Under Eyes Dark Circles: కళ్లకింద నల్లటి వలయాలా?.. ఇంట్లోనే చక్కటి పరిష్కారం

Dark Circles Under Your Eyes: Causes and Treatments - Sakshi

ఇటీవలి కాలంలో మొబైల్‌ ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించడం, కంప్యూటర్‌ స్క్రీన్‌ వైపు అధికంగా చూడటం వల్ల చాలామందికి కళ్లు ఎర్రబడటం, మంటలు, కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడటం వంటి ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాటికి ఇంటిలో సహజంగా దొరికే వాటితోనే చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఓసారి ప్రయత్నించి చూడండి. 

►కళ్ల ఎర్రబడి, మంట పుడుతుంటే ఉదయం లేదా సాయంత్రం.. సుమారు పది నిమిషాలు ఐస్‌క్యూబ్స్‌తో కళ్లను మసాజ్‌ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా చర్మం మీద కాకుండా.. కాటన్‌ క్లాత్‌లో చుట్టి.. మెల్లిగా కళ్లను మసాజ్‌ చేయాలి. ఒకవేళ ఐ మాస్క్‌ ఉంటే.. దానిని కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచి కళ్లకు పెట్టుకోవచ్చు.

చల్లని టీ బ్యాగులు: కోల్డ్‌ కంప్రెస్‌ లేదా ఐ మాస్క్‌ లేకుంటే.. ఉపయోగించిన టీ బ్యాగ్‌లు మీకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. గ్రీన్‌ టీ వంటి అనేక టీలు యాంటీ ఆక్సిడెంట్లతో కూడి ఉండటం వల్ల వీటిని ఫ్రిజ్‌లో పెట్టి కళ్ల మీద పెట్టుకుంటే చాలు... కళ్లకింద ఉండే క్యారీబ్యాగ్స్‌ను, డార్క్‌ సర్కిళ్లను తగ్గిస్తాయి.

►తాజా కీరదోసకాయను ఒక మాదిరి పరిమాణంలో గుండ్రటి ముక్కలుగా తరిగి.. వాటిని ఒక గిన్నెలో పెట్టి అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత వాటిని ఫ్రిజ్‌ నుంచి తీసి కళ్లపై ఉంచి.. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

బాదం నూనె: బాదం నూనె, విటమిన్‌ ఇ మిశ్రమాన్ని ఉపయోగిస్తే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు క్రమంగా మటుమాయం అవుతాయి. పడుకునే ముందు మీ డార్క్‌ సర్కిల్స్‌ను బాదం నూనె, విటమిన్‌ ఇ మిశ్రమంతో కలిపి మసాజ్‌ చేయాలి.. ఉదయం లేచిన తర్వాత.. ఆ ప్రాంతాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే కళ్ల మంటలు తగ్గి హాయిగా ఉంటుంది.

చల్లని పాలు: పాల ఉత్పత్తులు విటమిన్‌–ఎ ను కలిగి ఉంటాయి. ఇందులో రెటినోయిడ్స్‌ ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచడంలో గొప్పగా పనిచేస్తాయి. చల్లని పాల గిన్నెలో కాటన్‌ మేకప్‌ రిమూవర్‌ ప్యాడ్‌ను నానబెట్టండి. అనంతరం 10 నిమిషాల పాటు కళ్లపై ఉంచండి. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే.. డార్క్‌ సర్కిల్స్‌ సమస్య తగ్గుతుంది.

కంటి నిండా నిద్ర: నిర్ణీత సమయం పడుకోకపోవడం వల్ల కళ్ల కింద ద్రవం పేరుకుపోతుంది. కాబట్టి కంటినిండా హాయిగా∙నిద్రపోవాలి. క్రమగా వ్యాయామం చేయాలి. ఈ సహజ నివారణలతో కంటిచుట్టూ ఉండే నల్లటి వలయాలను సులువుగా ఛేదించవచ్చు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top