పిల్లలు ఆడుతూ పాడుతూ ఇంటి పనులు చేసేలా నేర్పించండిలా! | Cooking Skills Every Kid Should Learn Step By Step Guide | Sakshi
Sakshi News home page

పిల్లలు ఆడుతూ పాడుతూ ఇంటి పనులు చేసేలా నేర్పించండిలా!

Published Sun, Dec 10 2023 3:13 PM | Last Updated on Sun, Dec 10 2023 3:21 PM

Cooking Skills Every Kid Should Learn Step By Step Guide - Sakshi

‘కోటి విద్యలు కూటి కోసమే’ అని లోకోక్తి. కానీ, ‘కూటి విద్యను నేర్చుకున్నాకే కోటి విద్యలూ’ అనేది ఈతరం సూక్తి. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. అందుకు స్వయంపాకమైతే దీ బెస్ట్‌ అనే సలహా ఇస్తారు ఆరోగ్య స్పృహ కలిగినవాళ్లెవరైనా! చదువు, కొలువుల కోసం ఉన్న ఊరును వదిలి.. పరాయి చోటుకు పయనమయిన.. అవుతున్న వారంతా ఆ సలహాకే పోపేస్తున్నారు. ఎసట్లో నాలుగు గింజలు ఉడికించుకుంటున్నారు. వర్కింగ్‌ పేరెంట్స్‌ ఉన్న పిల్లలకూ ఇది అవసరంగా మారుతోంది. పిల్లల చేతికి గరిటెనందిస్తోంది. రకరకాల వంటకాలను నేర్చుకునేందుకు ప్రేరేపిస్తోంది. అలా పిల్లలు ఆడుతూ పాడుతూ వండుకునే మెనూస్‌నీ.. వంటింటి చిట్కాలనూ తెలుసుకుందాం!

వంట చేయడం ఓ కళైతే.. దాన్ని వారసత్వంగా పిల్లలకు అందించడం అంతకు మించిన కళ. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను యుక్తవయస్సు దాటేవరకు వంట గదివైపే రానివ్వరు. కానీ.. ఏ విద్యలోనైనా అనుభవజ్ఞులు నేర్పించే పాఠం కంటే అనుభవం నేర్పించే పాఠం ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే చిన్న వయసు నుంచి పిల్లల్ని వంట పనుల్లో, ఇంటిపనుల్లో భాగం చేయడం అవసరం. సలాడ్స్‌ చేయడం.. రెసిపీలు కలపడం వంటి చిన్న చిన్న పనులతో పాటు.. ఏ కూరగాయ ఎలా ఉడుకుతుంది? ఏ బియ్యాన్ని ఎంతసేపు నానబెట్టాలి? ఏ వంటకానికి ఎలా పోపు పెట్టాలి? వంటి వాటిపై అవగాహన కల్పించాలి.

సాధారణంగా వంటింట..  పదునైన కత్తులు, బ్లేడ్‌లు, ఫ్లేమ్స్‌.. వేడి నూనెలు, నెయ్యి ఇలా చాలానే ఉంటాయి. అందుకే పిల్లల్ని ఆ దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటారు పేరెంట్స్‌. నిజానికి వంటగదిలోకి రానివ్వకుండా ఆపడం కంటే.. పర్యవేక్షణలో అన్నీ నేర్పించడమే మేలు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతివాళ్లకూ ఏదో ఒకరోజు తమ వంట తామే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

కత్తి తెగుతుందని, నిప్పు కాలుతుందనే విషయం తెలిసే వయసులోనే పిల్లలు ఉప్పుకారాల మోతాదులు అర్థంచేసుకుంటే మంచిది అంటున్నారు కొందరు పెద్దలు. దీనివల్ల సెల్ఫ్‌డింపెడెన్సే కాదు.. జెండర్‌ స్పృహా కలుగుతుందని అది అత్యంత అవసరమనీ పెద్దల అభిప్రాయం. అందుకే పాఠ్యాంశాలతోపాటు పాకశాస్త్రాన్నీ సిలబస్‌లో చేర్చాలని.. ఒకవేళ సిలబస్‌లో చేర్చలేకపోయినా హోమ్‌వర్క్‌లో మస్ట్‌గా భాగం చెయ్యాలని అనుభవజ్ఞుల సూచన.

