నేర నియంత్రణలో టెక్నాలజీ విప్లవం | - | Sakshi
Sakshi News home page

నేర నియంత్రణలో టెక్నాలజీ విప్లవం

Jul 29 2026 12:58 AM | Updated on Jul 29 2026 12:58 AM

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

కై కలూరు: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నీట్‌ పేపర్‌ లీకేజీ అంశంపై ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నిరసనల ముసుగులో క్రిమినల్‌ రికార్డులున్న సంఘ విద్రోహ శక్తులు పోలీసులపై దాడులకు పాల్పడ్డాయి. ఆందోళనకారుల ముఖాలను గుర్తించేందుకు పోలీసులు అధునాతన ఫేషియల్‌ రికగ్నేషన్‌ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ)ని వినియోగించారు. ఈ సాంకేతికత ద్వారా హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, పోక్సో కేసులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి వివిధ తీవ్ర నేరాలకు సంబంధించి ఏకంగా 2,873 మంది నేరస్తులను గుర్తించడం విశేషం. నేర పరిశోధనలో టెక్నాలజీ ఎంతటి సంచలనాత్మక ఫలితాలను ఇస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.

ఏలూరు జిల్లాలో...

ఇదే కోవలో ఏలూరు జిల్లా పోలీసులు నేరస్తులను పట్టుకోవడంలో, గుర్తించడంలో పరిశోధనల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ఇటీవల ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో ‘ధార్‌ గ్యాంగ్‌’కు చెందిన ముగ్గురు సభ్యుల కదలికలను పోలీసులు గుర్తించారు. గత నెల 13న విశాఖపట్నం కంచరపాలెం పరిధిలో సంచరించిన ఈ ముఠా.. జూన్‌ 15న సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ మీదుగా ఏలూరు చేరుకున్నట్లు ఎఫ్‌ఆర్‌టీ టెక్నాలజీ ద్వారా పోలీసులు పక్కాగా గుర్తించి వారి పూర్తి వివరాలు, ఫొటోలను సేకరించారు.

ఏఎన్‌పీఆర్‌ సహాయంతో

పోలీసు వ్యవస్థకు ఏఐ ఆధారిత సాంకేతికత కొండంత అండగా నిలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం రహదారులపై ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నేషన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లను గుర్తించి, దానికి సంబంధించిన సమాచారాన్ని అలారం రూపంలో సమీప పోలీసులకు చేరవేస్తున్నాయి. ఇటీవల కై కలూరులో చోరీకి గురైన బైక్‌ను పెద్ద తిరుపతిలో పట్టుకోవడంలో ఈ ఏఎన్‌పీఆర్‌ టెక్నాలజీయే కీలక పాత్ర పోషించింది. నేరస్తుల ముఖచిత్రాలను ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేయడం వల్ల దేశంలో ఎక్కడైనా వారి కదలికలను గుర్తించి సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం అందే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నేటి కాలంలో గ్రామాల్లోని ఒక్కో సీసీ కెమెరా ఇద్దరు కానిస్టేబుళ్లతో సమానంగా అప్రమత్తంగా పనిచేస్తోంది.

ధర్మా యాప్‌తో కేసుల పరిష్కారం

ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్‌ శివకిషోర్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ధర్మా (డిజిటల్‌ హాలిస్టిక్‌ ఏఐ డ్త్రెవెన్‌ రెస్సాన్స్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌) యాప్‌ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఈ ఏఐ ఆధారిత యాప్‌ ద్వారా నేరాలకు సంబంధించిన ఫొటోలు, సాక్ష్యాలు, ఛార్జ్‌షీట్లను ఖచ్చితంగా నిర్ధారించుకునే అవకాశం లభిస్తోంది. గత నెలలో 20 శాతం కేసుల పరిష్కారానికి ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడిందని ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ సైతం ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆపరేషన్‌ ట్రేస్‌’ వంటి కార్యక్రమాల్లో ఆధార్‌తో పాటు ఇతర డేటా, ఫేషియల్‌ రికగ్నేషన్‌ను జోడించడం ద్వారా తప్పిపోయిన మహిళలు, పిల్లలను అత్యంత కచ్చితత్వంతో నేడు వెతికి పట్టుకోగలుగుతున్నారు.

నేరస్తుల గుర్తింపులో నూతన సాంకేతికత

ఫలితాలిస్తున్న ఫేషియల్‌ రికగ్నేషన్‌ టెక్నాలజీ

గ్రామాల్లో విస్తరించిన ఏఎన్‌పీఆర్‌, సీసీ కెమెరాలు

ఏలూరు జిల్లాలో ధర్మా యాప్‌తో కేసుల పరిష్కారం

పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ విషయంలో ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అమరావతిలో 360 డిగ్రీల సెంట్రల్‌ సిస్టం అందుబాటులోకి వచ్చింది. అన్ని ప్రాంతాల సీసీ కెమెరాలను దీనికి అనుసంధానం చేయడం వల్ల నేరస్తులను పట్టుకోవడం మరింత సులభమైంది. నేరాల అదుపు కోసం ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.

– వి.రవికుమార్‌, కై కలూరు రూరల్‌ సర్కిల్‌ సీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement