పెంచుకున్న మమకారం తెంచుకొని వెళ్లిపోతే..! | A 20-year-old B.Sc student in Hyderabad allegedly died by suicide | Sakshi
Sakshi News home page

పెంచుకున్న మమకారం తెంచుకొని వెళ్లిపోతే..!

Mar 22 2026 4:12 AM | Updated on Mar 22 2026 4:12 AM

 A 20-year-old B.Sc student in Hyderabad allegedly died by suicide

పెట్‌ ప్రేమ

పెంపుడు పిల్లి చనిపోయిందని బీఎస్సీ చదువుతున్న ఒక అమ్మాయి,  పిల్లిని ఇంట్లోకి తేవద్దని తల్లి మందలించినందుకు ఎంబీబిఎస్‌ చదువుతున్న మరో అమ్మాయి– ఇటీవల సూసైడ్‌ చేసుకున్నారు. పెట్స్‌ను పెంచుకునేవారి శాతం ఇటీవల బాగా పెరుగుతోంది. పెట్స్‌తో అనుబంధమూ పెరుగుతోంది.  దీని వల్ల కొత్త సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి. ఇంటిల్లిపాదీ ముందుగా పెట్స్‌కు సంబంధించిన  వాస్తవాలను తెలుసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించవచ్చు అంటున్నారు నిపుణులు...

‘పిల్లి చనిపోతే ఏడుస్తున్నావా, కుక్కపోతే అంత దుఃఖమా..’ అంటూ బాధపడుతున్నవారితోనే అవమానకరంగా మాట్లాడేవారుంటారు. దీనివల్ల వారి బాధ మరింత పెరుగుతుంది అంటున్నారు మనస్తత్వ నిపుణులు. 

పెట్‌ అంటే కేవలం ఒక జంతువు కాదు. అది మనసుకు అండగా నిలిచే ఒక జీవం. మనం బాధల్లో లేదా ఆనందంలో ఉన్నప్పుడు మాటలేమీ లేకుండానే మనసును అర్థం చేసుకునే తోడు. అందుకే, ఇటీవలి కాలంలో చాలామంది పెట్స్‌తోనే ఎక్కువ అటాచ్‌మెంట్‌ను ఏర్పరుచుకుంటున్నారు. మనతో కలిసి జీవించే ప్రాణి అకస్మాత్తుగా దూరమైతే, ఇక ఎప్పటికీ రాదని తెలిస్తే మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. సున్నిత మనస్కులు మరింత భావోద్వేగాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అత్యంత ప్రియమైన వ్యక్తిని కోల్పోతే ఎంత బాధ కలుగుతుందో పెంపుడు జంతువును కోల్పోయినా అంతే బాధ కలుగుతుంది.

వాస్తవం ఏంటంటే...
∙పెట్స్‌కి మనుషుల కంటే తక్కువ జీవనప్రమాణం ఉంటుంది. పిల్లి జీవితం కాలం 13 నుంచి 20 ఏళ్లు. కుక్క ఆయుష్షు బ్రీడ్‌ను బట్టి 10 – 13 ఏళ్లు, కుందేలు 7 –10 ఏళ్లు. ఇలాగే, ఇతర జంతువులు, పక్షులకు.. నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుంది.  ∙పోషణ, అనారోగ్య పరిస్థితులు, ప్రమాదాలు, బరువు నిర్వహణ.. ఇవన్నీ కూడా పెంపుడు జంతువుల ఆయుర్దాయాన్ని నిర్దేశిస్తాయి. వీటిని తప్పక అంగీకరించాల్సిందే. 

ఈ విషయాన్ని పెట్‌ను ఇంటికి తీసుకురావడానికి ముందే కుటుంబ సభ్యులందరూ తెలుసుకోవాలి. పిల్లలు ఉంటే వారికి ఈ నిజాలు తప్పక చెప్పాలి. ∙పెంపుడు  ఎలా ఉండాలి, క్రమశిక్షణ, వాటికి ఇవ్వాల్సిన శిక్షణ, కుటుంబంలో అందరూ నిబంధనను తప్పక పాటించాలి. నెలకు ఒకసారైనా పెట్స్‌ పెంపకం గురించి మంచి–చెడులను అందరూ కలిసి బేరీజు వేసుకోవాలి. ∙పెట్‌ చనిపోవడం ఒక్కటే కాకపోవచ్చు... సూసైడ్‌కు ఒత్తిడికి సంబంధించిన కారణాలు మరిన్ని ఉండి ఉండవచ్చు.

