చాయి. తండ్రి మరణం, తల్లి కారుణ్య నియామకంలో ఉద్యోగంలో చేరి తమని పెంచి ప్రయోజకులని చెయ్యటం, ఇదంతా తెలుసు. కానీ ఈ పుట్టినరోజు వేడుకలు అమ్మ సరదా అనే అనుకున్నారు ఇంతకాలం. 

వయసు, బాధ్యతలూ, పెరుగుతున్నకొద్దీ పుట్టినరోజుకి తను చేసే  ఆర్భాటాన్ని చూసి విసుక్కుని రాకుండా తప్పించుకుంటున్న మాట వాస్తవం. ఈ విషయం శాంతమ్మ ద్వారా తెలిశాక అంతా ఓ నిర్ణయానికొచ్చారు. ముందుగా చిన్నవాడు మొదలుపెట్టాడు. ‘‘మనకి అమ్మే నాన్న. రాబోయే పుట్టినరోజు అమ్మకి ఎనభై నిండుతాయి. ఘనంగా చేద్దాం.’’ అన్నాడు. ‘‘వీలైంతమందికి అన్నదానం చేద్దాం’’ అంది కూతురు.  ‘‘వస్త్రదానం కూడా చేస్తే మంచిది. అది కూడా ప్లాన్‌ చేద్దాం’’ అంది పెద్ద కోడలు.అందరూ సంతోషంగా లేచి వెళ్లి తల్లికి ఈ విషయం చెప్పారు. జయంతి సంతోషించింది. లేచి కొంత అన్నం తింది. తమతో రమ్మని ఎంత బతిమిలాడినా జయంతి రాలేనంది. ‘ముక్కనుమ’ అవగానే అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరారు. 

భాద్రపద మాసం –  ఋషి పంచమి.ముందురోజు చవితి కావటంతో ‘పత్రి’ కోసం కొమ్మల్ని అర్పించుకోవటం వల్లో, మరో కారణం చేతో,  చెట్లన్నీ బోసిపోయినట్లున్నాయి. అనుకున్నట్టుగానే అందరూ వచ్చారు. పేదలకీ, పనివాళ్ళకీ భోజనాలు పెట్టి, బట్టలు పంచారు. ప్రతీ ఏటా అందరూ ఇలా కలవాలని మాట్లాడుకున్నారు. కానీ ఇవేవీ చూడ్డానికి జయంతి లేదు.      పిల్లలు ఏడాదికొకసారైనా కలవాలనే భర్త కోరిక తీర్చలేకపోయాననే లోటు తప్ప ఆమెదేమీ అకాలమరణం కాదు. తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి, సంపూర్ణమైన జీవితం గడిపాకే శివైక్యం పొందింది. జగమంత పందిరేసినా ‘జయంతి’ జన్మదినం కాబోదు. జన్మంత ప్రేమ ఒలకపోసినా పోయినవాళ్ళు  తిరిగిరారు. ఏదైనా ఉన్నప్పుడే!  

రోజు మీరంతా కలిస్తే మీ నాన్న ఆత్మకి శాంతి కలుగుతుందని తన నమ్మకం. ఈమధ్య మీరు రావటం మానేశారు. బహుశా అదే ఆమె బెంగకి కారణం కావొచ్చు. ఈ విషయాలేవీ మీ అమ్మెప్పుడూ మీకు చెప్పాలనుకోలేదు. 


∙ఉమా మహేష్‌ ఆచాళ్ళ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement