Chetna Vasishth: ఒకప్పుడు కార్పొరేట్‌ ఉద్యోగి.. సబ్‌స్క్రైబర్స్‌ 30 లక్షల మందికి పైనే!

Chetna Vasishth: Chetchat Inspirational Journey In Telugu - Sakshi

గైడింగ్‌ ట్రీ

జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగిన వాళ్లు ఎప్పుడూ బిజీగా ఉంటారు. తీరికలేకపోయినప్పటికీ సేవా దృక్పథం ఉన్న వారు.. తమ సంపద నుంచి కొంత విరాళంగా ఇచ్చి, సమాజాభివృద్ధికి తోడ్పడుతుంటారు. వీరందరికీ విభిన్నంగా వ్యవహరిస్తూ.. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌ వైపు అడుగులు వేసేలా కృషిచేస్తున్నారు చేతన వశిష్ట. గోల్డ్‌మెడల్‌ స్టూడెంట్, యూనివర్శిటీ ర్యాంకర్‌ ఆమె. పదేళ్లపాటు కార్పోరేట్‌ ఉద్యోగిగా పనిచేసిన అనుభవంతో.. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిన విద్య, చేయాల్సిన కోర్సులను ఎలా ఎంచుకోవాలి?

కాలేజీ, యూనివర్శిటీలలో ఏవి బావుంటాయి... వంటి అంశాలకు విశ్వసనీయమైన సమాచారాన్ని గైడింగ్‌ ట్రీలా వివరిస్తూ వ్యూవర్స్‌ను ఆకట్టుకుంటోంది చేతన. దీంతో ఆమె ఫాలోవర్స్‌ లక్షల్లోనే ఉన్నారు.  కెరియర్‌ గైడెన్స్, విజయవంతంగా రాణిస్తోన్న వ్యాపారవేత్తల స్టోరీలను తనదైన శైలిలో వివరిస్తూ లక్షలమంది యువతరానికి మార్గనిర్దేశనం చేస్తున్నారు ముంబైకి చెందిన చేతన వశిష్ట. బీఏ ఎకనామిక్స్‌ చేసిన చేతన తరువాత ఎక్స్‌ ఎల్‌ఆర్‌ఐ జంషెడ్‌పూర్‌లో పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రిలేషన్స్‌లో ఎంబీఏ చేసింది. ఇన్‌స్టిట్యూట్‌ మొత్తంలో రెండో ర్యాంక్‌ పొందడమేగాక, మొత్తం పెర్‌ఫార్మెన్స్‌లో గోల్డ్‌ మెడల్‌ అందుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలో మంచి ర్యాంకర్‌ స్టూడెంట్‌గా నిలిచింది.  

లెర్నింగ్‌ ట్రీ.. 
చేతన పీజీ అయ్యాక ఏఎన్‌జెడ్‌ గ్రిండ్‌లేస్‌ బ్యాంక్, స్టాండర్డ్‌ చార్టెడ్‌ బ్యాంక్‌లలో సేల్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేసింది. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరులలోని ఈ బ్యాంకుల విభాగాల్లో పదేళ్లపాటు పనిచేసింది. 2001 నుంచి 2007 వరకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎమ్‌) బెంగళూరు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐపీఎమ్‌) ముంబైలకు విజిటింగ్‌ ఫ్యాకల్టీగా పనిచేసేది. ఈ క్రమంలోనే 2007లో ‘లెర్నింగ్‌ ట్రీ’ పేరిట ట్రైనింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసింది.

దీని ద్వారా ఎన్నో బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థలకు కన్సల్టంట్‌గా పనిచేసింది. ఇంతటి ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వహిస్తోన్న సమయంలో ఎంతోమంది సక్సెస్‌పుల్‌ ఎంట్రప్రెన్యూర్‌లను కలిసిన చేతన వారి ఆలోచనా దృక్పథాన్ని తెలుసుకోవడం ద్వారా ఇతరులకు సాయం చేసే గుణమున్న ఓఫ్రా విన్‌ఫ్రేను ఆదర్శంగా తీసుకుని వాళ్లలాగా సేవచేయాలనుకుంది.. భవిష్యత్‌ను బంగారుమయంగా మార్చే విద్యకు సరైన గైడెన్స్‌ అందిస్తే యువతరం అద్భుతాలు సాధిస్తుందని భావించింది. ఏ కోర్సు చేయాలి? ఎక్కడ ఎడ్యుకేషన్‌ బావుంది? కోర్సులను అందిస్తోన్న కాలేజీలు యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయో వివరంగా చెప్పడానికి సరైన మాధ్యమం లేదని గ్రహించిన సమయంలో చెట్‌చాట్‌ ఆలోచన వచ్చింది తనకు.

