టి.నరసాపురం: విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెడ్లం పంచాయతీ శ్రీరామవరం గ్రామానికి చెందిన చవల అప్పారావు (43) సోమవారం ఉదయం తాను కౌలుకు తీసుకున్న ఆయిల్‌పామ్ తోటలోని మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు. ఈ క్రమంలో పాత బోరు నుంచి కొత్త బోరు వరకు వేసిన కేబుల్ వైరు నీళ్లు పెట్టడానికి అడ్డురావడంతో, దానిని ఒక పైపు ముక్కతో పక్కకు తప్పించేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు ఆ కేబుల్ వైరు, ప్లాస్టిక్ ముక్క చాతీపై పడటంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు టి.నరసాపురం ఎస్‌ఐ ఎం.జయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు తన వద్ద ఉన్న రూ.లక్ష నగదును పోగొట్టుకున్న సంఘటన ద్వారకాతిరుమలలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. ఎస్సై టి. సుధీర్ కథనం ప్రకారం... ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామానికి చెందిన గూరుగుబెల్లి రమణమూర్తి కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 25న భార్యతో కలిసి శ్రీవారి దర్శనార్థం ద్వారకాతిరుమలకు వచ్చాడు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో ఇంట్లో ఉన్న రూ.లక్ష నగదును తన ప్యాంటు జేబులో పెట్టుకుని తీసుకొచ్చాడు. శ్రీవారి దర్శనం అనంతరం అన్నదాన భవనంలో ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ప్యాంటు జేబులో నగదు లేదని గుర్తించి, గుర్తుతెలియని వ్యక్తులు జేబులోని డబ్బును దొంగిలించినట్లు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్ తెలిపారు.


