ఇంకా ఎంత కాలం ఆగాలి?

Best Time To Do Family Planning Operation After Delivery - Sakshi

సందేహం

నా వయసు 32 సంవత్సరాలు. రెండేళ్ల కిందట నాకు సిజేరియన్‌ కాన్పు జరిగింది. బిడ్డ ఎదురు కాళ్లతో ఉండటం వల్ల సిజేరియన్‌ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు నేను మళ్లీ గర్భిణిని. ఏడోనెల. ఈసారి సాధారణ కాన్పు కోసం ప్రయత్నించవచ్చా? కాన్పు తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాలనుకుంటే ఎంతకాలం ఆగాల్సి ఉంటుంది?
– శైలజ, కర్నూలు

సాధారణ కాన్పు అవ్వాలి అంటే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. వీటిలో మొదటిది బిడ్డ బరువు, బిడ్డ తల పొజిషన్, ఉమ్మనీరు వంటివి. రెండవది తల్లి శారీరక, మానసిక పరిస్థితి, అదుపులో లేని బీపీ, షుగర్, ఇంకా ఇతర మెడికల్‌ కాంప్లికేషన్స్‌ ఏమైనా ఉన్నాయా? బిడ్డ బయటకు వచ్చే దారి పెల్విస్‌ ఎలా ఉంది? వంటి అంశాలు. మూడవది కాన్పు సమయంలో నొప్పులు ఎలా ఉంటాయి? వాటికి గర్భాశయ ద్వారం ఎలా తెరుచుకుంటుంది, బిడ్డ తల దిగుతుందా లేదా, నొప్పుల వల్ల బిడ్డ మీద భారం పడి గుండె కొట్టుకోవడం తగ్గిపోవడం, ఆయాసపడి బిడ్డ తల్లి గర్భంలోనే మలవిసర్జన చేసి, అది మింగేయడం, దానివల్ల ప్రాణాపాయ స్థితి వంటి ఎన్నో అంశాలను పరిశీలించవలసి ఉంటుంది. మొదటి రెండు అంశాలను కాన్పుకి ముందు అంచనా వేయవచ్చు.

కానీ, మూడో అంశం మాత్రం కాన్పు నొప్పులు మొదలయిన తర్వాతనే తెలుస్తుంది. మీకు మొదటిది సిజేరియన్‌. ఇందులో గర్భాశయం మీద గాటు పెట్టి బిడ్డను బయటకు తీసి మళ్లీ కుట్లు వేయడం జరుగుతుంది. మళ్లీ గర్భం దాల్చి, బిడ్డ పెరిగే కొలదీ గర్భాశయం కూడా సాగడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇంతకుముందు ఆపరేషన్‌ చేసిన కుట్ల దగ్గర పలుచబడడం జరుగుతుంది. సాధారణ కాన్పుకి ప్రయత్నం చేసేటప్పుడు, కాన్పు నొప్పులు మొదలయినప్పుడు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, ముందు కుట్లు సాగే తీరును బట్టి, వాటి పటిష్టతను బట్టి, కొందరిలో పలుచబడిన కుట్లు పగిలిపోయి గర్భసంచి తెరుచుకుని బిడ్డ కడుపులోకి వచ్చి రక్తసరఫరా ఆగిపోయి బిడ్డ చనిపోవటం, కుట్లు పగిలి తల్లిలో విపరీతమైన రక్తస్రావం జరిగి ప్రాణాంతకం అయ్యే పరిస్థితులు ఉండవచ్చు.

