Coronavirus: కోవిడ్‌ మళ్లీ సోకితే ఏం చేయాలి?

Coronavirus Variants Risks, Prevention, Vaccines: Question And Answers in Telugu - Sakshi

ఇప్పటికే కరోనా వచ్చిపోయిన వారికి కూడా ఇప్పుడు మళ్లీ పాజిటివ్‌ వస్తోంది. దీంతో ఇలా అందరికీ వస్తుందా? కోవిడ్‌ మళ్లీ సోకితే ఏం చేయాలి? వ్యాక్సిన్‌ వేసుకున్నా వస్తుందా? ఇలా జరిగితే ఏదైనా ప్రమాదం ఉంటుందా? అన్న సందేహాలు వస్తున్నాయి. వాటికి వైద్య నిపుణుల సమాధానాలు, వారి స్వీయ అనుభవాలు మీకోసం..

కరోనా మళ్లీ సోకుతోంది.. కారణాలేంటి?
‘‘సెకండ్‌ వేవ్‌లో కరోనా వచ్చిన వారిలో 4.5 శాతం మంది రెండోసారి సోకినవారేనని ఇటీవల ఐసీఎంఆర్‌ నివేదికలో పేర్కొంది. ఒకసారి కరోనా వచ్చి తగ్గిన వారికి ఎంత కాలానికి తిరిగి వ్యాధి సోకే అవకాశం ఉందనే దానిపై నిర్ధారిత సమయం అంటూ లేదు. తొలిసారి వచ్చిన వ్యాధి తీవ్రతను బట్టి, రోగిలో తయారయ్యే యాంటీబాడీస్‌ మీద అది ఆధారపడి ఉంటుంది. శరీరంలో సరిపడా యాంటీబాడీస్‌ ఉన్నంత వరకు రెండోసారి వ్యాధి సోకే అవకాశం ఉండదు. రెండోసారి వ్యాధి సోకినవారికి, ఇప్పుడే తొలిసారిగా పాజిటివ్‌ అయిన వారికి లక్షణాల్లో కచ్చితమైన తేడాలు కూడా ఏమీ చెప్పలేం. వారికి సోకిన కరోనా రకం (స్ట్రెయిన్‌) మీద, ఎంత కాలానికి సోకిందనే విషయం మీద, సదరు వ్యక్తుల రోగనిరోధక శక్తి మీద, వైరల్‌ లోడ్‌ ఎంత ఉందన్న దానిపై లక్షణాలు ఆధారపడి ఉంటాయి. 

► ఒక్క మశూచికి తప్ప ఇప్పటివరకు ఎన్నో వ్యాధుల కోసం తయారు చేసిన టీకాలేవీ కూడా వంద శాతం ప్రభావితం చూపలేదు. స్వల్పంగా అయినా ఇన్ఫెక్షన్‌ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనదేశంలో ఇస్తున్న రెండు రకాల కోవిడ్‌ వ్యాక్సిన్లు కూడా దాదాపు 70% నుంచి 80% వరకు ప్రభావంతంగా పనిచేస్తున్నాయి. తొలిడోసు తీసుకున్న పదివేల మందిలో సగటున నలుగురికి, రెండు డోసులు తీసుకున్న పదివేల మందిలో ఇద్దరికి మాత్రమే తర్వాత వ్యాధి సోకినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇలాంటి వారిలో తీవ్ర లక్షణాలుగానీ, మరణాలుగానీ నమో దు కాలేదు. ఈ లెక్కన టీకా వల్ల మంచి ఫలితాలు వస్తున్నట్టే. టీకా తీసుకున్న వారిలో వ్యాధి లక్షణాలు లేకున్నా.. వారి నుంచి ఇతరులకు వైరస్‌ సోకగలదని గుర్తుంచుకోవాలి. 

► కరోనా సోకి తగ్గినవారిలో యాంటీబాడీస్‌ ఎక్కువగా ఉన్న వారు కొంతవరకు సురక్షితమే అయినా.. ఆ యాంటీబాడీస్‌ ఎంత కాలం ఉంటాయనే దానిపై స్పష్టత లేదు, పైగా అవి పనిచేయని మరొక స్ట్రెయిన్‌ బారినపడే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కరోనా నియంత్రణలోకి వచ్చే దాకా జాగ్రత్త అవసరం. 

రెండుసార్లు సోకినా..
నా దగ్గరికి ఫస్ట్‌ వేవ్‌ సమయంలో 52 ఏళ్ల వయసు వ్యక్తి ఒకరు కోవిడ్‌తో వచ్చారు. షుగర్, హైపర్‌ టెన్షన్‌ వంటివి లేవు లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. హోంఐసోలేషన్‌లోనే ఉండాలని చెప్పి.. టెలి మెడిసిన్‌ ద్వారా ట్రీట్‌మెంట్‌ ఇచ్చాను. 5 రోజుల్లోనే లక్షణాలు తగ్గిపోయాయి. అదే వ్యక్తి ఈ ఏడాది మార్చిలో మళ్లీ ఫీవర్, జలుబు, నీరసం, ఒళ్లునొప్పులతో వచ్చారు. టెస్ట్‌ చేయిస్తే మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. మళ్లీ కరోనా వచ్చిందంటే తనకు ఇమ్యూనిటీ సరిగా లేదని బాధపడ్డారు. కౌన్సెలింగ్‌ చేసి జాగ్రత్తలు చెప్పాం. హోం ఐసోలేషన్‌లోనే ఉంచి మామూలుగానే మందులు, ట్రీట్‌ మెంట్‌ అందించాం. ఇప్పుడు వారం వరకు లక్షణాలు ఉన్నాయి. రికవరీ అయ్యాక సుమారుగా 3 వారాల పాటు నీరసంగా ఉన్నారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని వ్యాక్సినేషన్‌కు వెళ్లారు. 

