చైనాలో పెరుగుతున్న కేసులు..ఆరు రాష్ట్రాల్లో అలర్ట్‌!

Centre Flags Surge In China Respiratory Infections 6 States Alert Mode - Sakshi

చైనాలో కొత్తగా నిమోనియా కేసులు పెరుగుతుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. ముఖ్యంగా చైనాలోని చిన్నారులే ఈ నిమోనియా వ్యాధి బారిన పడటంతో సర్వత్రా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అలర్ట్‌ జారీ చేసింది. తమ పరిధిలో ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో అనే ఆరోగ్య సంసిద్ధతపై సమగ్రస్థాయిలో సమీక్ష నిర్వహించుకోవాలని ప్రకటన చేసింది. దీంతో దాదాపు ఆరు రాష్ట్రాలు తమ పరిధిలోని ఆరోగ్య మౌలిక సదుపయాలను అప్రమత్తం చేశాయి.

ఈ మేరకు రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, తమిళనాడు తదితర రాష్ట్రాల ఆరోగ్య శాఖ శ్వాసకోసశ సంబంధిత సమస్యలతో వచ్చే రోగులకు సత్వరమే వైద్యం అందించేలా సంసిద్ధంగా ఉండేటమేగాక ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకోవాలని ఆస్పత్రులను, సిబ్బందిని కోరింది. నిజానికి సీజనల్‌గా వచ్చే ఫ్లూ వంటి వ్యాధుల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే కాలానుగుణంగా ఈ వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే గైడ్‌లైన్స్‌లు కూడా వారికి అందించాలని పేర్కొంది. ఇక రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం..ప్రస్తుతం పరిస్థితి ఏమీ అంత ఆందోళనకరంగా లేదని తెలిపింది. అయినప్పటికీ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడం తోపాటు పీడియాట్రిక్‌ యూనిట్లతో సహా మెడిసిన్‌ విభాగాలలో తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.

అలాగే గుజరాత్‌ ఆరోగ్య మంత్రి రుషికేశ్‌ మాట్లాడుతూ..ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్‌ 19 మహమ్మారి సమయంలో ఉన్న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలన్నింటిని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడూ ఆయా ప్రభుత్వ ఆస్పత్రులన్నీ తమ ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించాలని ఆరోగ్య అధికారులను కోరారు. అదేవిధంగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా శ్వాసకోశ వ్యాధులపై నిఘా పెంచాలని ఆరోగ్య అధికారులను ఆదేశించింది. పైగా ఉత్తరాఖండ్‌లోని దాదాపు మూడు జిల్లాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను మరింత కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

హర్యానా రాష్ట్రం ప్రభుత్వం ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులను శ్వాసకోస సమస్యకు సంబంధించిన కేసు వస్తే వెంటనే నివేదించాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. తమిళనాడు ఆరోగ్య శాఖ కూడా ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించిన న్యూమోనియో కేసులు నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ. ఒకవేళ ఏ కేసు అయినా నమోదైతే వెంటనే పరిష్కరించేలా ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకునేలా అధికారుల అప్రమత్తంగా ఉండేందుకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు పేర్కొంది.

ఆ కరోనా మహమ్మారి వచ్చిన నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా చైనాలో పిల్లలో ఈ కొత్త తరహ నిమోనియా కేసులు నమోదవ్వడంతో ప్రపంచదేశాలన్ని ఉలిక్కిపడ్డాయి. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడూ పరిస్థితి గురించి వెల్లడించాలని చైనాను ఆదేశించడంతో ప్రపంచదేశాలన్నీ కలవరపాటుకు గురయ్యాయి. చైనా మాత్రం శీతకాలం తోపాటు వివిధ వ్యాధి కారకాల వల్లే  ఈ వ్యాధి ప్రబలినట్లు వివరణ ఇచ్చుకుంది. పైగా ఇది కోవిడ్‌-19 మహమ్మారి సమయం నాటి తీవ్రత కాదని కూడా స్పష్టం చేసింది చైనా. 

(చదవండి: శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమిదే : చైనా)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top