Beauty Tips In Telugu: Amazing Benefits Of Raw Onion Juice For Face And Hair - Sakshi
Sakshi News home page

Beauty Tips In Telugu: ఉల్లిపాయతో ఈ బ్యూటీ టిప్స్‌ ఎప్పుడైనా ట్రైశారా?

Published Mon, Apr 11 2022 10:48 AM

Benefits and Beauty of raw Onion juice - Sakshi

ఉల్లిపాయతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు. అద్భుతమైన సౌందర్య పోషకంగా  పనిచేస్తుంది. ఉల్లిపాయ ద్వారా కూరకు ఎంత టేస్ట్‌ వస్తుందో..  మీ జుట్టుకు కూడా అంతే మేలు చేస్తుంది. ఇమ్యూనిటీతోపాటు బ్యూటీకి చక్కగా ఉపయోగపడే ఉల్లిపాయ మంత్రా గురించే తెలిస్తే మీరస్సలు వదిలిపెట్టరు.  మొటిమలు, హెయిర్‌ ఫాల్‌ బాధను ఇట్టే మాయం చేస్తుంది. ఏజింగ్‌ ప్రాబ్లమ్స్‌కు చెక్‌ పెడుతుంది.


ఉల్లి చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వంటకాల్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్‌గా పనిచేయడమే కాదు ఉల్లి లాభాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పట్టుకుచ్చు లాంటి జుట్టు కావాలన్నా, ముఖంపై  మొటిమలు, మచ్చలు పోవాలన్నా ఉల్లి దివ్యౌధంలా పనిచేస్తుంది. ఉల్లిలోని పీచు పదార్థం, ఫ్లేవ నాయిడ్లు, క్వెర్సెటిన్‌ కారణంగా జీర్ణ క్రియకు అద్భుతమైన టానిక్‌గా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం చర్మాన్ని మృదువుగా చేస్తుంది. దీని వల్ల మొటిమలు, చర్మసంబంధ ఇన్పెక్షన్లు తగ్గుతాయి. 

జుట్టు సంబంధిత సమస్యల ఉపశమనానికి ఉల్లిలోని పోషకాలు బాగా ఉపయోగపడతాయి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అలోవోరా కలిపి కొబ్బరి నూనెలో మరిగించాలి.  దీన్ని గోరువెచ్చగా మాడుకు మర్దనా చేసుకోవాలి. అరగంట తర్వాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేస్తే, హెయిర్‌ఫాల్‌ తగ్గుతుంది. ఉల్లిలో ఉండే కొల్లాజెన్ , సల్ఫర్‌ మూలకం తలభాగంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా తలలో మూసుకుపోయిన రంధ్రాలు తిరిగి తెరుచుకుని జుట్టు బలంగా ఎదుగుతుంది.

యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న ఉల్లిపాయను తరుచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మసంబంధ ఇన్పెక్షన్లు తగ్గుతాయట. చర్మంపై పగుళ్లను కూడా నివారిస్తుంది. ఉల్లిపాయల్లోని సల్ఫర్-రిచ్ ఫైటోకెమికల్స్  ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి వృద్ధాప్య లక్షణాలను నిరోధిస్తుంది.  నిమ్మరసం, పెరుగు  కానీ  కలిపిన ఉల్లిపాయ రసాన్ని  రోజూ చర్మంపై అప్లై చేస్తే  యంగ్‌ అండ్‌ ఎనర్జటిక్‌గా కనిపించొచ్చన్నమాట. 

ఇక పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయను భోజనంలో కలిపి తీసుకుంటే చాలా మంచిదని  డైటీషియన్లు చెబుతున్నారు. ఉల్లిపాయలో లభించే క్వెర్సెటిన్ అలెర్జీ తగ్గించడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుందట. ఉల్లిపాయల్లో ఉండే సి.బి, పొటాషియం రక్తపోటు సమస్యను పరిష్కరిస్తాయి.

ఉల్లిపాయలు యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తాయని, షుగర్ పేషెంట్లలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయని చాలా అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా  వేసవి తాపాన్ని ఎదుర్కోవడానికి ఉల్లిపాయ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వడదెబ్బ తగులకుండా సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.  కాలిన గాయాలకు ఉల్లిపాయ రసం మంచి ఉపశమనం.

మరీ ముఖ్యంగా ఎర్ర ఉల్లిపాయలు చాలా శ్రేష్టమైనవని ఆహార నిపుణులు చెబుతున్నారు. 25 రకాల ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతమైన మూలమని పరిశోధకులు  స్పష్టం చేశారు. ఎర్ర ఉల్లిపాయల రంగుకు కారణమైన ఆంథోసైనిన్‌లు గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్‌, మధుమేహం నుంచి కాపాడుతుందని డైటీషియన్లు  చెబుతున్న మాట.
 

Advertisement
Advertisement