ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : స్థానిక సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బంది ఆకలితో నకనకలాడారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ హాల్‌లో విధులు నిర్వహిస్తూ కౌంటింగ్ ప్రక్రియ విజయవంతం కావడంలో శ్రమించిన సిబ్బంది మధ్యాహ్నం భోజనాలు పెట్టే ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అప్పటికే భోజనాలు అయిపోయాయని నిర్వాహకులు తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతం వరకూ భోజనాలు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిబ్బందిలో పలువురు షుగర్ బాధితులు ఉన్నారని, కనీసం వారికి కూడా భోజనం అందించడంలో జిల్లా పరిషత్ అధికారులు నిర్లక్ష్యం వహించడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి భోజనాలు కూడా అందించలేని వారు తమను కౌంటింగ్ విధులకు ఎందుకు పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


