వైరల్ వీడియో వెనుక భయంకర నిజం | Crime Story On Funday | Sakshi
Sakshi News home page

వైరల్ వీడియో వెనుక భయంకర నిజం

Mar 22 2026 9:33 AM | Updated on Mar 22 2026 9:55 AM

Crime Story On Funday

హర్ష ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. వయసు ఇరవై ఏడేళ్లు. మంచి జీతం. అతనికి  పెళ్లి కుదిరింది. ఇక పెళ్లిపనులు మొదలుపెడదాం అనుకున్న అతనికి ఆరోజు జరిగిన సంఘటన అతని జీవితాన్ని కుదిపేసింది.  ఒకరోజు ఉదయం అతని ఫోన్‌ మోగింది. అటు పక్కనుంచి అతడి స్నేహితుడు ఆదిత్య.‘‘హర్షా ..   నువ్వేంటి ఇలాంటి దందా పనులు చేయడం ఎప్పటినుండి మొదలుపెట్టావు?’’ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘ఏంట్రా నేనేం దందా పనులు చేస్తున్నాను?’’ ఆందోళనగా అడిగాడు హర్ష.  ‘‘నువ్వు చేస్తున్న పనులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

నువ్వు చేసే పనులు వీడియోలు ఉన్నాయి... ఆ వీడియోలు నీకు కాబోయే భార్య చూసిందంటే... నీ పెళ్లి క్యాన్సిల్‌ కావచ్చు... జాగ్రత్త!’’ అని చెప్పి ఆదిత్య ఫోన్‌ పెట్టేశాడు.  హర్ష ఆందోళనగా ఆదిత్య పంపిన వీడియో చూడసాగాడు. అందులో హర్ష చేతిలో తుపాకీ పట్టుకుని, కర్కశమైన గొంతుతో మాట్లాడుతూ ఒక ప్రముఖ వ్యాపారవేత్తను బెదిరిస్తున్నాడు. ఆ వ్యాపారవేత్త భయంభయంగా వదిలేయమన్నట్టుగా హర్షను వేడుకుంటున్నాడు. ఆ వీడియో చూడగానే అతని గుండె ఒక్కసారిగా బరువైంది. ‘ఇది... ఇదెలా సాధ్యం?’ హర్షకు ఒక్కసారిగా భయంతో మెదడు మొద్దుబారింది. ఇది అసలు తాను కాదు. మరి ఇదెలా సాధ్యం? ఆలోచనలు... ఆందోళన కమ్ముకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

కొద్ది నిమిషాల తరువాత...హర్ష ఫోన్‌ ఆగకుండా అలా మోగుతూనే ఉంది. తేరుకున్న అతను ఫోన్‌ చేతిలోకి తీసుకున్నాడు. ఫోన్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తున్న నంబర్‌ పేరు చూడగానే, తన జీవితం ఇక ముగిసింది అనుకున్నాడు హర్ష. కారణం ఫోన్‌ చేసింది తన కాబోయే భార్య స్నేహ...తాను కూడా ఆ వీడియోస్‌ తప్పకుండా చూసే ఉంటుంది. తనతో తెగతెంపులు చేసుకోవడానికి ఫోన్‌ చేస్తోంది అని అర్థం అయింది అతడికి. చివరిసారిగా ఆమెతో మాట్లాడాలని వణుకుతున్న చేతులతో ఫోన్‌ తీసాడు హర్ష.‘‘హలో...’’ కంపిస్తున్న స్వరంతో అన్నాడు హర్ష. ‘‘నేను ఆ వీడియోస్‌ చూశాను’’ అన్నది స్నేహ. కొన్ని నిముషాలు అలా మౌనంగా ఉండిపోయాడు హర్ష.

‘‘ఆ వీడియోలో ఉన్నది నేను కాదు’’ మెల్లగా అన్నాడు హర్ష. తన కళ్ళముందే తన కలలసౌధం కూలిపోతున్నట్టు అనిపిస్తోంది అతడికి.‘‘ఆ వీడియోస్‌లో ఉన్నది మీరు కాదని నాకు తెలుసు’’... ప్రశాంతంగా చెప్పింది స్నేహ‘‘ఇది బహుశా సైబర్‌ మోసం కావచ్చు. డీప్‌ ఫేక్‌ తో ఇలా ఒకరి మొహాన్ని, స్వరాన్ని అనుకరించి అనుసరించి మోసాలు చేస్తారని తెలుసు. మీరు వెంటనే ఆ వీడియో గురించి సైబర్‌ కంప్లయింట్‌ ఇవ్వండి.’’ చెప్పింది.స్నేహ మాటలు హర్షకు కొండంత  ధైర్యాన్ని ఇచ్చాయి.వెంటనే సైబర్‌ క్రైమ్‌ విభాగంలో కేసు నమోదు అయింది. సైబర్‌ క్రైమ్‌ అధికారి సాగర్‌ కేసు విచారణ మొదలుపెట్టాడు.ఆ వీడియోని జాగ్రతగా పరిశీలిస్తున్నాడు సాగర్‌.  వీడియోలోని ముఖం, స్వరం అన్నీ హర్షవే...‘‘ఇది కచ్చితంగా డీప్‌ ఫేక్‌ వీడియో.’’ అన్నాడు సాగర్‌.  హర్ష కొద్దిగా కుదుటపడ్డాడు.

