Beauty Tips: ముఖంపై మంగు మచ్చలు ఉంటే.. పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి..

Beauty Tips In Telugu: Hyperpigmentation Mangu Machalu Home Remedies - Sakshi

కొంతమంది ఎత్తుకు తగిన బరువుతో ఆకర్షణీయమైన పర్సనాలిటీతో ఉంటారు. తీరా ముఖం దగ్గరికొచ్చేసరికి మచ్చలు కనిపించి ఉస్సురనిపిస్తాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే ఈ నల్లటి మచ్చలనే మంగు మచ్చలంటారు. ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుంచి ముక్కు వరకూ వ్యాపిస్తాయి. ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు వెనుకభాగంలో కూడా ఏర్పడే అవకాశం ఉంది.

ఇదేమీ వ్యాధి కాదు కానీ, ఇలా మచ్చలు ఉన్న వారు ఆత్మన్యూనతతో పదిమందిలోకీ వెళ్లడానికి ఇబ్బంది పడతారు. అసలు ఇలాంటి మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వాటిని నివారించవచ్చు. తొలిదశలోనే ఉన్న వాటిని చిన్న చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చు. 

శరీరతత్వాన్ని బట్టి ముఖంపై మొటిమలు, పులిపిర్లు, పెద్ద పరిమాణంలో ఉండే పుట్టుమచ్చలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు మొదలైనవి ఏర్పడుతుంటాయి. వీటిలో కొన్ని వంశపారంపర్యంగా వస్తే, మరికొన్ని హార్మోన్లలో సమతుల్యత లోపించడం వల్ల కూడా రావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే మచ్చలను నివారించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. 

ఈ చిట్కాలతో ముఖంపై మంగు మచ్చలు మాయం!
తాజా వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే క్రమేణా పలచబడి కొంతకాలానికి చర్మం రంగులో కలిసిపోతాయి. 
పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి పాలల్లో కలిపి రాస్తుంటే మంగు మచ్చలు, చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి.
జాజికాయను పాలలో అరగదీసి రాయడం వల్ల గుణం కనిపిస్తుంది.
పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది.
 పావు టీ స్పూన్‌ నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
టొమాటోను రెండు ముక్కలుగా తరిగి, ఆ ముక్కలతో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గడంతోపాటు ముఖ వర్చస్సు పెరుగుతుంది.

అలోవెరా పేస్టును మచ్చలపై పూయాలి. ఆ మచ్చతడి ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి.
టీ స్పూన్‌ టొమాటో రసం, టీ స్పూన్‌ గంధం పొడి, రెండు టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

రోజ్‌ వాటర్, కీరా రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెల రోజులు గడిచేసరికి మంచి మార్పు వస్తుంది.
బంగాళదుంప చెక్కు తీసి, సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి, రసం తీయాలి. దానిలో దూది ఉండలని ముంచి, వాటితో మచ్చలపై అద్దాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి.  

అన్నింటికన్నా ముఖ్యమైనది ఆత్మన్యూనతకు గురికాకుండా ఉండటం. ఆత్మన్యూనత వల్ల, బిడియం వల్ల పదిమందిలో కలవలేకపోవడం, కలిసినా, ముఖాన్ని చేతులతో కవర్‌ చేసుకోవడం వంటి వాటి వల్ల అందరి దృష్టి పడుతుంది.  ఆత్మవిశ్వాసంతో ఉండి చక్కగా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటే ఏ మచ్చలూ మన అందాన్ని మసక బార్చలేవు.  

చదవండి👉🏾 Sugarcane Juice: చెరుకు రసం తరచుగా తాగుతున్నారా.. అయితే

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top