తేలిగ్గా తీసేయవద్దు
కుటుంబంలో పెంపుడు జంతువుతో ఎవరికి ఎక్కువ అటాచ్‌మెంట్‌ ఉందో అలాంటి వ్యక్తిని ఒంటరిగా ఉండనివ్వకూడదు. ‘పిల్లికి, కుక్కకే.. ఇలా అయిపోతే ఎలా.. అది ఒక జంతువు మాత్రమే కదా’ అనే మాటలతో వాళ్ల బాధను చిన్నచూపు చూడద్దు. దీనివల్ల ఇంట్లో తమ భావోద్వేగాలను పట్టించుకోనివారిగా, తమ బంధాన్ని అగౌరవ పరిచినట్టుగా భావిస్తారు.  

ఇవి చేయించవచ్చు...
∙పెట్‌ రెస్క్యూ సెంటర్స్, అడాప్షన్‌ సెంటర్స్‌కి వెళ్లి రావచ్చు. ∙మరో చిన్న పెట్‌ను కుటుంబంలోకి ఆహ్వానించవచ్చు. ∙యానిమల్‌ రెస్క్యూ టీమ్స్‌తో కలిసి స్వచ్ఛందంగా తమ సేవలను అందించవచ్చు. ∙పెట్‌ లాస్‌ – ఆన్‌లైన్‌ సపోర్ట్‌ గ్రూప్స్, హ్యూమన్‌ వరల్డ్‌ లింక్‌ వంటి గ్రూప్స్‌ ఉన్నాయి, వాటిలో చేరి బాధను పంచుకోవచ్చు. ∙పెట్‌ జ్ఞాపకార్ధం ఒక మొక్కను తెచ్చి నాటి, ఆ మొక్క పెంపకంలో సేదతీరవచ్చు. ∙పెంపుడు జంతువు గురించి నచ్చిన విషయాలను రాసి, ఇంట్లో అందరూ ఆ విషయాలను పంచుకోవచ్చు. ∙బాధ నుంచి కోలుకోవడానికి స్థల మార్పిడి బెటర్‌. ∙మనసుకు దగ్గరగా ఉండే స్నేహితులు, బాధను పంచుకోగలవారు దగ్గరగా ఉండాలి. 
పెట్‌ మన జీవితంలో ఒక భాగం మాత్రమే. జీవితం మొత్తం కాదు. పెంపుడు జంతువు పంచిన ప్రేమను గుర్తుంచుకోవాలి. కానీ మన జీవితాన్ని వదిలేయకూడదు.. అనే వాస్తవాల్ని పెట్‌ లవర్స్‌ తెలుసుకోవాలి, సన్నిహితులకు తెలియజెప్పాలి.

నిపుణుల సాయం అవసరం...
పెట్స్‌ను ప్రేమించడం మంచి విషయం. కానీ, ఆ ప్రేమ మన బతుకుని బలి తీసుకునేలా ఉండకూడదు. ఎక్కువ ఎమోషన్‌కు గురవుతుంటే, మూల కారణాలను కూడా తెలుసుకోగలగాలి. దుఃఖిస్తున్నవారితో మాట్లాడుతూ ఉండాలి. గతంలో పెంపుడు జంతువుతో ఉన్న సమయాలు పదే పదే గుర్తుకు వస్తుంటే, ఆ సమయం లో మరో ఇష్టమైన వ్యాపకంతో పూరించుకోవాలి. అధిక ప్రేమ, భావోద్వేగాల విషయంలో కుటుంబంలో ఎవరైనా బాధపడుతుంటే కౌన్సిలర్‌ సాయం తప్పక అవసరం.

– డాక్టర్‌ సునీత ప్రసాద్, సైకాలజిస్ట్‌ 
 

Advertisement
 
Advertisement
Advertisement