చెట్‌చాట్‌.. 
చేతనకు సోషల్‌ మీడియా గురించి అంతగా తెలియకపోయినప్పటికీ 2015లో చెట్‌చాట్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. ఇది ఒకరకమైన కెరియర్‌ ఓరియంటేషన్‌ ఛానల్‌. ప్రారంభంలో లాయర్స్, డాక్టర్స్, డిజైనర్స్, చార్టెడ్‌ అకౌంటెంట్స్, డెంటిస్ట్స్, ఎంట్రప్రెన్యూర్స్, ప్రోస్థటిక్‌ డిజైనర్స్, సీఈవోలను ఎందరినో ఇంటర్వ్యూలు చేసి ఆ వీడియోలు పోస్టు చేసేది. ఈ క్రమంలో వాళ్లు మాట్లాడేటప్పుడు ‘‘హార్వర్డ్, కేంబ్రిడ్జి, కొలంబియా, ఆక్స్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటోలలో వాళ్ల అనుభవాలు పంచుకోవడం, యూపీఎస్‌సీ, క్లాట్, ఐబీపీఎస్, సీఏ ఎంట్రన్స్‌ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు వాళ్లు ఎదుర్కొన్న అనేక అనుభవాలను చెబుతూ..వీటికి సంబంధించిన విషయాలు చెప్పేవాళ్లు ఎవరూ లేరు.

విద్యార్థులకు వీటిగురించి సమాచారం అందించే సైట్లు పెద్దగా లేవు. వీటిమీద మీరు వీడియోలు రూపొందిస్తే బావుంటుంది’’ అని చెప్పారు. అప్పటినుంచి చెట్‌చాట్‌లో కెరియర్‌ గైడెన్స్‌ను ప్రారంభించింది. చేతన కూడా ఒకప్పుడు స్వతహాగా మెరిట్‌ స్టూడెంట్‌ కావడం, ఐఐఎమ్‌లకు గెస్ట్‌ ఫ్యాకల్టీగా వ్యవహరించిన అనుభవంతో విద్యార్థులకు కెరియర్‌ గైడెన్స్‌ అందించేది. వందశాతం విశ్వసనీయమైన, విలువైన సమాచారం అందించడంతో ఆమె చెట్‌చాట్‌కు క్రమంగా మంచి ఆదరణ లభించింది.

కెరియర్‌ గైడెన్స్, సక్సెస్‌పుల్‌ వ్యాపార వేత్తల స్టోరీలు, వృత్తినిపుణులతో చిట్‌ చాట్, బెస్ట్‌ స్టడీ టెక్నిక్స్, మానసికంగా ఎలా దృఢంగా ఉండాలి? నిరాశానిస్పృహలను ఎలా ఎదుర్కొవాలి వంటి అనేక విషయాలను చెబుతోంది. ఎడ్యుకేషన్, కెరియర్‌ స్టడీ టిప్స్, లెర్నింగ్‌ ఇంగ్లీష్‌, స్కాలర్‌షిప్స్‌ అందించే విదేశీ విద్యకు సంబంధించిన సలహాలు, సూచనలు అందిస్తోంది. దీంతో చెట్‌చాట్‌ సబ్‌స్ట్రైబర్స్‌ ముప్ఫై లక్షల మందికి పైనే ఉండగా, ఆమె ఇన్‌స్ట్రాగామ్‌ ఫాలోయర్స్‌ సంఖ్య కూడా నలభై ఐదువేలకు మందికి పైమాటే! 

చదవండి: ప్లస్‌ సైజ్‌అయినా మైనస్‌ కాదు
Manjula Pradeep: ఎవరీమె... ఏం చేస్తున్నారు.. ఎందుకీ పోరాటం?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top