వంట ఏజెన్సీలను తొలగించేందుకు కుట్రలు | - | Sakshi
Sakshi News home page

వంట ఏజెన్సీలను తొలగించేందుకు కుట్రలు

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

వంట ఏజెన్సీలను తొలగించేందుకు కుట్రలు పక్క జిల్లాలోకి పెద్దపులి ఆలయాల్లో చోరీలు చేసిన ఇద్దరి అరెస్ట్‌ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం దీక్షలు

నూజివీడు: మధ్యాహ్న భోజన పథకం ఏజన్సీ నిర్వాహకులను తొలగించేందుకే ప్రభుత్వం స్మార్ట్‌ కిచెన్‌ను తీసుకొస్తోందని సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీ హరినాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఏఐసీసీటియూ ఆధ్వర్యంలో సోమవారం ఏజెన్సీ నిర్వాహకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1.50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న వంట ఏజెన్సీలను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య, దుర్గం పుల్లారావు, పరికల కళావతి, పల్లెపాం భవాని, మేకల కుమారి, సీతామహాలక్ష్మి, భూతం మారయ్య, కలపాల రాణి తదితరులు పాల్గొన్నారు.

పోలవరం రూరల్‌: ఏలూరు జిల్లా పోలవరం మండలం నుంచి పెద్దపులి గోదావరి దాటి తూర్పుగోదావరి జిల్లా వైపునకు చేరుకుంది. గత పది రోజులుగా పాపికొండల అభయారణ్య ప్రాంతంలో సంచరించిన పెద్దపులి ఆదివారం కొత్తూరు గ్రామ సమీపం నుంచి గోదావరి నది దాటి వెళ్లినట్లు పోలవరం రేంజ్‌ అధికారి ఎస్‌కే వలీ తెలిపారు. గత 10 రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పెద్దపులి, నది దాటి వెళ్ళడంతో ఏజెన్సీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 10న తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి గోదావరి నది దాటి ప్రవేశించిన పెద్ద పులి పోలవరం మండలంలో రెండు ఆవు దూడలపై దాడి చేసింది. అటవీశాఖ అధికారులు పులికి అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్‌ ద్వారా ఎప్పటికప్పుడు పులి కదలికలను గమనిస్తున్నారు. గోదావరి నది దాటి వెళ్ళినప్పటికీ దీని పయనం ఏవిధంగా ఉంటుంది, ఎటు వైపునకు తిరుగుతుందని అంచనా వేయలేని పరిస్థితి ఉందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మళ్లీ గోదావరి నది దాటి ఏలూరు జిల్లాలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సఖినేటిపల్లి: మండలంలో వేర్వేరు ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని సోమ వారం అరెస్టు చేసి రాజోలు కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 17న అర్థరాత్రి సఖినేటిపల్లి శివాలయం, అయ్యప్పస్వామి ఆలయం, కన్యకాపరమేశ్వరీ ఆలయం, గీతామందిరం వద్ద హనుమాన్‌ ఆలయం, ఆబోతు ఆలయం వద్ద హుండీలను పగులగొట్టి, అందులో ఉన్న నగదును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సదరు కేసులోని ముద్దాయిలు భీమవరానికి చెందిన నారా ధనుష్‌, చలపాక ప్రవీణ్‌లను సోమవారం అప్పనరామునిలంకలో అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.11,022 నగదు, యమహా బైక్‌ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. ముద్దాయిలకు 14 రోజులపాటు రిమాండ్‌ విధించినట్టు, తదుపరి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించామని ఎస్సై అన్నారు.

భీమవరం: దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిస్కార కోసం ఫ్యాప్టో ఆధ్వర్యంలో మూడోదశ పోరాటంలో భాగంగా ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జిల్లా చైర్మన్‌ పీఎస్‌.విజయ రామరాజు, సెక్రటరీ జనరల్‌ జి.ప్రకాశం చెప్పారు. సోమవారం భీమవరంలో మాట్లాడుతూ 25న జిల్లా నుంచి 1000 మంది ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ కేవీ.రామచంద్రరావు, కో–కన్వీనర్లు శ్రీనివాస్‌, వెంకటేశ్వరరావు, ట్రెజరర్‌ పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement