
ప్రతీకాత్మక చిత్రం
మీ పిల్లల మార్కుల సంగతి సరే.. కానీ, వాళ్లు ఎలా చదువుతున్నారో ఎప్పుడైనా గమనిస్తున్నారా?. పోనీ వాళ్ల టీచర్లు ఏం చదువు చెబుతున్నారో ఆరా తీస్తున్నారా?. లేదా?? అయితే ఇకనైనా ఆ పని చేయండి. దాని కంటే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి.
Chattisgarh Govt School teacher can't even spell ELEVEN.
BJP and Congress have ensured that the Indian masses remain illiterate so that they can manipulate them on trivial issues. pic.twitter.com/KepJHgukOr— Dr Ranjan (@DocRGM) July 30, 2025
పై వీడియోలో ఉంది ఓ గవర్నమెంట్ టీచర్. బోధించేది ప్రైమరీ స్కూల్‌లో ఆంగ్లం సబ్జెక్ట్. ఆయనకు జీతం రూ.70 వేలపైనే. కానీ, Eleven, Nineteen స్పెల్లింగులు రాయలేక ఇబ్బంది పడ్డారు. Elevenను Aivene అని, Nineteenను Ninithin అని తప్పు తప్పుగా రాశారు. పైగా ఈ ఘటన సరిగ్గా విద్యాశాఖ అధికారి ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన టైంలో జరిగింది. ఆ తప్పులతోనే ఆయన వాళ్లకు అలాగే పాఠాలు బోధించారు. అంతేకాదు మన దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ల పేర్లు కూడా ఆ టీచర్ చెప్పలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
ఇక్కడ ఆ టీచర్‌ను అవమానించడం ఉద్దేశం కాదు. కానీ, గ్రామీణ విద్యా వ్యవస్థపై ప్రభుత్వాలు సారిస్తున్న దృష్టి ఏపాటిదో అనేది ఈ ఘటన బయటపెట్టింది. ఛత్తీస్‌గఢ్ బాల్‌రాంపూర్ జిల్లా ఘోడాసోట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. వీడియో వైరల్ కావడంతో ఛత్తీస్‌గఢ్ విద్యా శాఖ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ ప్రారంభించింది.
మరోవైపు.. ఉపాధ్యాయుల ఎంపిక, శిక్షణ, మానిటరింగ్ పద్ధతులపై సోషల్ మీడియాలో ప్రశ్నలు కనిపిస్తున్నాయి. వేలకు వేలు జీతం పొందుతున్న ఉపాధ్యాయులు కూడా ప్రాథమిక ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లు తెలియకపోవడం విడ్డూరమనే కామెంట్లు కనిపిస్తున్నాయి. గుడ్డిగా పోస్టింగ్‌లు ఇవ్వకుండా రాటుదేలిన ఉపాధ్యాయులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు కొందరు. మరికొందరేమో.. ఆ టీచర్‌ను రీ-ట్రైనింగ్‌కు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ మధ్యే అకడమిక్ ఈయర్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి శిక్షా గుణవత్తా అభియాన్ అనే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్ కింద టీచర్లు లేని స్కూల్స్ ఇక మీదట ఉండకూడదని, ప్రతీ బడిలో కనీసం ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఉండాలని, తమ పిల్లలకు సరిగా పాఠాలు బోధించని టీచర్లను తల్లిదండ్రులు ప్రశ్నించే పరిస్థితులు రావాలని.. ముఖమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఓ ప్రకటన చేశారు. ఈ తరుణంలో ఈ టీచర్ వీడియో ఇప్పుడు అక్కడ తీవ్ర చర్చనీయాంశమైంది.