కరోనాతో కొత్తముప్పు ! | Sakshi
Sakshi News home page

కరోనాతో కొత్తముప్పు !

Published Tue, Oct 20 2020 9:25 AM

Another Threat Is Posed By Corona Virus - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో రోజుకో కొత్త సమస్యలు వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకూ కరోనాతో పలువురిలో మధుమేహం స్థాయిలు పెరగడంతో పాటు, లంగ్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు గురవడం, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. తాజాగా కరోనాకు గురైన వారిలో కొందరిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌లకు గురవుతున్నట్లు వెల్లడైంది. ఆస్పత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన రోగుల్లో 7 నుంచి 8 శాతం మంది రోగులు నాలుగు నుంచి ఆరు వారాల్లో గుండె పోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వెంటిలేటర్‌ దాకా వెళ్లొచ్చిన రోగుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. దీంతో కరోనా తగ్గినా మూడు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.   

ప్రతి ఒక్కరికీ గుండె పరీక్షలు... 
కరోనాతో కోవిడ్‌ స్టేట్‌ ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ గుండె పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా సివియర్‌ కండీషన్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. కోవిడ్‌ రోగుల్లో గుండె సమస్యలను గుర్తించడంతో ఇటీవల కోవిడ్‌ స్టేట్‌ ఆస్పత్రిలో గుండె వైద్య విభాగాన్ని సైతం ఆఘమేఘాలపై ప్రారంభించారు. ఆ విభాగంలో ప్రతి రోగికి ఈసీజీ, ఎకో కార్డియాలజీ పరీక్ష చేస్తున్నారు. అవసరమైతే యాంజియోగ్రామ్‌ నిర్వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు కరోనా రోగులకు గుండె వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తున్నారు.  (ఫిబ్రవరికల్లా సగం జనాభాకు కరోనా!)

వెలుగు చూస్తున్న సమస్యలివే... 
కరోనాతో చికిత్స పొందుతున్న రోగులు కొందరు పల్మనరీ ఎంబోలిజయ్‌(ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం)కు ఎక్కువుగా గురవుతున్నారు. కరోనా మరణాల్లో ఎక్కువ మందిలో ఇదే కారణంగా చెపుతున్నారు. కొందరిలో గుండె రక్తనాళాల్లో, మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి, పూడికలు రావడం, కాళ్ల రక్తనాళాల్లో సైతం గడ్డలు ఏర్పడి రక్తప్రసరణ తగ్గుతున్న వారిని గుర్తిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 2 నుంచి 3 శాతం మందిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి మరణాలు సంభవిస్తుండగా, డిశ్చార్జి అయిన వారిలో 7 నుంచి 8 శాతం మందిలో గుండె, మెదడు సమస్యలు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.   

తీసుకోవాల్సిన జాగ్రత్తలు... 
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఖచ్చితంగా మూడు నెలల పాటు యాంటి కో ఆగ్యులేషన్‌ మందులు వాడాలి. అలా వాడిన వారిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడిన సందర్భాలు లేవు.  
ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌కు స్టెరాయిడ్స్‌ వాడిన వారు, ఆ తర్వాత ఫాలోఅప్‌ మందులు కూడా వాడాలి.  
యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.  
పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి.  
తరచూ రక్తంలో ఆక్సిజన్‌శాతాన్ని పరీక్షించుకోవాలి. ఏ మా త్రం తగ్గినట్లు గుర్తించినా వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి.

రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి 
కోవిడ్‌ సివియర్‌ స్టేజ్‌కు వెళ్లిన కొందరిలో యాంజియోగ్రామ్‌ చేసినప్పుడు రక్తంలో విపరీతమైన గడ్డలు ఏర్పడటం గుర్తిస్తున్నాం. గుండె రక్తనాళాలతో పాటు, మెదడు, కాళ్ల రక్తనాళాల్లో కూడా గడ్డలు ఉంటున్నాయి. ఒక వ్యక్తి పదిరోజుల పాటు మంచంపైనే పడుకుంటే సాధారణంగా పల్మనరీ ఎంబోలిజమ్‌కు గురయ్యే అవకాశం ఉంది. అలాంటిది ఐసీయూలో కదలకుండా రోజుల తరబడి ఉంటున్న వారికి పల్మనరీ ఎంబోలియజ్, కరోనాతో ఏర్పడే గడ్డలతో ప్రాణాపాయం ఏర్పడుతుంది. అలాంటి వారికి యాంటి కో ఆగ్యులేషన్‌ థెరపీ అందిస్తారు. కరోనా చికిత్స పొందిన వారిలో పదిహేను ఇరవై రోజుల్లో కొందరిలో, నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో మరికొందరిలో గుండె సమస్యలు, గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురవుతున్న వారిని గుర్తిస్తున్నాం. విజయవాడ కోవిడ్‌ ఆస్పత్రిలో ఈసమస్యలకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నాం.
– డాక్టర్‌ విజయ్‌ చైతన్య, కార్డియాలజిస్ట్‌   

Advertisement
 
Advertisement
 
Advertisement