
ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న నగరం.. బెంగళూరు(కర్ణాటక). వర్షాలు.. వరదలు, ట్రాఫిక్ రద్దీ, లైంగిక వేధింపులు, భాష ప్రతిపాదికన దాడుల ఘటనలు ఏవో ఒకటి నగరాన్ని నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి. ఈ తరుణంలో.. మరో తరహా ఘటనలు ప్రపంచవ్యాప్తంగానూ చర్చకు దారి తీస్తున్నాయ్..
నోయెల్ రాబిన్‌సన్, యూనెస్ జారో.. ఈ ఇద్దరూ ఆషామాషీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కాదు. కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్లకి. అయితే తాజాగా ఈ ఇద్దరికీ బెంగళూరులోనే చేదు అనుభవం ఎదురైంది. వేర్వేరు ఘటనలో వీళ్లిద్దరు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చింది.
జర్మన్ టిక్‌టాకర్ నోయెల్ రాబిన్‌సన్.. గుబురు జుట్టేసుకుని జనం మధ్య డ్యాన్సులు వేస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా సహా పలు నగరాల్లో ఇప్పటికే వీడియోలతో భారతీయులకూ దగ్గరయ్యాడు. అయితే.. బెంగళూరు వీధుల్లో సంప్రదాయ పంచెకట్టులో డాన్స్ చేస్తూ వీడియో చేయబోయాడు. దీంతో జనం భారీగా గుమిగూడారు.
కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్ పేరుతో అతన్ని స్టేషన్‌కు లాక్కెళ్లారు. ఆ సమయంలో అతనితో కాస్త దురుసుగా ప్రవర్తించారు. తీరా పీఎస్‌కు తీసుకెళ్లాక ఓ పావు గంట తర్వాత అతని నుంచి వివరణ తీసుకుని.. జరిమానా విధించి వదిలేశారు. దీనిని అంతే తేలికగా తీసుకున్న నోయెల్.. దానిని ఓ ఫన్నీ వీడియోగా ప్రమోట్ చేసుకున్నాడు.
మరో ఘటనలో.. పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ యూనస్ జారో నగరంలోని చర్చి స్ట్రీట్ వద్దకు రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే అతని రాకతో అక్కడ జనం గుమిగూడారు. ఇంతలో సడన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అతన్ని పీఎస్‌కు తరలించి.. ఫైన్ విధించి పంపించారు. ఆ సమయంలోనూ అతను వాళ్లతో షేక్ హ్యాండ్ ఇస్తూ మరో ఫొటో షేర్ చేశాడు.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 9వ తేదీన బ్రిటిష్ మ్యూజీషియన్ ఇద్ షరీన్ రోడ్డు మీద ప్రదర్శన ఇస్తుండగా.. కుబ్బన్ పోలీసులు అంతరాయం కలిగించి అక్కడి నుంచి వెళ్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. అటు ఫ్యాన్స్‌తో పాటు అతిథి దేవోభవకు బెంగళూరు పోలీసులు తూట్లు పొడిచారంటూ ఇటు నెటిజన్లు నగర పోలీసుల తీరుపై మండిపడ్డారు.
International artist @edsheeran was stopped playing in #Bangalore at church street. Even though, he had the permission. Literally! The cops pulled the plug. Damn sad! #Karnataka pic.twitter.com/C0F9tdm26g
— Imran Khan (@KeypadGuerilla) February 9, 2025
అయితే.. పోలీసులు మాత్రం తమ అనుమతులు లేకుండా రోడ్లపై అలాంటి షోలను అనుమతించమని.. జనం గుమిగూడి జరగరానిది ఏదైనా జరిగితే ఎలాగ? అని ప్రశ్నిస్తున్నారు. జూన్ 4వ తేదీన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటన.. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో.. కర్ణాటక ప్రభుత్వం క్రౌడ్ కంట్రోల్ బిల్ - 2025 తెర మీదకు తెచ్చింది. ఈ రకమైన ఈవెంట్లు గనుక అనుమతులు లేకుండా నిర్వహిస్తే.. గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 వేలజరిమానా విధించాలని ఈ చట్టం తేబోతోంది.