Zara Rutherford: గాలిలో తేలినట్టుందే..!

Belgian-British woman Zara Rutherford aims to set aviation record - Sakshi

నీటిమీద, నేల మీద ప్రపంచాన్ని చుట్టి రికార్డులు సృష్టించినవాళ్లు చాలామందే ఉన్నారు. వీరందరికీ భిన్నంగా ఓ 19 ఏళ్ల అమ్మాయి గాల్లో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని చుట్టి సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. బెల్జియన్‌ బ్రిటిష్‌ సంతతికి చెందిన జరా రూథర్‌ఫర్డ్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ‘బెస్పోక్‌ షార్క్‌ ఆల్ట్రాలైట్‌ ’ విమానంలో ప్రపంచాన్ని చుట్టేయనుంది. ఆగస్టు పదకొండున బ్రసెల్స్‌లో ప్రారంభమయ్యే జరా ప్రపంచ యాత్ర మూడు నెలలు కొనసాగి యూరప్‌ లో ముగుస్తుంది.

52 దేశాలను చుట్టే క్రమంలో 51 వేల కిలోమీటర్లు ప్రయాణించనుంది. జరా తల్లిదండ్రులు ఇద్దరు పైలట్లు కావడంతో 14 ఏళ్ల వయసునుంచే విమానం నడపడం నేర్చుకుంది. పద్దెనిమిదో ఏట విమానం నడిపే  లైసెన్స్‌ తీసుకుంది. జరా యాత్ర సవ్యంగా సాగితే  ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి అతిపిన్న వయస్కురాలిగా నిలవనుంది. ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన షెస్తావాయి (2017) పేరుమీద రికార్డు ఉండగా, పురుషుల విభాగంలో 18 ఏళ్ల అతిపిన్న వయస్కుడి మీద మరో రికార్డు ఉంది.

‘‘అమ్మ కాస్త వెనక్కు లాగినప్పటికీ, నాన్న మాత్రం ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సాహంతోనే ఈరోజు యాత్రకు సిద్ధమయ్యాను. నా యాత్ర విజయవంతమైన తరువాత స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్‌) చదువుతోన్న చాలామంది అమ్మాయిలు ప్రేరణ పొంది ఏవియేషన్‌ రంగంలోకి వస్తారు. ఈ విభాగంలో పురుషులకు, మహిళలకు మధ్య చాలా తేడా ఉంది. అందుకే నేను రికార్డు నెలకొల్పి ఏవియేషన్‌లో అమ్మాయిలు కూడా రాణించగలరని నిరూపిస్తాను’’ అని జరా చెప్పింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top