ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సుప్రీంకోర్టు వేదికగా 1/70 చట్టాన్ని రద్దు చేయడానికి జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివాసులు భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎస్ నాగరాజు మాట్లాడుతూ 1/70 చట్టం వచ్చి 56 సంవత్సరాలు గడుస్తున్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీల భూములు భూస్వామ్య, పెత్తందారీ శక్తుల చేతుల్లో బందీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు పోరాడి సాధించుకున్న భూములను కబ్జా చేసేందుకే కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. గతంలో జీవో నంబర్ 3ని ఏ విధంగా రద్దు చేయించారో, ఇప్పుడు అదే రీతిలో 1/70 చట్టాన్ని రద్దు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని, వీటిని తిప్పికొట్టడానికి ఆదివాసీలంతా సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బాషా, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కుంజం రామారావు, సహాయ కార్యదర్శి సవలం రాంబాబు తదితరులు ప్రసంగించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో గిరిజన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ వెట్రిసెల్వికి అందజేశారు.