‘‘డీప్‌ ఫేక్‌ అంటే?’’ అడిగాడు.‘‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో ఎవరి ముఖాన్నైనా, స్వరాన్నైనా ఉపయోగించి నకిలీ వీడియోలు తయారు చేయడం.’’ వివరించాడు. ఆ వీడియోను సాగర్‌  ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాడు. ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ విశ్లేషణ జరిగింది. కళ్ల కదలికల్లో స్వల్ప అసమానత. లైట్‌ రిఫ్లెక్షన్‌లో చిన్న తప్పులు. చివరకు నిర్ధారణ అయ్యింది– అది డీప్‌ ఫేక్‌.కాని, ఎవరు చేశారని అసలు విచారణ ఇప్పుడు మొదలైంది.అసలు నేరస్థుడు హర్ష కంపెనీలో పని చేసిన మాజీ ఉద్యోగి రాహుల్‌. అతను చేసిన ఒక మోసం వల్ల కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. హర్ష  అతని ప్రాజెక్ట్‌ లీడర్‌.రాహుల్‌ సోషల్‌ మీడియాలో హర్ష  ఫోటోలు, వీడియోలు సేకరించాడు. ఓపెన్‌ సోర్స్‌ ఏఐ టూల్స్‌ ఉపయోగించి అతని ముఖం, స్వరం కాపీ చేశాడు. ఆ వీడియోతో వ్యాపారవేత్తను బ్లాక్‌ మెయిల్‌ చేయాలని ప్లాన్‌ చేశాడు. కానీ వీడియో ముందుగానే లీక్‌ అయింది.

సైబర్‌ ట్రేసింగ్‌ ద్వారా రాహుల్‌ ల్యాప్‌టాప్‌లో ఆ సాఫ్ట్‌వేర్, డ్రాఫ్ట్‌ ఫైళ్లు దొరికాయి.అతను అరెస్ట్‌ అయ్యాడు.హర్ష  నిర్దోషిగా బయటపడ్డాడు. కాని, అతని మనసులో ఒక ప్రశ్న మాత్రం మిగిలింది.‘‘ఇప్పటి ప్రపంచంలో మన ముఖం కూడా మనదేనా?’’∙∙ ‘థాంక్యూ స్నేహా..పెళ్ళికి ముందే కాబోయే భర్త నిర్దోషి అని నమ్మావు. మోరల్‌ సపోర్ట్‌ ఇచ్చావు’’ స్నేహని  చుట్టేస్తూ అన్నాడు హర్ష.‘‘టెక్నాలజీ చాలా శక్తిమంతమైనది. కాని, బాధ్యత లేకుండా వాడితే అది ఆయుధం అవుతుంది.’’ ముఖ్యంగా డీప్‌ ఫేక్‌ గురించి అవగాహన, సైబర్‌ నేరాల పట్ల ఎవేర్‌నెస్‌ లేకపోతె ప్రమాదం. భయపడటం  మానేస్తే నేరాలను ఎదుర్కోవడం కష్టమేమీ కాదు’’ చెప్పింది స్నేహ. 

గమనిక:
ఇన్నాళ్లూ కొనసాగించిన ‘క్రైమ్‌ రిపోర్టర్‌’ కాలమ్‌ను పాఠకులు ఆదరించారు. పాఠకుల్లో చాలామంది ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్‌ఫిక్షన్‌ కోరుకుంటున్నందున ఈవారం నుంచి ‘క్రైమ్‌ రిపోర్టర్‌’ స్థానంలో కొత్తగా ‘క్లూషియల్‌’ శీర్షికను ప్రవేశ పెడుతున్నాం. ఇందులో వారం వారం క్రైమ్‌ కథలు అందించనున్నాం.

∙శ్రీసుధామయి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement