నాడు దినసరి కూలీ నేడు టీచర్‌

Daily wage worker turns high school teacher - Sakshi

కృషి

యాలకుల తోటలో దినసరి కూలీగా పనిచేసే 28 ఏళ్ల సెల్వమరి ప్రభుత్వ ఉపాధ్యాయినిగా మారింది. ఆమె సాధించిన ఈ ఘనత వెనకాల కొన్నేళ్ల కృషి ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి అర్థంలా సెల్వమరి గురించి పిల్లలకు పాఠంలా చెప్పచ్చు. పెద్దలూ తమ దారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. స్వయంకృషితో ఎదిగిన సెల్వమరికి కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఫోన్‌ ద్వారా, ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు.  

సెల్వమరి తన బాల్యంలో తల్లితో కలిసి సెలవుల్లో యాలకుల తోటలో పనిచేసేది. అర్ధరాత్రిళ్లు నూనె దీపాన్ని పెట్టుకొని చదువుకునేది. తండ్రి ఆమె చిన్నతనంలోనే తల్లిని, ఇద్దరు కూతుళ్లను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ పోషణకు తల్లి యాలకుల తోటలో పనిచేసేది. తల్లితోపాటు సెల్వమరి కూడా కూలికి వెళ్లేది.

గణితంలో ప్రతిభ
పూట గడవని రోజులైనా చదువును మాత్రం పక్కన పెట్టలేదు సెల్వమరి. చదువొక్కటే తమ జీవితాలను మారుస్తుందని నమ్మింది. తన కలను ఎవరికీ చెప్పకుండా దాచుకుంది. ఆ కలను సాధించడానికి నిత్యం కృషి చేసింది. సెల్వమరికి గణితం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ గణితంలో ప్రతిభ చూపుతుండేది. తిరువనంతపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో చేరినప్పుడు తల్లికి ధైర్యం చెప్పింది. కాలేజీకి సెలవు రోజులు ఇవ్వగానే తిరిగి ఇంటికి వచ్చి, తల్లితో కలిసి కూలి పనులకు వెళ్లేది. అలా వేసవి సమయమంతా తల్లికి చేదోదు వాదోడుగా ఉండేది.

సమస్యలను అధిగమిస్తూ..
‘డిగ్రీ ఇంగ్లిషు మాధ్యమంలో చేరడంతో మొదట సమస్యగా అనిపించేది. మాతృభాష మలయాళం తప్ప ఇంగ్లిషు సరిగా వచ్చేది కాదు. కానీ, మా అమ్మ ముఖం గుర్తుకు తెచ్చుకొనేదాన్ని’ అంటూ సమస్యను అధిగమించిన విధానాన్ని తెలియజేస్తుంది సెల్వమరి. క్రమంగా భాషా సమస్యను పరిష్కరించుకొని డిగ్రీ, అటు తర్వాత ఎమ్మెస్సీ పూర్తి చేసింది.

కుమిలీలోని ఎంజి యూనివర్శిటీ నుంచి బీఈడీ, ఎమ్‌ఈడీ పూర్తి చేసింది. థైక్వాడ్‌ గవర్నమెంట్‌ కాలేజీ నుంచి ఎంఫిల్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు మ్యాథమేటిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తోంది. యుజిసి నెట్‌ ఎగ్జామ్‌ పూర్తి చేసింది. సివిల్‌ సర్వీసులలో రాణించాలన్నది తన పెద్ద కల. అందుకు ఎంత కష్టమైనా పడతానంటున్న సెల్వమరి కేరళలోని ఇడుక్కి జిల్లాల్లో వంచివయాల్‌ ఉన్నత పాఠశాలలో ఇటీవలే ఉపాధ్యాయురాలిగా చేరింది.

ఎక్కడా అవకాశాలు లేవు, ఎటు చూసినా ఆర్థిక ఇబ్బందులే, కుటుంబ పరిస్థితి ఏమీ బాగో లేదని వాపోతూ అనేక సాకులు వెతికేవారికి సెల్వమరి జీవితం ఓ పాఠం. కృషి చేస్తే జీవితం తప్పక మారుతుందని తెలిపే విజయకథనం.
 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top