తగ్గుతున్న గోదావరి వరద | - | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న గోదావరి వరద

Jul 29 2026 12:58 AM | Updated on Jul 29 2026 12:58 AM

తగ్గుతున్న గోదావరి వరద విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

పోలవరం రూరల్‌: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం 1.56 లక్షల క్యూసెక్కల నీరు స్పిల్‌వే నుంచి దిగువకు చేరగా, రాత్రికి ఆ ప్రవాహం 1.16 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరే ఉప నదుల ప్రవాహం క్రమేపీ తగ్గుతుండటంతో వరద ఉధృతి కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం స్పిల్‌వే వద్ద నీటిమట్టం 28 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే లోని 48 గేట్ల ద్వారా 1.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయడంలోనూ, జీవో నెం.77 రద్దులోనూ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్‌ ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐ.రాజేష్‌ మాట్లాడుతూ.. ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ. 13 వేలు మాత్రమే జమ చేయడం తల్లిదండ్రులను మోసం చేయడమేనని అన్నారు. అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు కాకి నాని డిమాండ్‌ చేశారు. అనంతరం నాయకులు విద్యాశాఖ ఏడీ–1కి వినతిపత్రం అందజేశారు.

చింతలపూడి (జంగారెడ్డిగూడెం): మద్ది ఆంజనేయస్వామివారిని మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తులు స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు చేయించుకోవడంతో పాటు, పలువురు భక్తులు అన్నప్రాశనలు, వాహన పూజలు నిర్వహించుకున్నారు. వివిధ సేవల రూపంలో ఆలయానికి రూ.2,91,560 ఆదాయం సమకూరిందని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, సహాయ కమిషనర్‌, ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. అలాగే 2,172 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేసినట్లు వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement