బట్టలు, బూట్లు వైరస్‌ను‌ తెస్తే.. ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయాలు ఇలా

Corona Virus Experts Opinions Myths And Facts Are Follows - Sakshi

కరోనా సెకండ్‌వేవ్‌ ఆరంభమైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక పక్క టీకా కార్యక్రమం కొనసాగుతున్నా సమాజంలో కేసులు పెరగడంపై ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీలు డెవలప్‌ అయ్యేందుకు సమయం పడుతుంది, ఈలోపు వారు భౌతిక దూరం లాంటి నిబంధనలు పాటించక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా బారిన పడే ఛాన్సులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక నష్టానికి భయపడి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఆలోచన చేయడం లేదు. ఈ నేపథ్యంలో సెకండ్‌ వేవ్‌ ప్రభావాన్ని తప్పించుకోవాలంటే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పదని వైద్య, ఆరోగ్య నిపుణుల సూచన. కరోనా రూపుమార్చుకొని కొత్త స్ట్రెయిన్ల రూపంలో పంజా విసురుతుంది కాబట్టి తొలిదశ కన్నా మరింతగా అప్రమత్తత అవసరమంటున్నారు. కొత్త స్ట్రెయిన్లు, సెకండ్‌వేవ్‌ ఆరంభం సందర్భంగా కరోనా, దానిపై వినిపించే రూమర్లు, నిజాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు.. తదితర అంశాలపై పునరావలోకనం ఈవారం ప్రత్యేకం....

సంవత్సర కాలంగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు బలిగొంది. కరోనాకు టీకాలు కనుగొన్నా అన్ని దేశాల్లో ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీ స్థాయిలు రాలేదు. మరోవైపు కరోనా సెకండ్‌వేవ్‌ పలు దేశాల్లో ఆరంభమై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా బయటపడినప్పటినుంచి ఈ వైరస్‌ను ఫలానా ఫలానా వాటితో నిర్మూలించవచ్చంటూ రకరకాలు అపోహలు బయలుదేరాయి. వీటిలో కొన్ని కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సాయపడినా, వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిపుణులు. కరోనాపై అపోహలు, వాస్తవాల గురించి ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. 

కరోనా విపత్కర కాలంలో ‘ఇందుగలదందు లేదని’ అన్నట్లు ఈ వైరస్‌ ఏ వస్తువుపై ఉందో... వాటి ద్వారా ఎప్పుడు? ఎలా? ఒంట్లోకి, ఇంట్లోకి చొరబడుతుందోనని జనంలో భయం... ఏదో ఒక పని మీద బయటకెళ్లి తిరిగి వచ్చినప్పుడు తమతోపాటే వైరస్‌ను మోసుకొచ్చామేమో అనే కలవరపాటు.. మాస్క్‌ వేసుకొని ఉన్నా, భౌతిక దూరం పాటించినా, చేతులను శానిటైజ్‌చేసినా, ఇంటికి రాగానే ముట్టుకున్న డోర్, తాళం వంటి వాటిని, మార్కెట్‌ నుంచి తెచ్చిన వస్తువులను రసాయనాలతో క్రిమిరహితం చేసినా ఇంకా ఎక్కడో ఏదో అనుమానం.. ఇందులో ఒక కారణం దుస్తులు, బూట్లు. వీటి ద్వారా వైరస్‌ ఇంట్లోకి వచ్చిందేమో అనే సందేహం. ఈ ఆందోళనలపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. 

