
జైపూర్: కజకిస్తాన్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న రాజస్థాన్‌కు చెందిన రాహుల్ ఘోసల్యా(22) బ్రెయిన్ స్ట్రోక్‌కు లోనై, ప్రాణాలతో పోరాడుతున్నాడు. వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్న అతనిని, మరింత మెరుగైన వైద్యం కోసం రాజస్థాన్‌లోని జైపూర్‌నకు తరలించారు.
వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం జైపూర్ జిల్లాలోని షాపురాకు చెందిన రాహుల్ ఘోసల్యా 2021 నుండి కజకిస్తాన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అక్టోబర్ 8న బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన అతను చాలా రోజులుగా కజకిస్తాన్‌లోని ఒక ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నాడు. తాజాగా రాహుల్ ఘోసల్యాను ఎయిర్ అంబులెన్స్‌లో జైపూర్‌కు తరలించి, అక్కడి సవాయి మాన్ సింగ్ (ఎస్‌ఎంఎస్)ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ వైద్యులు, జిల్లా అధికారుల బృందం పర్యవేక్షణలో బాధితుడిని ఎస్‌ఎంఎస్ ఆస్పత్రిలో చేర్చించారు. ప్రస్తుతం రాహుల్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ దీపక్ మహేశ్వరి నేతృత్వంలోని వైద్యబృందం రాహుల్‌కు ప్రత్యేక చికిత్స అందిస్తోంది.
రాహుల్ ఆరోగ్య సంరక్షణకు నలుగురు సభ్యుల వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. విమానాశ్రయం నుండి ఆస్పత్రికి రాహుల్‌ను తరలించేందుకు ఒక ప్రత్యేక క్రిటికల్ కేర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దీనికి ముందు రాహుల్ కుటుంబం ఈ విషయమై సోషల్ మీడియా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. అతనికి అధునాతన వైద్య సంరక్షణ అందించేందుకు భారత్ తీసుకురావాలని అభ్యర్థించింది. ఈ నేపధ్యంలో పలు సామాజిక సంస్థలు రాహుల్ కుటుంబానికి మద్దతునిచ్చాయి. రాహుల్‌ను భారత్‌కు తీసుకురావడంలో సహకారాన్ని అందించాయి.