ఆలయ ఆవరణలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు
కుంకుళ్లమ్మ అమ్మవారికి హారతులిస్తున్న అర్చకుడు
ద్వారకాతిరుమల: క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం పౌర్ణమి పర్వదినం సందర్భంగా మంగళవారం రాత్రి సహస్ర దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు దీపాలను వెలిగించి భక్తి పారవశ్యాన్ని చాటగా, ఆలయ ప్రాంగణం దివ్యకాంతులతో కళకళలాడింది. ముందుగా భక్తులు ఆలయ ఆవరణలో ఓంకారం, శంఖు, చక్ర, నామాలు ఇలా పలు ఆకారాల్లో దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు గర్భగుడిలో కొలువై ఉన్న అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, మంగళ హారతులిచ్చారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని పలువురు భక్తులు దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.