వాహకాలే.. కానీ..
ప్లాస్టిక్, ఇనుము, రాగి వస్తువులు కొవిడ్‌ వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తాయనే సంగతి తెలిసిందే. అలాగే దుస్తులు, బూట్లు సైతం ఈ వైరస్‌కు ఆశ్రయమిస్తాయి. కానీ వీటి ద్వారా వైరస్‌ వ్యాపించిందనడానికి సరైన ఆధారాలు లేవంటున్నారు వైద్య నిపుణులు. ‘ఈ వైరస్‌ గురించి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దుస్తులు, బూట్ల ద్వారా ఇతరులకు వ్యాపించినట్లు ఆధారాలు లేవు’ అని అమెరికాలోని ఓర్లాండోలో ఉన్న అడ్వాంట్‌హెల్త్‌ కేంద్రం నిపుణులు చెప్పారు. వాస్తవానికి వస్తువు ఉపరితలాన్ని బట్టి వైరస్‌ కొన్ని గంటల నుంచి రోజుల వరకు వాటిపై మనగలుగుతుంది. ఇందులో ఇనుము, ప్లాస్టిక్‌పై అత్యధికంగా 2 నుంచి 3 రోజుల వరకు ఉండగలుగుతుంది. అలాగే దుస్తులు, బూట్లపైనా కొన్ని గంటల పాటు జీవిస్తుంది. అంటే కఠిన ఉపరితలం ఉండే వస్తువులతో పోలిస్తే దుస్తులపై వైరస్‌ ఎక్కువ సేపు మనలేదు. కారణం.. వైరస్‌ ఎక్కువ రోజులు ఉండడంలో వాతావరణం, తేమ, ఆర్ధ్రతది కీలకపాత్ర. దుస్తుల స్వభావం దీనికి విరుద్ధం కాబట్టి ఎక్కువ సేపు బతకలేదు. 

తరచూ ఉతకడం..
దుస్తుల వల్ల వైరస్‌ వ్యాపించినట్లు ఆధారాలు లేకపోయినప్పటికీ, కచ్చితంగా రాదు అనీ చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు. అందువల్ల కొవిడ్‌ రోగులకు సేవలు చేసే వాళ్లు.. ముఖ్యంగా ఆరోగ్య సిబ్బంది తమ దుస్తులను తరచూ డిటర్జంట్లతో ఉతికి, ఇస్త్రీ చేసుకోవడం మేలంటున్నారు. అయితే, మార్కెట్‌కో, సరకుల దుకాణానికో వెళ్లి వచ్చిన ప్రతిసారి ఇలా చేయాల్సిన అవసరం లేదంటున్నారు. భౌతిక దూరం పాటించడం కష్టమైనప్పుడు, లేదా ఎవరైనా దుస్తుల మీద పడేలా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాత్రం ఇంటికి రాగానే వాటిని ఉతికి, ఇస్త్రీ చేయాలని సూచిస్తున్నారు. 

షూ సంగతి?
సాధారణంగా దుస్తులతో పోలిస్తే బూట్లపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. అలాగే వీటిపైనా కరోనా వైరస్‌ చేరుతుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) సర్వేలో తేలింది. దీనికోసం పరిశోధకులు చైనాలో కొవిడ్‌ వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించిన కొంత మంది వైద్యుల బూట్లను పరిశీలించినప్పుడు వాటి కింది భాగంలో వైరస్‌ ఉండడాన్ని గుర్తించారు. అయితే, సాధారణంగా బూట్లను ఇంట్లోకి తీసుకురావడం అరుదు. ఇంటిబయట తలుపు వద్దనే వదులుతారు. ఒకవేళ వాటిని ఇంట్లోకి తీసుకురావాల్సి వస్తే బయటే మొదట డిజర్జంట్‌ నీళ్లు లేదా రసాయనాలతో శుభ్రం చేయాలి. లేదా వాటిని ఇంటి బయట ప్రత్యేక స్థలంలో వదలాలి. 

దుస్తులు, షూ ద్వారా వైరస్‌ రావడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అయితే, అన్నింటికంటే ముఖ్యం మార్కెట్‌కు, జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్‌ చేసుకోవడం. వీటిని మాత్రం కచ్చితంగా పాటించాలనేది వైద్య నిపుణులు స్పష్టంగా చెప్పేమాట.  -దుర్గరాజు శాయి ప్రమోద్‌ 

చదవండి: (కరోనా ప్రమాద ఘంటికలు.. తెలుసుకోవాల్సిన విషయాలు)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top