ఎందుకంటే..?
► వంట పనుల్లో భాగం అయినప్పుడు పిల్లలకు అది ఒక ప్రాక్టికల్‌ శిక్షణలా ఉపయోగపడుతుంది. గణితం, సైన్స్‌ నేర్చుకోవడానికి.. ఒక మార్గం అవుతుంది. ఎలా అంటే.. కొలతలు, వినియోగం వంటి విషయాల్లో ఓ లెక్క తెలుస్తుంది. అలాగే నూనె, నీళ్లు ఇలా ఏ రెండు పదార్థాలను కలపకూడదు? ఏ రెండు పదార్థాలు కలపాలి? అనే విషయం వారికి అర్థమవుతూంటుంది.
► చిన్న వయసులోనే వంట నేర్చుకోవడంతో.. ఓర్పు నేర్పు అలవడుతాయి. శుచీశుభ్రత తెలిసొస్తుంది. అలాగే ప్రిపరేషన్, ప్రికాషన్స్‌ వంటివాటిపై క్లారిటీ వస్తుంది

► బాల్యంలోనే రెసిపీల మీద ఓ ఐడియా ఉండటంతో.. ఒక వయసు వచ్చేసరికి వంట మీద పూర్తి నైపుణ్యాన్ని సంపాదిస్తారు.
► తక్కువ సమయంలో ఏ వంట చేసుకోవచ్చు.. ఎక్కువ సమయంలో ఏ కూర వండుకోవచ్చు వంటివే కాదు.. కడుపు నొప్పి, పంటినొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు చిట్కాలూ తెలుస్తాయి.
► రెసిపీలు విఫలమైతే పిల్లలు.. విమర్శలను సైతం ఎదుర్కోవడం నేర్చుకుంటారు. వైఫల్యం జీవితంలో సర్వసాధారణమని బోధపడుతుంది. గెలుపోటములను సమంగా తీసుకునే మనోనిబ్బరాన్ని అలవరుస్తుంది.
► స్కూల్లో, బంధువుల ఇళ్లల్లో.. ఇతరులతో కలిసేందుకు ఈ ప్రయోగాలన్నీ పిల్లలకు ప్రోత్సాహకాలవుతాయి. అలాగే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.

వంట నేర్చుకోబోయే పిల్లల్ని.. వయసు ఆధారంగా చేసుకుని.. నాలుగు రకాలుగా విభజించుకుంటే.. వంట నేర్పించడం చాలా తేలిక అంటున్నారు నిపుణులు. 3 – 5 ఏళ్ల లోపున్న పిల్లలు మొదటి కేటగిరీకి చెందితే.. 5  – 7 ఏళ్లలోపు పిల్లలు రెండో కేటగిరీలోకి వస్తారు. ఇక 8 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు మూడో కేటగిరీలోకి, 13 ఏళ్ల తర్వాత పిల్లలంతా నాలుగో కేటగిరీలోకి వస్తారు. మొదటి రెండు కేటగిరీల్లో పిల్లలకు చిన్న చిన్న పనులు అలవాటు చేస్తే.. ఎదిగే కొద్దీ వాళ్లలో నైపుణ్యం పెరుగుతుంది.

సాధారణంగా మూడు నుంచి ఐదు ఏళ్లలోపు పిల్లల్లో.. పెద్దలు చేసే ప్రతి పనినీ తామూ చేయాలని.. పెద్దల మెప్పు పొందాలనే కుతూహలం కనిపిస్తూంటుంది. వంటగదిలో కొత్త పనిని ప్రయత్నించడానికి ఉత్సాహంగా ఉంటారు. అయితే వారికి చేతుల్లో ఇంకా పట్టు.. పూర్తి అవగాహన ఉండవు కాబట్టి.. అలాంటి పిల్లలకు చిన్నచిన్న పనులను మాత్రమే చెప్పాలి. వారికి నెమ్మదిగా అలవాటు చేయడానికి వీలుండే పనులను, పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేని వాటిని వారి చేతుల్లో పెట్టొచ్చు. ఎక్కువగా కూర్చుని చేసే పనులను వారికి అప్పగించాలి.

చేయించదగిన పనులు..
- పండ్లు, కూరగాయలు కడిగించడం, చపాతీ పిండి కలపడంలో సాయం తీసుకోవడం.
- పాలకూర వంటివి కడిగి.. తురుములా తెంపించడం.
- బనానా వంటివి గుజ్జులా చేయించడం.(ఆ గుజ్జు బ్రెడ్, ఐస్‌క్రీమ్‌ వంటివి తయారుచేసుకోవడానికి యూజ్‌ అవుతుంది)

ఐదేళ్లు దాటేసరికి.. పిల్లల్లో మోటార్‌ స్కిల్స్‌ బాగా పెరుగుతాయి. అంటే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఏ పనిలోనైనా ఫర్ఫెక్ట్‌నెస్‌ పెరుగుతూంటుంది. అలాంటివారికి ఆహారాన్ని సిద్ధం చేయడంలో మెలకువలు నేర్పించొచ్చు. అప్పుడప్పుడే చదవడం, రాయడం ప్రారంభిస్తుంటారు కాబట్టి.. వారికి వంటకాలను పరిచయం చేయడానికి ఈ వయసే మంచి సమయం. వంటలో వాళ్లు  మనకు సహాయపడగలిగే సులభమైన రెసిపీలను చెబుతుండాలి. వారు ఉపయోగించగలిగే చాప్‌ బోర్డ్స్, ఇతరత్రా చిన్నచిన్న కిచెన్‌ గాడ్జెట్స్‌ ఆన్‌లైన్‌లో దొరుకుతాయి.


