తీరంలో తూటా.. సీటీలో బాంబు | Dilsukhnagar Bomb Blast Case Riyaz Bhatkal | Sakshi
Sakshi News home page

తీరంలో తూటా.. సీటీలో బాంబు

Apr 27 2025 7:32 AM | Updated on Apr 27 2025 7:32 AM

Dilsukhnagar Bomb Blast Case Riyaz Bhatkal

కర్ణాటకలోని తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు అనుసరించే పద్ధతే ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాదులకు కలిసొచ్చింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్‌ల్లో విధ్వంసం సృష్టించడానికి తయారు చేసిన బాంబులకు చేపల వేటే ఆధారమైంది. ఈ కేసుల్లో ఆరుగురిలో ఐదుగురికి ఇటీవల హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే! కర్ణాటక తీరంలో చేపల వేటకు, హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు మధ్య సంబంధం ఏంటి..?

దేశంలోని తొమ్మిది రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారడంతో ఐఎం సహ వ్యవస్థాపకుడు రియాజ్‌ భత్కల్‌ 2009లో పాకిస్తాన్‌ వెళ్లిపోయాడు. అప్పటి వరకు ఎక్కడ పేలుళ్ల పాల్పడాలన్నా అవసరమైన బాంబుల తయారీకి కావలసిన అమోనియం నైట్రేట్‌ను అతడే సమీకరించే వాడు. పాకిస్తాన్‌కు మకాం మార్చాక దీన్ని సమీకరించే బాధ్యతల్ని భత్కల్‌లోని తన ఇంటి సమీపంలో నివసించే హోమియో డాక్టర్‌ అఫాఖీకి అప్పగించాడు.

అఫాఖీ 2005లో పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన అర్సాలా అబీర్‌ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల అఫాఖీ పాకిస్తాన్‌కు రాకపోకలు సాగించేవాడు. అక్కడి బంధువులతో తరచు ఫోన్‌లో మాట్లాడేవాడు. ఈ కారణంగా తాను ఫోనులో మాట్లాడినా, పాకిస్తాన్‌కు వచ్చినప్పుడు కలిసినా పోలీసులు, నిఘా వర్గాలు అనుమానించరనే ఉద్దేశంతోనే అఫాఖీని రియాజ్‌ భత్కల్‌ ఎంచుకున్నాడు. 2009, 2011ల్లో పాకిస్తాన్‌ వెళ్లిన అఫాఖీ నేరుగా రియాజ్‌ను కలిసి వచ్చాడు. 2010 నుంచి పేలుడు పదార్థం సరఫరా బృందం నాయకుడిగా మారాడు.

రియాజ్‌ భత్కల్‌ నుంచి కోడ్‌వర్డ్స్‌ రూపంలో ఈ–మెయిల్‌ ద్వారా అందే ఆదేశాల మేరకు అఫాఖీ పని చేశాడు. బాంబుల తయారీ కోసం పేలుడు పదార్థాల సమీకరణకు అనేక మార్గాలు అన్వేషించాడు. కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వలలతో పాటు ‘మీన్‌ తూటా’లను వినియోగిస్తుంటారు. అమోనియం నైట్రేట్‌ స్లర్రీ (ముద్దలా ఉండే పదార్థం) ప్యాకెట్‌లో డిటోనేటర్‌ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్‌ వైరు జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్న కుండలో పెడతారు. ఈ కుండకు తక్కువ బరువు కట్టి వేటాడటానికి వాడుతున్న పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. అమోనియం నైట్రేట్‌ స్లర్రీ పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న చేపలన్నీ చనిపోయి పైకి తేలతాయి. ఇలా చేపల వేట వారికి తేలికవుతుంది. 

కేవలం మత్స్యకారులే కాకుండా సముద్రంలో విహారయాత్రలకు వచ్చే యువకులు కూడా సరదా కోసం మీన్‌ తూటాలను వాడి చేపలు పడుతుంటారు. దీనిపై నిషేధం ఉన్నా, అప్పట్లో కర్ణాటక అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం అఫాఖీకి కలిసొచ్చింది. ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని కొన్ని ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుడటంతో నిర్మాణరంగంలో బ్లాస్టింగ్స్‌ కోసం వినియోగించే అమోనియం నైట్రేట్‌ స్లర్రీ విక్రయానికి అక్కడి వారు పలువురు లైసెన్సులు పొందారు. ప్రభుత్వ నిఘా, ఆడిట్‌ పక్కాగా లేకపోవడంతో ఆ వ్యాపారులే అక్రమంగా మత్స్యకారులకు ‘మీన్‌ తూటా’లు అమ్మేశారు. ఈ లోటుపాట్లను అధ్యయనం చేసిన అఫాఖీ పేలుడు పదార్థం సమీకరణకు మత్స్యకారుల మార్గాన్ని ఎంచుకున్నాడు. 

