ఎలాన్‌ మెచ్చిన మన ఎల్లుస్వామి

Elon Musk Opted Indian Origin Ashok Elluswamy As Autopilot Project Head - Sakshi

ఏ వ్యాపారికైనా లాభం ముఖ్యం. అమెరికన్‌ ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ అండ్‌ క్లీన్‌ఎనర్జీ కంపెనీ ‘టెస్లా’ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌కు లాభాలు అనేవి తరువాత విషయం. రకరకాలుగా జల్లెడ పట్టి చురుకైన, చురకత్తుల్లాంటి, తెలివైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం అతడి  తిరుగులేని విజయసూత్రం. తన ప్రతిష్ఠాత్మకమైన ‘ఆటోపైలట్‌’ హెడ్‌గా భారతసంతతికి చెందిన అశోక్‌ ఎల్లుస్వామిని ఎంపిక చేసుకోవడమే దీనికి నిదర్శనం....

‘టెస్లా’ వ్యవస్థాపకుడు, సీయివో ఎలాన్‌ మస్క్‌ రూట్‌ ఎప్పుడూ సెపరేటే. ఎలాన్‌ తన కంపెనీ ఆదాయాన్ని రిసెర్చ్, డెవలప్‌మెంట్‌ మీదే ఎక్కువ ఖర్చు చేస్తుంటాడు. నష్టాలు వచ్చినా పట్టించుకోలేదు. ఎలక్ట్రానిక్‌ కార్ల నుంచి సోలార్‌ టైల్స్‌ వరకు తయారుచేసే ‘టెస్లా’ తమ ఉత్పత్తులకు సంబంధించి అదరగొట్టే భారీ ప్రచార ఆర్భాటం అంటూ ప్రత్యేకంగా చేయదు.

‘నీలో టాలెంట్‌ ఉంటే భారీ ప్రచారం అక్కర్లేదు. నీ కంపెనికి నువ్వే పెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌’ అనే తన నమ్మకాన్ని తానే నిజం చేసి చూపించాడు ఎలాన్‌ మస్క్‌.
అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌–అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌(ఏడీఏస్‌) ‘టెస్లాఆటోపైలట్‌’లో లేన్‌ సెంటరింగ్, ట్రాఫిక్‌ అవేర్‌ క్రూయిజ్‌ కంట్రోల్, ఆటోమెటిక్‌ లేన్‌ చేంజెస్, సెల్ఫ్‌పార్కింగ్‌....మొదలైన ప్రత్యేకఫీచర్లు ఉన్నాయి. ‘ఆటోపైలట్‌’ బృందం కోసం ఎప్పటి నుంచో వెదుకుతున్నాడు ఎలాన్‌ మస్క్‌. ఇందుకు సంప్రదాయ నిబంధనలను కూడా పక్కన పెడుతున్నాడు.
‘మీరు ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో చదువుకోనక్కర్లేదు’
‘ఏఐలో మీకు తిరుగులేని టాలెంట్‌ ఉంటే, కాలేజీ డిగ్రీ కాదు కదా హైస్కూలు డిగ్రీ కూడా అక్కర్లేదు’...అని అంటాడు.
ఒకవైపు ప్రతిభావంతుల కోసం సోషల్‌ మీడియా వేదికగా వెదుకుతానే, మరోవైపు తన అమ్ముల పొదిలో పదునైన బాణం అశోక్‌ ఎల్లుస్వామికి కీలకమైన బాధ్యతలు అప్పగించాడు. భారతసంతతికి చెందిన అశోక్‌ ‘ఆటోపైలట్‌’ బృందంలో తొలి ఉద్యోగిగా నియామకం అయ్యాడు. ఆటోపైలట్‌ బృందానికి అశోక్‌ నాయకత్వం వహించనున్నాడు.
చెన్నైలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చేసిన అశోక్‌ ఎల్లుస్వామి కార్నెగి మెలన్‌ యూనివర్శిటీలో(యూఎస్‌)లో రోబోటిక్స్‌ మాస్టర్‌ డెవలప్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశాడు.
2014లో ‘టెస్లా’లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ప్రవేశించాడు. ఆ తరువాత సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, సీనియర్‌ స్టాఫ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ప్రమోషన్‌ పొందాడు. 2019లో డైరెక్టర్‌ ఆఫ్‌ ది ఆటోపైలట్‌ సాఫ్ట్‌వేర్‌గా నియామకం అయ్యాడు. ‘టెస్లా’కు ముందు వోక్స్‌ వేగన్‌ ఎలక్ట్రానిక్‌ రిసెర్చ్‌ల్యాబ్‌లో కొన్ని నెలల పాటు  పనిచేశాడు.
‘అశోక్‌ అద్భుతమైన విద్యార్థి. విభిన్న విషయాలపై ఆసక్తి, వాటి గురించి తెలుసుకొని పట్టు సాధించాలనే పట్టుదల ఉన్న తెలివైన కుర్రాడు’ అంటున్నాడు అశోక్‌కు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్‌ జోన్‌ డెలన్‌.
ఇప్పుడు అశోక్‌ ముందు రకరకాల సవాళ్లు ఉన్నాయి. సవాలును సవాలు చేసి సక్సెస్‌ సాధించడం అనేది ఈ టెక్‌ మాంత్రికుడికి కంప్యూటర్‌తో పెట్టిన విద్య!               

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top