కొందరిలో అంతా సజావుగానే జరిగి సాధారణ కాన్పు జరగవచ్చు. కానీ, ఎవరికి ఎలా జరుగుతుంది అనేది ముందుగానే ఊహించి చెప్పడం కష్టం. ఆపరేషన్‌ తర్వాత కాన్పుకి కాన్పుకి కనీసం మూడు సంవత్సరాలైనా గ్యాప్‌ ఉండి, మొదటి రెండు అంశాలు అంటే బిడ్డ మరీ ఎక్కువ బరువు లేకుండా ఉండి, తల కిందకు ఉండి, ఉమ్మనీరు సరిపడా ఉండి, పెల్విస్‌ వెడల్పుగా ఉండి, బిడ్డ బయటకు వచ్చేందుకు అనువుగా ఉంటే, అప్పుడు డాక్టరు పైన చెప్పిన ప్రమాదాల గురించి వివరించి, మీరు ఆ రిస్కులను తీసుకునేందుకు అంగీకరిస్తే అప్పుడు సాధారణ కాన్పుకి నొప్పులు వాటంతట అవి వచ్చేవరకు ఆగి ప్రయత్నం చెయ్యడం జరుగుతుంది. దీనినే వీబీఏసీ (వజైనల్‌ బర్త్‌ ఆఫ్టర్‌ సిజేరియన్‌) అంటారు.

కానీ, ఈ ప్రయత్నం 24 గంటలూ గైనకాలజిస్టులు, మత్తు డాక్టర్లు, పిల్లల డాక్టర్లు ఉండే, అన్ని వసతులూ కలిగి ఉన్న హాస్పిటల్‌లోనే చెయ్యటం మంచిది. దీనివల్ల ఉన్నట్లుండి కుట్లు పగిలేటట్లు ఉన్నాయి లేదా పగిలిపోయాయి అనగానే నిమిషాలలో ఆపరేషన్‌ చేసి, బిడ్డను బయటకు తీసి ఇద్దరినీ కాపాడే ప్రయత్నం చేయవచ్చు. కొన్నిసార్లు ఎన్ని చేసినా బిడ్డను కాపాడలేకపోవచ్చు. తల్లిలో రక్తస్రావం అధికమయ్యి ప్రాణాపాయస్థితికి చేరవచ్చు. మీకు మొదటి బిడ్డ ఎదురుకాళ్లతో(బ్రీచ్‌ పొజిషన్‌) ఉంది. ఇప్పుడు ఏడో నెలనే. కాన్పు సమయానికి ఏ పొజిషన్‌లో ఉంటుందో ఎదురుచూడవలసి ఉంటుంది. కాకపోతే మీకు ముందు సిజేరియన్‌ అయ్యి రెండు సంవత్సరాలే అవుతోంది. కాబట్టి ఒకసారి మీ కండిషన్‌ తెలిసిన గైనకాలజిస్ట్‌తో డిస్కస్‌ చేసి చూడండి. మామూలుగా అయితే రెండోది సిజేరియన్‌ ఆపరేషన్‌ అయితే, ఆపరేషన్‌ చేసి బిడ్డను తీసిన తర్వాత పిల్లల డాక్టర్‌ బిడ్డను 5 నిమిషాలు పరీక్ష చేసి, ఆ సమయంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని చూసి, ఎలా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. బాగుంది అంటే సిజేరియన్‌ సమయంలోనే పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్‌ కూడా చేసుకోవచ్చు.

కాకపోతే అప్పుడే పుట్టిన పిల్లల్లో వందలో ఒక్కరికో ఇద్దరికో కొన్ని ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వెంటనే బయటపడకపోవచ్చు. పుట్టిన వెంటనే బాగానే ఉన్నా కొన్ని గంటల తర్వాత లేదా కొన్ని రోజులు, నెలల తర్వాత కొన్ని తీవ్రమైన సమస్యలు బయటపడి, అవి ప్రాణాంతకమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని, ప్రస్తుత కాలంలో అందరికీ 6 నెలల తర్వాత, బిడ్డ పెరిగి అంతా బాగుంటే అప్పుడు ట్యూబెక్టమీ ఆపరేషన్‌ చెయ్యించుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇది ల్యాపరోస్కోపీ ద్వారా చెయ్యించుకోవచ్చు. లేదు ఎలాగైనా సిజేరియన్‌లోనే చేసేయ్యండి అని సంతకం పెడితే అందులోనే ట్యూబెక్టమీ ఆపరేషన్‌ కూడా చెయ్యడం జరుగుతుంది. 
- డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top