మైనార్టీల అభివృద్ధి కోసమంటూ కర్ణాటకలో పని చేస్తున్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) సంస్థలోనూ అఫాఖీ చురుకుగా వ్యవహరించే వాడు. ఇదే సంస్థలో సభ్యుడిగా ఉన్న స్క్రాప్‌ వ్యాపారి సద్దాం హుస్సేన్‌పై ఇతడి కన్నుపడింది. చలాకీగా ఉండే సద్దాంకు మాయమాటలతో ఎరవేసిన అఫాఖీ ‘మీన్‌ తూటా’ల కొనుగోలుకు వినియోగించుకున్నాడు. స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాలని చెబుతూ ఉడిపి, రత్నగిరిల నుంచి మీన్‌ తూటాలు తెప్పించేవాడు. వాటిని పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమోనియం నైట్రేట్‌ స్లర్రీని వినియోగించే ఉగ్రవాదులు బాంబులు తయారు చేసి పేల్చారు. అఫాఖీ ఈ మీన్‌ తూటాలను తనతో ఏడాదికి ఒకటి రెండుసార్లే తెప్పిస్తుండటంతో సద్దాంకు అనుమానం రాలేదు. ఇలా తీసుకువచ్చిన స్లర్రీని కొన్ని రోజులు దాచి ఉంచడానికి కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న మదీనా కాలనీలో దారుల్‌ ఖాయర్‌ పేరుతో ఉన్న ఇంటిని అఫాఖీ వినియోగించాడు. 

అమోనియం నైట్రేట్‌ స్లర్రీ దుర్వినియోగం కాకుండా దాని ఉత్పత్తిలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తయారు చేసిన నాటి నుంచి గరిష్ఠంగా ఆరు నెలల్లోపు మాత్రమే అది సమర్థంగా పని చేస్తుంది. ఆ తరవాత పెద్దగా ప్రభావం చూపదు. అఫాఖీ మాడ్యుల్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (2010 ఏప్రిల్‌ 17), పుణేలోని జంగ్లీ మహరాజ్‌ రోడ్‌లలో (2012 ఆగస్టు 1) నాటి పేలుళ్లకు సరఫరా చేసిన స్లర్రీ ఎక్స్‌పైరీ డేట్‌ దాటేసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు చోట్లా పేలుడు తీవ్రత తక్కువగా ఉండి ప్రాణనష్టం జరగలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 2015 జనవరి 8న అఫాఖీతో పాటు అతడి అనుచరులను అరెస్టు చేసింది. 2024 డిసెంబర్‌ 16న బెంగళూరులోని ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు వీరికి దోషులుగా తేల్చింది. 

‘మీన్‌ తూటా’లు పేలింది ఇక్కడే...
 2010 ఫిబ్రవరి 13: పుణేలోని జర్మన్‌ బేకరీలో పేలుడు. ఇక్కడ 17 మంది మృతిచెందగా 60 మంది క్షతగాత్రులయ్యారు.
 2010 ఏప్రిల్‌ 17: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రెండు బాంబు పేలుళ్ళు. ఈ ఘటనలో 15 మంది క్షతగాత్రులయ్యారు.
 2011 జూలై 13: ముంబైలోని దాదర్, జవేరీ బజార్, ఓపెరా హౌస్‌ల వద్ద మూడు పేలుళ్ళు. ఇందులో 21 మంది చనిపోగా 131 మంది క్షతగాత్రులయ్యారు.
 2012 ఆగస్టు 1: పుణేలోని జంగ్లీ మహరాజ్‌ రోడ్‌లో నాలుగు బాంబు పేలుళ్ళు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. 
2013 ఫిబ్రవరి 21: హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చ్‌ సెంటర్‌ వద్ద జంట పేలుళ్ళు. వీటిలో 18 మంది చనిపోగా, 119 మంది గాయపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement