Matilda Kullu Story: ‘ఫోర్బ్స్‌’ లిస్ట్‌లో ఆశా వర్కర్‌.. ఎందుకంటే..?

ASHA worker from Odisha features in Forbes India W-Power 2021 list - Sakshi

‘ఫోర్బ్స్‌’ లిస్ట్‌లో ఆశా వర్కర్‌ – మెటిల్డా కుల్లు

Who Is Matilda Kullu: శక్తిమంతమైన మహిళ అంటే కార్పొరేట్‌ సి.ఇ.ఓ... పెద్ద రాజకీయ నాయకురాలు.. గొప్ప కళాకారిణి... లేదా ఏ ఒలింపిక్స్‌ క్రీడాకారిణో అయి ఉండవచ్చు. కాని ఫోర్బ్స్‌ పత్రిక తాజా భారతీయ శక్తిమంతమైన మహిళల్లో ఒక ఆశా వర్కర్‌ చేరింది. అదీ వెనుకబడిన ఒడిస్సా రాష్ట్రం నుంచి. ఆమె పేరు మెటిల్డా కుల్లు. హేమాహేమీల మధ్య ఇలా ఆశావర్కర్‌కు చోటు దొరకడం ఇదే ప్రథమం. ఏమిటి ఆమె ఘనత? కోవిడ్‌ వాక్సినేషన్‌ కోసం ఆమె ఏమి చేసింది?

సూదిమందుకు కులం ఉంటుందా?
ఉంటుంది... కొన్నిచోట్ల... ఆ సూది వేసే చేతులు బహుశా షెడ్యూల్డ్‌ తెగవి అయితే. అందునా చిన్న ఉద్యోగంలో ఉంటే. ఆశా వర్కర్‌ అంటే నెలకు 4,500 రూపాయల జీతం. గడప గడపకు తిరిగే ఉద్యోగం. అంత చిన్న ఉద్యోగి, స్త్రీ, పైగా షెడ్యూల్డ్‌ తెగ... తరతరాలుగా వెనుగబడిన ఆలోచనలు ఉన్న ఊళ్లలో, అంటరానితనం పాటించడం వదులుకోని ఇళ్లల్లో ఎంత కష్టం. పైగా ఆ ఊళ్లో చాలామంది మూఢ విశ్వాసాలతో, జబ్బు చేస్తే బాణామతిని నమ్ముకునే అంధకారంలో ఉంటే వారిని ఆస్పత్రి వరకూ నడిపించడం ఎంత కష్టం.

ఈ కష్టం అంతా పడింది మెటిల్డా కుల్లు. అందుకే ఫోర్బ్స్‌ పత్రిక ‘ఫోర్బ్స్‌ ఇండియా విమెన్‌ పవర్‌ 2021’ పట్టికలోని మొత్తం 20 మంది భారతీయ మహిళలలో కుల్లుకు 3వ స్థానం ఇచ్చింది. ఆమెకు ముందు బ్యాంకర్‌ అరుంధతి భట్టాచార్య ఉంది. ఆమె తర్వాత క్రీడాకారిణి అవని లేఖరా, నటి సాన్యా మల్హోత్రా, కాస్మోటిక్స్‌ దిగ్గజం వినీతా సింగ్‌ తదితరులు ఉన్నారు. వీరందరి మధ్య ఒక చిరు ఉద్యోగి చేరడం సామాన్య ఘనత కాదు. ఇలా ఒక ఆశా వర్కర్‌ కనిపించడం ఇదే ప్రథమం. ఆ మేరకు భారతదేశంలో ఉన్న ఆశా వర్కర్లందరికీ  గౌరవం దక్కిందని భావించాలి.

ఎవరు మెటిల్డా కుల్లు?
45 ఏళ్ల మెటిల్డా కుల్లు ఒడిసాలోని సుందర్‌ఘర్‌ జిల్లాలో గార్దభహల్‌ అనే పల్లెకు ఏకైక ఆశా వర్కర్‌. గార్దభహల్‌లోని 964 మంది గ్రామీణులకు ఆమె ఆరోగ్య కార్యకర్త. 15 ఏళ్ల క్రితం ఆమె ఈ ఉద్యోగంలో చేరింది. అయితే ఒడిసా పల్లెల్లో ఆశా వర్కర్‌గా పని చేయడం సులభం కాదు. ‘జ్వరం వస్తే ఆస్పత్రికి వెళ్లాలి అని నేను చెప్తే నన్ను చూసి గ్రామీణులు నవ్వే వారు. ఏదైనా గట్టి రోగం వస్తే బాణామతికి ఆశ్రయించడం వారికి అలవాటు. కాన్పులు ఇళ్లల్లోనే జరిగిపోవాలని కోరుకుంటారు. పైగా నేను షెడ్యూల్డ్‌ తెగకు చెందిన మహిళను కావడం వల్ల ఇళ్లల్లోకి రాకపోకలకు కొందరు అంగీకరించే వారు కాదు. నన్ను ఏమన్నా ఎంత అవమానించినా వారి ఆరోగ్యం నాకు ముఖ్యం. నేను వారికి చెప్పీ చెప్పీ మార్పు తేవడానికి ప్రయత్నించేదాన్ని’ అంటుంది మెటిల్డా కుల్లు.

