నలభైలో కూడా 20లా కనిపించాలంటే..! | Sakshi
Sakshi News home page

నలభైలో కూడా 20లా కనిపించాలంటే..! ఇలా చేయండి!

Published Thu, Feb 15 2024 9:47 AM

Easy And Effective Home Remedies For Glowing Skin - Sakshi

చర్మం అందంగా కాంతులీనాలంటే మన ఇంట్లో దొరికే వాటితోనే అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఎలాంటి బ్యూటీ పార్లర్‌లకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంట్లో దొరికేవి, సహజసిద్ధమైన వాటితో చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్య వంతంగా మార్చుకోవచ్చు. అలాగే వృధాప్య ఛాయలు దరిచేరనీకుండా కాపాడుకోవచ్చు. అందుకోసం ఫాలో అవ్వాల్సిన రెమిడీస్‌ ఏంటంటే..

  • చర్మం పేలవంగా ఉంటే స్వచ్ఛమైన కొబ్బరినూనె రాయాలి. రాత్రి పడుకునే ముందు ముఖానికి, మెడకు, చేతులకు కొబ్బరినూనె రాసి వేళ్లతో వలయాకారంగా మసాజ్‌ చేసుకుంటే చర్మం ఆరోగ్యవంతమవుతుంది. కొబ్బరినూనె సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్‌ కిరణాల కారణంగా ఎదురయ్యే సమస్యల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. 
  • ముఖం మీద మచ్చలు, ముడతలు, చర్మం చిరచిరలాడడం వంటి ఇబ్బందులు పోవాలంటే కలబంద గుజ్జు రాసి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కలబంద చెట్టు నుంచి ఆకు విరిచి దాని నుంచి గుజ్జు తీసుకుని నేరుగా ముఖానికి రాయడమే. ఇంట్లో చెట్టు లేకపోతే రెడీమేడ్‌ అలోవెరా జెల్‌ వాడవచ్చు.  
  •  పాలుగారే చర్మం కోసం రోజూ ముఖానికి మిల్క్‌ ఫేస్‌ ప్యాక్‌ వేయాలి. రెండు స్పూన్‌ల పాలలో టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ శనగపిండి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ప్యాక్‌ కలుపుకోవడానికి సమయం లేకపోతే పాలలో దూదిని ముంచి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేసినా ఫలితం ఉంటుంది. 
  • చర్మం పొడిబారకుండా తేమగా ఉండాలంటే తేనె వాడాలి. సబ్బుతో ముఖం కడిగి తుడిచిన తర్వాత టీ స్పూన్‌ తేనెను అరచేతిలో వేసుకుని వేళ్లతో ముఖానికి పట్టిస్తూ వలయాకారంగా మసాజ్‌ చేయాలి. ముఖం, మెడకు పట్టించడం పూర్తయిన తర్వాత ఐదు నిమిషాల సేపు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
  •  తరుముకొస్తున్న వార్ధక్య లక్షణాలను నిలువరించడంలో బొప్పాయి చాలా బాగా పని చేస్తుంది. బాగా పండిన బొప్పాయి పండు గుజ్జు టేబుల్‌ స్పూన్, టీ స్పూన్‌ తేనె కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి.  
  • ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ చర్మానికి బయటి నుంచి చేసే చికిత్సలు. దేహం ఆరోగ్యంగా ఉంటే చర్మం కూడా నిగారిస్తుంది. అందుకు రోజుకు పది గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి. ఇక ఆహారం విషయానికి వస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. శారీరక వ్యాయామం తగినంత ఉండాలి. అలాగే ఎనిమిది గంటల మంచినిద్ర కూడా. ఇవన్నీ పాటిస్తే మెదడు చురుగ్గా, దేహం ఉత్సాహంగా పని చేస్తాయి. స్వేదం రూపంలో వ్యర్థాలు వెళ్లిపోవడంతో చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. 

(చదవండి: నెల రోజులు పాలు, పెరుగు మానేస్తే ఏమవుతుందో తెలుసా?)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement