Jamun Fruits: ఆషాడంలో నేరేడు పండ్లను తినాలని ఎందుకంటారో తెలుసా..!

Do You Know Why Black Jamun Fruits Eaten In Ashada Masam - Sakshi

ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ శాస్త్ర ప్రమాణం. వెంటనే మనకు మరీ శాకాహారులు అని సందేహం వచ్చేస్తుంది కదా! అక్కడకే వస్తున్న ముందుగా దీనిలో ఉండే అంతరార్థాన్ని నిశితంగా పరిశీలిస్తే..  మొక్కలకు ప్రాణముందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. అలాగే సంస్కృతంలో "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించునది" అని అర్థం. వరిధాన్యాన్నివ మనం ఆహారంగా తీసుకుంటున్నాం. అంటే మొక్క మనకి ఆహారమిచ్చి, అది ప్రాణాన్ని కోల్పోతుంది. కాబట్టి అది మాంసాహారమే. ఆ విధంగా, ప్రతి ఒక్కళ్ళూ తినే ఆహారం, సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణమే కదా!

అలాగే మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. వాటికి ప్రాయశ్చిత్తంగా పంచయజ్ఞాలు చేయాలి. మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. అందులో మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పుడు జరిగే ప్రాణిహింస". అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం. ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, వేదాలని న్యాసమొనరించి, ఈ రూపంలో అందించిన ఆయనను స్మరించి, వేదాలని కాపాడుకోవడం మన విధి.

ప్రకృతిలో జరిగే మార్పు కోసం దేహానికి సహజ చికిత్సగా ఈ నేరేడు పళ్లను ఈ మాసంలోనే తీసుకోమని చెప్పడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం కూడా. మొన్నటి వరకు వేసవి తీవ్రతకు దేహం నుంచి శ్వేద(చెమట) రూపంలో బయటకు వెళ్లిన నీరు కాస్త ఆషాఢంలో ఎండతగ్గి, మూత్రం రూపంలో అధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అతి మూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరిగించే శక్తి దానికి ఉందనీ ఆయుర్వేదం చెబుతోంది.

ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన విషయాలు 1. వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడం, 2. బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. అంటే శూన్యమాసమైన ఈ ఆషాడ మాసం మానవుడిని ఆరోగ్యాన్ని కాపాడుకోమని సూచించడమే గాక మన జీవనం కోసం చేసే పాపాలకు ప్రాయచిత్తం చేస్తుకునేలా వేదాధ్యయనం చేసి ప్రకృతికి కృతజ‍్క్షత చూపమని చెబుతోంది.  మన ఆచారాల్లో దాగి ఉన్న గొప్ప శాస్త్రీయ వైదిక విజ్ఞానాన్ని తెలుసుకోవడమే గాక తరువాత తరాలకి చెబుదాం.

(చదవండి: ఆషాడంలోనే ప్రత్యేకించి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే?..)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top