భవిష్యత్తు ఇలాగే ఉంటుందని ఎవరూ చెప్పలేరు. ఇంతకంటే బాగుండాలనే అందరూ అనుకుంటారు. ఆశపడతారు. అయితే అందుకు తగ్గట్టు ఏమి చేస్తున్నారనేదే ప్రశ్న.
ఆనందం; పరమానందం; బ్రహ్మానందం- మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా – మనం లౌకిక అర్థమే చూద్దాం. ఆనందం వెతుక్కోవడంలోనే మనం తికమక పడుతున్నాం. ఆనందం కానిది ఆనందం అనుకుని పరుగులు తీస్తున్నాం. జీవితం ఎప్పుడూ సరళరేఖ కానేకాదు. ఒకేవేగం, ఒకే పద్ధతిలో వెళ్ళదు. ఎగుడు దిగుళ్లు; లాభనష్టాలు; కష్టసుఖాలు సహజం. అయితే లాభమూ సుఖమూ ఆనందించదగ్గది – నష్టమూ కష్టమూ భరించకూడనిది అవుతుంది. ఇక్కడే వస్తోంది చిక్కంతా.
జీవితం సంక్లిష్టం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ సంక్లిష్టమయినప్పుడు బయటపడడానికి, ఆ ప్రయత్నంలో ఆనందం వెతుక్కోవడానికి ప్రయత్నించేవారు తక్కువ.
ఆనందం దానికదిగా వస్తువు కాదు. మార్కెట్లో దొరకదు. ఆనందం అక్షరాలా మనకు మనమే తయారుచేసుకోవాల్సిన పదార్థం. మనలో మనమే వెతికి పట్టుకోవాల్సిన వస్తువు. మనలోపలే ఉన్నా మనం లేదనుకుని వెతికే ఫీలింగ్. ఒక అనుభూతి. ఒక మానసిక స్థితి.
మరి – మనలోపలే ఆనందం టన్నుల కొద్దీ ఉంటే మనకెందుకు కనిపించదు? అనిపించదు?
గెలుపు ఆనందం- ఓటమి బాధ. స్థూలంగా ఆనందానికి- బాధకు మన నిర్వచనం ఇది. లక్ష్యం , గమ్యం ఆనందం.
చేరేదారి, గమనం బాధ. నొప్పి, అసహ్యం, అసహనం, అసంతృప్తి.
గమ్యంతోపాటు గమనాన్ని, చేరే దారిని కూడా ఆనందించాలి, ప్రేమించాలి, అనుభవించాలి.
జీవితం చాలాసార్లు సవాళ్లు విసురుతుంది. ఇక మార్గమే లేనట్లుగా చేస్తుంది. బరువుగా మారుతుంది. దిగులుగా చేస్తుంది. నీరసపరుస్తుంది. నిస్పృహ నింపుతుంది. మొండిగా బండగా మారుస్తుంది. కానీ ఇలాంటి సమయాల్లో కూడా ఆనందాలను వెతుక్కోవాలి. అలవికాని ఆశలు, అంచనాలు, ఇతరులతో పోలిక, ఇతరులు ఏమనుకుంటారోనన్న ఆందోళనలు వదిలేస్తే ఎన్నెన్నో ఆనందాలు కళ్ళముందే ప్రత్యక్షమవుతాయి.
-పమిడికాల్వ మధుసూదన్



