మంచు ఖండంలో మెరిసిన వజ్రం

1st Woman of Colour to Complete Solo Expedition in Antarctica - Sakshi

మైనస్‌ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు... లెక్కచేయలేదు. ఎముకలు కొరికే అత్యంత చల్లటి గాలులు...  లెక్కచేయలేదు. వేల మైళ్ల ప్రయాణంలో తోడు ఎవరూ ఉండరు... లెక్కచేయలేదు. 40 రోజుల్లో అంటార్కిటికా దక్షిణ ధ్రువ యాత్రను ఒంటరిగా పూర్తి చేసి లెక్క చెప్పింది ‘700 మైళ్లు ప్రయాణించాను’ అని.

  ‘నేను గాజు పైకప్పును పగులకొట్టాలనుకోలేదు, దానిని మిలియన్ల ముక్కలు చేయాలనుకున్నాను’ అని సగర్వంగా చాటింది. మొక్కవోని ధైర్యంతో వజ్రంలా మెరిసింది. ‘సైనికుల దృఢ సంకల్పానికి స్ఫూర్తిదాయకం ప్రీత్‌ చాందీ’ అంటూ బ్రిటిష్‌ ఆర్మీ ఆమెకు అభినందనలు తెలియజేసింది.

బ్రిటిష్‌ ఆర్మీ అధికారి కెప్టెన్‌ ప్రీత్‌ చాందీ అంటార్కిటికా దక్షిణ ధ్రువానికి ఒంటరిగా ప్రయాణించిన భార త సంతతికి చెందిన తొలి మహిళ. ఆమె యాత్ర కిందటేడాది నవంబర్‌లో ప్రారంభమై 700 మైళ్లు అంటే సుమారు 1,127 కిలోమీటర్లు 40 రోజుల పాటు కొనసాగింది. మొన్నటి సోమవారం తన లైవ్‌ బ్లాగ్‌లో చరిత్ర సృష్టించిన ఘనతను ప్రకటించింది.

తెలియని ప్రపంచంలోకి...
32 ఏళ్ల కెప్టెన్‌ హర్‌ప్రీత్‌ చాందీ మైనస్‌ 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలలో గాలి వేగంతో పోరాడుతూ, తనకు అవసరమైనవన్నీ ఉంచిన స్లెడ్జ్‌ను లాగుతూ దక్షిణ ధ్రువంలో వందల మైళ్లు ప్రయాణించింది. ‘మంచు కురుస్తున్న దక్షిణ ధ్రువానికి చేరుకున్నాను. ప్రస్తుతం చాలా భావోద్వేగాలను అనుభవిస్తున్నాను. మూడేళ్ల క్రితం వరకు ఈ ధ్రువ ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అలాంటిది, ఇక్కడ ఉండటం నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఇక్కడికి రావడం చాలా కష్టం. నేను విజేతగా తిరిగి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఆమె బ్లాగులో రాసింది.

సరిహద్దులను దాటాలి
‘ఈ యాత్ర సాధారణమైనది కాదు, ఎంతో పెద్దది, ఊహకు కూడా అందనిది. ప్రజలు తమ సరిహద్దులను దాటడానికి తమని తాము నమ్మాలి. అందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపడానికే నా ఈ ప్రయాణం. మీరు నన్ను తిరుగుబాటుదారుని అని ముద్ర వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సందర్భాలలో ఈ సాహసం ‘వద్దు’ అనే నాకు చాలా మంది చెప్పారు. ‘సాధారణం అనిపించే పనిని మాత్రమే చేయండి’ అన్నారు. కానీ, నేను నాదైన సాధారణాన్ని సృష్టిస్తాను’ అని చాందీ చెప్పారు.

గాజు కప్పును పగలకొట్టేద్దాం
తన ప్రయాణం గురించి బయటి ప్రపంచానికి తెలియడానికి ఆమె తన ట్రెక్‌ లైవ్‌ ట్రాకింగ్‌ మ్యాప్‌ను అప్‌లోడ్‌ చేసింది. మంచుతో కప్పబడిన ప్రాంతంలోనూ తన ప్రయాణం గురించి బ్లాగులో పోస్ట్‌ చేస్తూనే ఉంది. ‘40వ రోజు పూర్తయ్యింది. అంటార్కిటికాలో సోలో సాహస యాత్రను పూర్తి చేసిన మొదటి వర్ణ మహిళగా ప్రీత్‌ చరిత్ర సృష్టించింది’ అని ఆమె బ్లాగ్‌ చివరి పేర్కొన్న ఎంట్రీ చెబుతుంది. ‘మీకు కావల్సిన దేనినైనా మీరు సాధించగలరు. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. నాకు కేవలం మూస పద్ధతిలో ఉన్న గాజు పై కప్పును పగలగొట్టడం ఇష్టం లేదు. దానిని మిలియన్‌ ముక్కలుగా బద్దలు కొట్టాలనుకుంటున్నాను’ అని దృఢంగా వెలిబుచ్చిన పదాలు మన అందరినీ ఆలోచింపజేస్తాయి.

వెడ్డింగ్‌ ప్లాన్‌
ఆమె తన సాహసయాత్రకు బయలుదేరే ముందు ఆర్మీ రిజర్విస్ట్‌ డేవిడ్‌ జర్మాన్‌తో నిశ్చితార్థం అయ్యింది. ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చాక వివాహ ప్రణాళికల గురించి ఆలోచించడానికి ఆమె తన సమయాన్ని చలిలోనే ఉపయోగించుకుంది. ఈ నెలాఖరులో ఆమె దక్షిణ ధ్రువం నుండి తిరిగి వచ్చాక ఈ జంట చిలీలో తిరిగి కలుస్తారని భావిస్తున్నారు.
 
పోలార్‌ ప్రీత్‌ అంటూ అంతా పిలుచుకునే ప్రీత్‌ చాందీ వాయవ్య ఇంగ్లండ్‌లోని మెడికల్‌ రెజిమెంట్‌లో భాగంగా సైన్యంలోని వైద్యులకు క్లినికల్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌గానూ శిక్షణ ఇస్తుంది. ఫిజియోథెరపిస్ట్‌ కూడా. లండన్‌లోని క్వీన్‌ మెరీస్‌ యూనివర్శిటీలో పార్ట్‌టైమ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఎక్సర్‌ౖసైజ్‌ మెడిసిన్‌లో మాస్టర్స్‌ డిగ్రీని పూర్తి చేస్తోంది. స్లెడ్జ్‌కి ప్రత్యామ్నాయంగా పోలార్‌ ట్రైనింగ్‌ కోసం కొన్ని నెలల పాటు అత్యంత బరువైన రెండు పెద్ద టైర్లను లాగుతూ శిక్షణ తీసుకుంది. స్లెడ్జ్‌లో కావల్సిన తప్పనిసరి వస్తువులను ఉంచి, అంటార్కిటికా సౌత్‌పోల్‌ మొత్తం ఇదే ప్రయాణం కొనసాగించింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top