ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
దృష్టి–పూతం న్యసేత్పాదం వస్త్ర–పూతం జలం పిబేత్‘/సత్య–పూతం వదేద్వాచం మనః–పూతం సమాచరేత్‘‘ కంటితో పరిశీలించి అడుగు వేయాలి, వడపోసిన నీరు త్రాగాలి. సత్యంలో వడగట్టిన మాటను పలకాలి. మనస్సులో వడపోసిన ఆలోచనను ఆచరించాలి అని ఈ శ్లోకానికి అర్థం. చూడండి ఎన్ని తక్కువ మాటల్లో ఎంత మంచి విషయాలు చెప్పారో.
ముందు ఏముందో కంటితో చూడకుండా అడుగువేస్తే జారి పడవచ్చు, ఎముకలు విరుగవచ్చు. లేదా విషసర్పంపై అడుగువేస్తే అది కాటు వేస్తే ప్రాణాలే పోతాయి. అందుకే చూసి అడుగు వేయమన్నాడు. తర్వాత దప్పిక తీర్చుకోవటానికి ఏ నీరు పడితే ఆ నీరు తాగకూడదు. అవి విషక్రిములతో నిండి ఉంటే రోగాలు రావచ్చు. అందుకే వడబోసిన నీరు తాగమన్నాడు. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలము.
ఇక మనం సంఘ జీవులం కాబట్టి ఇతరులతో మాట్లాడకుండా ఉండలేము. ఎలా మాట్లాడాలి? ఎలాంటి మాటలను మాట్లాడాలి? మృదువుగా మాట్లాడాలి, సత్యమైన మాటల్నే మాట్లాడాలి. ఒక అబద్ధం చెబితే దాన్ని కప్పి పుచ్చుకోవ టానికి నూటా తొంభై ఆరు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అయినా సత్యం బయట పడుతుంది, ఎదుటివాని దృష్టిలో మనం చులకన అవుతాం. కాబట్టి సత్యంలో వడబోసిన మాటల్ని మాట్లాడమన్నాడు.
చివరగా మనసులో వడబోసిన ఆలోచనను ఆచరించమన్నాడు. అది సత్యమైనదనీ, అత్యధికులకు మంచి చేస్తుందనీ తేలితేనే దాన్ని ఆచరించాలి. ఈ సలహాలు అన్నిటినీ నిజ జీవితంలో పాటిస్తే మాన్యులం అవుతాం, మహనీయులుగా పరిగణన పొందుతాం. ఆనందంగా జీవించగలుగుతాం. అందుకే మన పూర్వుల మాటలు రతనాల మూటలు.
– రాచమడుగు శ్రీనివాసులు
ఇదీ చదవండి: అందమైన జీవన యాత్ర..!


