షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌: దానానికి దగ్గరి దారి Anushka Jain is the founder of Share at Door Step a sustainability-tech platform | Sakshi
Sakshi News home page

షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌: దానానికి దగ్గరి దారి

Published Tue, Mar 5 2024 3:57 AM

Anushka Jain is the founder of Share at Door Step a sustainability-tech platform - Sakshi

సేవాపథం

దానాలు, విరాళాల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌’ అనే సోషల్‌ వెంచర్‌కు శ్రీకారం చుట్టింది దిల్లీకి  చెందిన అనుష్క జైన్‌. దాతల ఇంటికి వెళ్లి వారు ఇచ్చే దుస్తులు, పుస్తకాలు... మొదలైన వాటిని తీసుకొని ఎన్జీవోలకు పంపిణీ చేస్తుంది షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌. ఏఐ టెక్నాలజీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలతో కనెక్ట్‌ అవుతోంది....

‘ప్రతిరోజు పిల్లల బట్టలు, యూనిఫాంను చేతితో ఉతికేదాన్ని. షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌ ద్వారా వాషింగ్‌ మెషిన్‌ అందిన తరువాత నాకు చాలా శ్రమ తప్పింది. ఎంతో టైమ్‌ మిగులుతోంది. ఈ టైమ్‌లో పిల్లలకు కథలు చెబుతున్నాను’ అంటోంది బెంగళూరుకు చెందిన ఒక బామ్మ. బెంగుళూరు నుంచి జైపూర్‌ వరకు ‘షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌’ను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు.
దిల్లీకి చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీర్‌ అయిన అనుష్కకు ‘షేరింగ్‌’ కాన్సెప్ట్‌ కొత్త కాదు. గతంలోకి వెళితే...

తన ప్రతి పుట్టినరోజుకి ‘ఇవి కావాలి అవి కావాలి’ అని కాకుండా ‘ఈరోజు ఏ ఎన్జీవోకు వెళదాం’ అని తల్లిని అడిగేది. నగరంలో ఉన్న ఏదో ఒక ఎన్జీవోకు వెళ్లి అక్కడ ఉన్నవారికి స్వీట్లు పంచేది. అలా ‘షేరింగ్‌’ అనే కాన్సెప్ట్‌ తనతోపాటు పెరిగి పెద్దదైంది. దాతృత్వానికి సంబంధించి కాలేజీ రోజుల్లో తనకు స్పష్టత వచ్చింది. చాలామందికి దానం చేయాలనే కోరిక ఉన్నా, సమయం లేకపోవడం వల్ల దూరభారం వల్ల చేయలేకపోతున్నారు.

‘డొనేషన్‌ ఏ స్వచ్ఛంద సంస్థకు ఇస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది;’ అనే విషయంలో చాలామందికి అవగాహన ఉండదు’ అంటున్న అనుష్క ఈ సమస్యకు ఒక పరిష్కారం వెదకాలనుకుంది. తన డ్రీమ్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరిన అనుష్క నైట్‌షిఫ్ట్‌లో డ్యూటీ చేసేది. పగటిపూట సేవాకార్యక్రమాలపై దృష్టి పెట్టేది.

ఉద్యోగంలో చేరినా ఎన్జీవోలకు డొనేట్‌ చేయాలనే ఆలోచన అనుష్కను వదలలేదు. దీంతో ఒక వెబ్‌సైట్‌ రూపొందించి డొనేట్‌ చేయాలనుకుంటున్నవారు తమ ఐటమ్స్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలని కోరింది. రిజిస్టర్‌ కాగానే పొద్దున్నే వెళ్లి వాటిని కలెక్ట్‌ చేసుకొని వచ్చేది. పికప్స్‌ రెండు వందలు దాటిన తరువాత ‘ఇంకా ఏదైనా చేయాలి’ అనే ఆలోచనతో బెంగళూరులోకి అడుగుపెట్టింది అనుష్క. అక్కడ మరో కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది. 2018లో ‘షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌’కు పూర్తి సమయాన్ని కేటాయించింది.

 ‘ఇంకా ఏదైనా చేయాలి’ అనే ఆలోచనతో బెంగళూరులోకి అడుగుపెట్టింది అనుష్క. 2018లో ‘షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌’కు పూర్తి సమయాన్ని కేటాయించింది. ‘మా వెబ్‌సైట్‌లోకి వచ్చి పికప్‌ బుక్‌ చేయండి. మీరు విరాళంగా ఇవ్వాలనుకుంటున్న వస్తువు, అది తేలికైనదా, బరువైనదా అనేది తెలియజేయండి. మా ఏజెంట్లు నిర్ణీత సమయంలో మీ ఇంటి ముందు ఉంటారు. మీ విరాళాన్ని మాకు అనుబంధంగా ఉన్న ఎన్జీవోలలో ఒకదానికి పంపిస్తాం’ అంటూ అనుష్క చేసిన ప్రకటనకు అద్భుత స్పందన వచ్చింది.

ఏ వస్తువులు ఏ ఎన్జీవోకు వెళ్లాలి... అనే విషయంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాంకేతికత సహాయం తీసుకుంటుంది అనుష్క.
‘షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌’ ద్వారా కంపెనీలకు మార్కెటింగ్‌ సొల్యూషన్స్‌ను అందించడంతో పాటు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌)కు సంబంధించిన కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది.

ఇండివిడ్యువల్స్‌తో పాటు కార్పొరేట్‌ డోనర్స్‌ కోసం డోర్‌స్టెప్‌ డొనేషన్‌ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌’ దేశీయంగా తిరుగులేని విజయం సాధించిన తరువాత ఈ కాన్సెప్ట్‌ను విదేశాలలో ప్రచారం చేయాలని ఆలోచన చేసింది. తొలి అడుగుగా సింగపూర్‌లో ప్రచారం చేసింది. అక్కడ లభించిన స్పందన అమితమైన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో మరింత వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది అనుష్క.

ఎంతో శక్తి ఇస్తుంది
దానం చేయడానికి అవసరమైన స్ఫూర్తిæ ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉండవచ్చు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే ఉన్నత ఆలోచన మాత్రం దేశాల సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒకటి చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడం అనే పని మనకు ఎంతో శక్తి ఇస్తుంది.
– అనుష్క జైన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement