ఇంటి లోపల ఆక్సిజన్‌ను శుద్ధి చేసే మొక్కలు

Air Purifying Plants For Your Home To Improve Air Quality - Sakshi

ఈ కరోనా కాలంలో ఆక్సిజన్‌ గురించిన మాటలు తరచూ వింటున్నాం. ఇంట్లో మన చుట్టూ గాలి స్వచ్ఛంగా ఉండాలంటే అదనపు ప్రయత్నాలు తప్పనిసరి. అదీ సహజమైన రీతిలో. అందుకే ఇంటి లోపల ఆక్సిజన్‌ను శుద్ధి చేసే మొక్కల ఏర్పాట్లపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. ఏయే మొక్కలు విషయవాయువులను తొలగిస్తాయి, గాలిని శుద్ధి చేస్తాయో తెలుసుకుందాం. 

ఎరికా పామ్‌
ఈ మొక్క కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి విష వాయువులను తొలగించడంతో పాటు గాలిని శుద్ధి చేస్తుంది. పామ్‌ ఆకులపైన దుమ్ము త్వరగా పేరుకుపోతుంది, కాబట్టి దానిని రోజూ మెత్తని క్లాత్‌తో శుభ్రం చేయాలి. ఈ మొక్కను 45 రోజులకు ఒకసారి ఎండలో ఉంచాలి. నేల పొడిగా కనిపించినప్పుడు మాత్రమే కొద్దిగా నీళ్లు పోయాలి. పెంపుడు జంతువులు ఈ మొక్కను తిన లేవు. అయినప్పటికీ వాటిని దూరంగా ఉంచడం మంచిది. 

సాన్సేవిరియా
దీనిని స్నేక్‌ ప్లాంట్‌ అని కూడా అంటారు. ఈ మొక్క రాత్రిపూట కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సిజన్‌గా మారుస్తుంది. ఇది ఎక్కువ సేపు కూర్చునే లివింగ్‌ రూమ్‌ వంటి గదుల్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది. బాల్కనీలోని నీడలో కూడా బాగుంటుంది. తద్వారా గాలి శుద్ధి అవుతుంది. ఇది తక్కువ నీటిలో, తక్కువ సూర్యకాంతిలో ఆకుపచ్చగా ఉంటుంది. ఈ మొక్క పిల్లలకు, పెంపుడు జంతువులకు అందనంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం.  

రబ్బరు మొక్క
స్టడీ లేదా ఆఫీసు వర్క్‌ చేసుకునే అంటే మూసివేసినట్టుగా ఉండే గది శుభ్రంగా ఉంచాలంటే రబ్బరు మొక్క ఉన్న కుండీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొక్కకు తక్కువ సూర్యకాంతి సరిపోతుంది. నేల తేమగా ఉండేంత నీళ్లు చాలు. ఎక్కువ నీళ్లు పోస్తే వేళ్లు కుళ్లిపోతాయి. ఈ మొక్క ప్రత్యేక లక్షణం పెయింట్స్, గ్రీజు, లాండ్రీ సబ్బులలో ఉండే ఫార్మాల్డిహైడ్‌ వంటి రసాయనాలను తొలగిస్తుంది. ఈ మొక్కను పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచడం మంచిది. 

బోస్టన్‌ ఫెర్న్‌
ఈ మొక్క ఇంటిలోపలి గాలిలో పొగ, పెయింట్, పెర్‌ఫ్యూమ్, ఇతర సౌందర్య ఉత్పత్తుల నుండి  విడుదలయ్యే ఫార్మాల్డిహైడ్‌ను గ్రహిస్తుంది. కిటికీ గుండా లోపలికి సూర్యకిరణాలు పడే చోట ఈ మొక్క ఉన్న కుంyీ ని ఉంచాలి. బాల్కనీలలో ఈ మొక్క కుండీలను వేలాడదీయవచ్చు. ఎందుకంటే మొక్క గుబురు గడ్డిలా కనిపిస్తుంది, కాబట్టి వేలాడుతున్నప్పుడు ఇది చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నీళ్లు ఎక్కువ అవసరం లేదు. వేళ్లు తేమగా ఉండేలా జాగ్రత్తపడితే చాలు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top