వ్యాక్సిన్‌ వేసుకున్నాక..
‘‘రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్నా కూడా నాకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. అయితే మైల్డ్‌ సింప్టమ్స్‌ మాత్రమే కనిపించాయి. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి మందులతో రికవరీ అయ్యాను. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో మా ఇంట్లో వారికి వైరస్‌ సోకలేదు. మాతో కలిసి పనిచేస్తున్న వారిలో కొందరికి రెండోసారి కోవిడ్‌ వచ్చింది. ఒక డాక్టర్‌కు తొలిసారి కోవిడ్‌ వచ్చి తగ్గింది.వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నారు. తర్వాత నెల రోజుల్లో మరోసారి కోవిడ్‌ వచ్చింది. బీపీ, షుగర్‌ ఉన్నా కోలుకుని విధులకు హాజరవుతున్నారు. ఇలా రెండుసార్లు కోవిడ్‌ వచ్చి తగ్గినవారు చాలా మందే ఉన్నారు. అయితే మెడికల్‌ పీజీ స్టూడెంట్స్‌లో ఒకరు  రెండోసారి కరోనా సోకినప్పుడు సీరియస్‌ స్టేజ్‌కు వెళ్లారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో రెండోసారి కోవిడ్‌ సోకి, సీరియసైన వారు ఎవరూ లేరు.

వ్యాక్సిన్‌ వేసుకుంటే రికవరీ బాగుంటోంది!
‘ఏడాది నుంచీ కోవిడ్‌ రోగులతో పనిచేస్తున్నాను. రిస్క్‌ బాగా ఎక్కువగా ఉన్నా నేను కరోనా రాకుండా కాపాడుకోగలిగానంటే.. సాధారణ ప్రజలు కూడా కాపాడుకోగలరు అన్నట్టే కదా.. సరైన మాస్క్‌ ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. 

► చాలా మంది వ్యాక్సిన్‌ వేయించుకుంటే చాలు ఇంకేం ప్రాబ్లెం ఉండదు అనుకుంటున్నారు. ఇది సరైంది కాదు. వ్యాక్సిన్‌ ద్వారా మనకు 100 శాతం రక్షణ రాదు. రెండో డోసు కూడా వేయించుకున్న 2 వారాలకుగానీ, లేదా తొలి డోస్‌ నుంచి కనీసం 45 రోజులకు గానీ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందదు. యాంటీబాడీస్‌ చెక్‌ చేయించుకుంటే అప్పుడే కనపడతాయి. తొలి డోసు తీసుకోగానే ఏమీ కాదులే అనుకుని తిరగొద్దు. రెండు డోసులు పూర్తయి యాంటీబాడీస్‌ వచ్చిన వారిలోనూ కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే వ్యాక్సిన్‌ వేసుకోని వారితో పోలిస్తే వీరిలో వైరస్‌ ప్రభావం చాలా తక్కువగా, రికవరీ వేగంగా ఉంది.
 
► ఫస్ట్‌ వేవ్‌లో కరోనా వచ్చిపోయినందున ఏ సమస్య రాదని నిర్లక్ష్యంగా ఉండటం ప్రమాదకరం. గత నెల రోజుల్లో రెండోసారి వైరస్‌సోకిన 10 మంది వరకు మా డిపార్ట్‌మెంట్‌కు వచ్చారు. వారిలో యాంటీబాడీస్‌ తగ్గిపోవడం వల్ల మళ్లీ వైరస్‌సోకి ఉండొచ్చు. రీఇన్ఫెక్షన్‌ రేటు ప్రస్తుతం ఒక శాతంలోపే ఉంది. అది 2–3 శాతం వరకూ పెరిగినా ఫర్వాలేదు. అదే 20శాతం దాటితే మాత్రం ఇక రీఇన్ఫెక్షన్‌కు అంతు ఉండదనే చెప్పొచ్చు. అందువల్ల ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయినవారు కూడా మాస్క్, భౌతికదూరం, శానిటేషన్‌ సహా అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, సరిపడా నిద్ర వంటి అలవాట్లు చేసుకోవాలి. 

వెంటిలేటర్‌ వరకూ వెళ్లకుండా వ్యాక్సిన్‌ రక్ష 
రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్నాం.. ఇక మాకేం కాదనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో మాత్రం తిరగొద్దు. సెకండ్‌ వేవ్‌ వేరియంట్‌ చాలా భిన్నంగా ఉంది. కోవిడ్‌ గురించి పూర్తి పట్టు ఇంకా రాలేదు. వందల మందిని ట్రీట్‌ చేస్తూ కూడా.. ఏ పేషెంట్‌ ఎలా రికవర్‌ అవుతారు? ఎప్పుడు సీరియస్‌ అవుతారు? అనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నాం. మేం ఒకటి అనుకునేలోపే ఆరోగ్యం మరో విధంగా మారుతోంది. మా పేషెంట్స్‌లో కొందరు వ్యాక్సిన్‌ వేసుకున్నా తిరిగి పాజిటివ్‌ వచ్చింది. లక్షణాలు సీరియస్‌గా లేవు. వెంటిలేటర్‌ వరకు వెళ్లే అవసరం రావడం లేదు. అంటే 80శాతం వరకూ రిస్క్‌ ఉండదని చెప్పొచ్చు. ఈ వ్యాక్సిన్లు కేవలం 6, 7 నెలల ముందు తయారైనవి కాబట్టి వాటి సామర్థ్యం మీద అప్పుడే పూర్తిస్థాయి అంచనాలు వేయలేం. వ్యాక్సిన్‌ వేసుకున్నా మాస్కులు ఇతర జాగ్రత్తలు మాత్రం పొరపాటున కూడా మరచిపోవద్దు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top