ఉదయం 5 గంటల నుంచి
మెటిల్డా దినచర్య రోజూ ఉదయం ఐదు గంటల నుంచి మొదలవుతుంది. ఇల్లు చిమ్ముకుని, పశువులకు గడ్డి వేసి, భర్త.. ఇద్దరు పిల్లలకు వంట చేసి సైకిల్‌ మీద ఊళ్లోకి బయలుదేరుతుందామె. గర్భిణులను, బాలింతలను, పసికందుల ఆరోగ్యాన్ని ఆమె ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి సూచనలు, సలహాలు మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈడేరిన అమ్మాయిలు ఎటువంటి శుభ్రత పాటించాలో చెప్పడం మరో ముఖ్యమైన పని. ఇక ఆ పల్లెల్లో చాలామందికి గర్భకుహర ఇన్ఫెక్షన్లు సహజం. దానికి తోడు లైంగిక వ్యాధుల బెడద కూడా. వీటన్నింటినీ ఆమె ఓపికగా చూస్తూ గ్రామీణులను ఆస్పత్రులకు చేర్చి వారికి నయమయ్యేలా చూసేది.

కోవిడ్‌ టైమ్‌లో వారియర్‌
కోవిడ్‌ మొదటి వేవ్‌ కంటే రెండో వేవ్‌లో దేశంలో అన్ని చోట్లకు మల్లే ఒడిసాలో కూడా విజృంభించాయి. ఆ రాష్ట్రంలో ఉన్న దాదాపు 47 వేల మంది ఆశా వర్కర్ల మీద ఒత్తిడి పడ్డట్టే మెటిల్డా మీద కూడా పడింది. ‘కోవిడ్‌ సమయంలో నా దినచర్య ఇంకా కష్టమైంది. రోజుకు 40, 50 ఇళ్లు తిరుగుతూ కోవిడ్‌ సింప్టమ్స్‌ ఎవరికైనా ఉన్నాయా లేవా అని చూడటం నా పని. ఊళ్లో కోవిడ్‌ వ్యాపించకుండా నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను. ఆశా వర్కర్లకు పిపిఇ కిట్లు అందింది లేదు. అయినా సరే ఇళ్లల్లోకి వెళ్లి సింప్టమ్స్‌ ఉన్నవారికి బిళ్లలు ఇచ్చేదాన్ని. గ్రామీణులతో సమస్య ఏమిటంటే వారు టెస్ట్‌లకు రారు. హాస్పిటల్‌కు వెళ్లరు. కాని ఇన్నేళ్లుగా నేను సంపాదించుకున్న నమ్మకం వల్ల వారు తొందరగా స్పందించారు. వాక్సినేషన్‌కు అంగీకరించారు. అందరికీ దాదాపుగా వాక్సిన్‌ నేనే వేశాను. ఆ విధంగా ఊళ్లో కోవిడ్‌ను అదుపు చేయగలిగాం’ అంటుంది మెటిల్డా కుల్లు.

అయితే ఇంత ప్రాణాలకు తెగించి పని చేసినా ఒక్కసారి ప్రభుత్వం అదనంగా వేసిన 2000 రూపాయల ఇంటెన్సివ్‌ తప్ప వేరే మేలు ఏమీ జరగలేదు. ఇప్పటికీ ఆమె పాత జీతానికే పని చేస్తోంది. ఆ కొద్దిపాటి డబ్బు కోసం అంత పని చేయడానికి ఎంత శక్తి కావాలి, ధైర్యం కావాలి, అంకితభావం కావాలి.

అందుకే ఫోర్బ్స్‌ ఆమె శక్తివంతమైన మహిళ అంది.

సమాజం కోసం పని చేసే శక్తిని అందరూ ప్రదర్శించరు. ప్రదర్శించిన వారు ఇలా ప్రశంసను పొందుతారు. ప్రశంసకు యోగ్యమైన జీవితం కదా అందరూ కొద్దో గొప్పో గడపాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top