చేయించదగిన పనులు..

- పొడి పదార్థాలను నీళ్లు పోసి కలపడం
- ఇన్‌గ్రీడియెంట్స్‌ని కొలవడం, లేదా లెక్కించడం ∙డైనింగ్‌ టేబుల్‌ని సర్దించడం
- గుడ్లు పగలగొట్టించడం (పెంకుల విషయంలో కాస్త దగ్గరుండాలి)
- పిండి వంటల్లో కానీ.. స్నాక్స్‌లో కానీ ఉండలు చేసే పనిని వారికి అప్పగించడం
- మృదువైన పండ్లు, కూరగాయలను కట్‌ చేయించడం
- రెసిపీని పెద్దగా రెండు మూడు సార్లు చెప్పించడం.. ఖాళీ సమయాల్లో ఒకటికి రెండు సార్లు ఆ వివరాలను గుర్తుచేయడం
- చిన్న చిన్న చపాతీలు చేయించడం

ఎనిమిదేళ్ల నుంచి పన్నెండేళ్ల లోపు పిల్లల్లో స్వతంత్ర ఆలోచనలు పెరుగుతుంటాయి. తమ పనులను తాము చేసుకుంటూంటారు. ఈ వయసు వచ్చేసరికి వంట గదిలో వారికి ఎక్కువ పర్యవేక్షణ అవసరం ఉండదు. సొంతంగా ఎవరి సాయం లేకుండానే వీరు చిన్నచిన్న ఫుడ్‌ ఐటమ్స్‌ సిద్ధం చేయగలరు. తిన్న ప్లేట్‌ లేదా బౌల్‌ కడిగిపెట్టడం, లంచ్‌ బాక్స్‌ సర్దుకోవడం, కిరాణా సామాన్లు జాగ్రత్త చేయడం వంటివన్నీ వాళ్లకు అలవాటు చేస్తూండాలి.

చేయదగిన పనులు..
- కూరగాయలు లేదా పండ్ల తొక్క తీసుకుని, కట్‌ చేసుకుని సలాడ్స్‌ చేసుకోవడం
- శాండ్విచెస్, బ్రెడ్‌ టోస్ట్‌లు చేసుకోవడం, ఆమ్లెట్స్‌ వేసుకోవడం
- జ్యూసులు తీసుకోవడం ∙మరమరాలు, అటుకులతో పిడత కింద పప్పు, పోహా వంటివి చేసుకోవడం, ఇన్‌స్టంట్‌గా తీపి లేదా కారం రెసిపీలు చేసుకోవడం

చిన్నప్పటి నుంచి కుకింగ్‌ మీద అవగాహన ఉన్నవారికి.. సుమారు 13 ఏళ్లు వచ్చేసరికి కిచెన్‌లోని ప్రతి వస్తువును ఎలా వాడాలి? ఏది ఎప్పుడు వాడాలి? అనేది తెలుస్తూంటుంది. వీరిలో తగు జాగ్రత్తే కాదు చక్కటి నైపుణ్యమూ ఉంటుంది. ఇప్పటి తరానికి స్మార్ట్‌ గాడ్జెట్స్‌ పైన బీభత్సమైన కమాండ్‌ ఉంది. కాబట్టి ఓవెన్‌ని ఉపయోగించడం, ఇండక్షన్‌ స్టవ్‌ వాడటం వంటివి వీరికి ఈజీ అవుతాయి.

చేయదగిన పనులు..
- గ్యాస్‌ స్టవ్‌పై ఆమ్లెట్స్‌ వేసుకోవడం
- ఎలక్ట్రిక్‌ కుకర్‌లో జొన్నకండెలు, చిలగడ దుంపలు, గుడ్లు వంటివి ఉడికించుకోవడం 
- పదునైన కత్తులు జాగ్రత్తగా వాడటం 
- పెద్దల సమక్షంలో బ్లెండర్, ఫుడ్‌ ప్రాసెసర్, గార్లిక్‌ ప్రెస్, కాఫీ మేకర్, వాఫిల్‌ మేకర్‌ వంటి వివిధ కిచెన్‌ గాడ్జెట్‌ల వాడకాన్ని  నేర్చుకోవడం,  మైక్రోవేవ్‌పై పూర్తి అవగాహన తెచ్చుకోవడం, ఐస్‌క్రీమ్‌ వంటివి సిద్ధం చేసుకోవడం
- కిచెన్‌ క్లీనింగ్‌ నేర్చుకోవడం వంటి విషయాల‌పై శ్ర‌ద్ధ క‌ల్పించాలి.
(చ‌ద‌వండి: పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement