ఇక్కడ త్రిమూర్తులకూ ఆలయాలు, ఎక్కడో తెలుసా? | Do you know about pillalamarri brahma vishnu kesava temples | Sakshi
Sakshi News home page

ఇక్కడ త్రిమూర్తులకూ ఆలయాలు, ఎక్కడో తెలుసా?

Jul 3 2025 10:47 AM | Updated on Jul 3 2025 11:07 AM

Do you know about pillalamarri brahma vishnu kesava temples

కాకతీయ కాలం నాటి ఆధ్యాత్మిక శోభకు, శిల్పకళా వైభవానికి తార్కాణం 800 ఏళ్లనాటి ‘పిల్లల మర్రి’  (Pillalamarri )దేవాలయాలు. తెలుగు వారిని ఒకే తాటిమీదికి తీసుకువచ్చి సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయ రాజుల ఏలుబడిలో ఒక ఆధ్యాత్మిక, కళాక్షేత్రంగా వెలసిన కమనీయ సీమ సూర్యాపేట దగ్గర గల పిల్లలమర్రి.

ముక్కంటికి మూడు ఆలయాలు..
పిల్లలమర్రిలో మూడు ప్రసిద్ధ శైవక్షేత్రాలున్నాయి. 13వ శతాబ్దంలో వీటిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దం ఆరంభంలో కట్టిన గుడులు దాదాపు 150 సంవత్సరాలు వైభవోపేతంగా వెలిగాయి. ఆ తర్వాత పరదేశీ పాలనలో దోపిడీలకు గుర యినా, మధ్య మధ్య పునః ప్రతిష్టలు  పొందాయి. బేతిరెడ్డి భార్య ఎరుకసానమ్మ క్రీ.శ. 1208లో ఎరుకేశ్వర ఆలయాన్ని కట్టించారు. కాకతీయ శిల్పకళావైభవాన్ని చాటిచెప్పేలా చాలా ఎత్తుగా ఆలయం నిర్మించారు.  దీని ముఖమండప స్తంభాలు నల్లరాయితో చెక్కారు. స్తంభాలు చాలా నునుపుగా అద్దం మాదిరిగా కనిస్తాయి. ముఖమండపంలోని స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినపడతాయి. ఆలయంలో కొలువైన స్వామివారిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుస్తారని ప్రతీతి. బేతిరెడ్డి సోదరుడైన నామిరెడ్డి పిల్లలమర్రిలో రెండు శివాలయాలు కట్టించారు. తన పేరిట నామేశ్వర ఆలయం నిర్మించగా తన తల్లిదండ్రుల పేరిట త్రికూటాలయం నిర్మించారు నామేశ్వరాలయంలో నల్లరాతిపై చెక్కబడిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ద్వారాలు, ముఖమండపాలపై లతలు, పుష్పాలు, వివిధ భంగిమలలో నృత్యాలు కళాకారులు, గాయకులు, వాద్యకారులు, దేవతావిగ్రహాలు తదితర శిల్పాలు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వవు. 

కొన్నిచోట్ల స్తంభాలపై సూక్ష్మాతిసూక్ష్మంగా అందమైన నగిషీలతో శిల్పాలను మలిచారు. కఠినమైన నల్లరాయి శిల్పుల చేతిలో మైనం లాæకరిగి΄ోయిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. నామేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్తస్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తాయి. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతిదూలాలపై భారత రామాయణ గా«థలు, సముద్ర మథనం వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. నామేశ్వర ఆలయం పక్కనే త్రికూటేశ్వర ఆలయం ఉంది. ఒకేమండపంలో శివునికి మూడు వేర్వేరు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మూడు ఆలయాలకు కలిపి ఒకే నంది ఉండటం ఇక్కడ విశేషం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోకళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి సేవలో వీరంగాలు వేయటం, అగ్నిగుండాలు కాల్చటం మొదలైన వేడుకలు నిర్వహిస్తున్నారు. 

చెన్నకేశ్వర... బ్రహ్మదేవాలయాలు... 
పిల్లలమర్రి శైవం, వైష్ణవం కలిసి పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. శివకేశవులకు భేదాలు లేవని చాటిచెప్పేలా మూడు ప్రసిద్ధ శివాలయాలు ఉన్న పిల్లలమర్రి గ్రామంలోనే ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయం ఉంది. 13వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతారు. గర్భాలయంలో మకర తోరణం లో చెన్నకేశవస్వామివారి రూపలావణ్యం నయన మనోహరం. గర్భాలయం వెలుపల పన్నిద్దరు ఆళ్వారులు కొలువై ఉన్నారు. క్రీ.శ.1260లో చెన్నకేశ్వర ఆలయం ధ్వంసం అయ్యింది. 1899  ప్రాంతంలో గ్రామానికి చెందిన వుమ్మెత్తల చక్రయ్య గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని తిరిగి నిర్మించినట్లు చెబుతారు. చెన్నకేశ్వర ఆలయంతో΄ాటు నామేశ్వర ఆలయం ఎడమవైపు బ్రహ్మదేవుని ఆలయం ఉంది. బ్రహ్మ హంసవాహనారూఢుడై సరస్వతీమాతతో కలిసి దర్శనమిస్తారు. మహాదేవుని సేవ కోసం బ్రహ్మాసరస్వతులు హంసవాహనంపై ఇక్కడికి వస్తుంటారని స్థలపురాణం చెబుతోంది.

ఎలా చేరుకోవాలంటే?
ప్రసిద్ధ పురాతన ఆలయాలకు నెలవైన పిల్లల మర్రికి చేరుకోవడం చాలా సులువు. సూర్యాపేట జిల్లాలోని పిల్లల మర్రి గ్రామం హైదరాబాద్‌ నుంచి 134 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ నుంచి విరివిగా సూర్యాపేటకు బస్సులు ఉంటాయి. సూర్యాపేటలో దిగితే ఆక్కడినుంచి వాహనాల్లో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామానికి చేరుకోవచ్చు.

ఆ గ్రామం మూడు సుప్రసిద్ధ శైవ ఆలయాలకు నెలవు... ఒక్క ముక్కంటికే కాదు బ్రహ్మ, విష్ణువులకు సైతం ఆలయాలు ఉండటం మరో ప్రత్యేకత. త్రిమూర్తులలోని లయకారకుడైన శివుడు ఎరుకేశ్వరుడు, నామేశ్వరునిగా అవతరించగా స్థితికారకుడైన విష్ణువు చెన్నకేశ్వరునిగా వెలిశారు. ధరిత్రిపై పూజలు ఉండని శాపగ్రస్తుడైన బ్రహ్మదేవుడికి సైతం ఇక్కడ ఆలయం ఉండటం విశేషం. సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలిసి హంస వాహనారూఢుడై  దర్శనమిస్తాడిక్కడ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement