స్వర్ణకారుల ఆకలి కేకలు
ప్రభుత్వమే ఆదుకోవాలి
50 శాతం సబ్సిడీతో రుణాలివ్వాలి
● కార్పొరేట్ దుకాణాలతో తగ్గిన గిరాకీ
● బంగారం ధరలు పెరగడంతో పూర్తిగా దిగజారిన ఉపాధి
● ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న స్వర్ణకారులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఒకప్పుడు తాళిబొట్టు చేయాలంటే విశ్వకర్మ వంశస్థుల దగ్గరికి వెళ్ళేవారు. వారు వధూవరుల నక్షత్రాలు చూసి వారికి సరిపడే తారాబలం చూసి ముహూర్తం పెట్టి మంగళ సూత్రాలు చేసేవాళ్ళు. ఇప్పుడు కార్పొరేట్ బంగారు దుకాణాలకు వెళ్లి కొంటున్నారు. పెద్ద కంపెనీల బంగారు దుకాణాలకు జనాభా క్యూ కడుతున్నారు. రెడీమేడ్‌గా యంత్రాలతో తయారైన ఆభరణాలు ఆకర్షణీయంగా ఉండడంతో ప్రజలు వాటిపట్ల ఆకర్షితులవుతున్నారని స్వర్ణకారులు చెబుతున్నారు. కార్పొరేట్ దుకాణాల ప్రాబల్యం పెరగడంతో స్వర్ణకారుల జీవితాలు ఒడిదుడుకులకు లోనయ్యాయని అంటున్నారు.
పూర్తిగా తగ్గిన ఉపాధి : ప్రస్తుత మార్కెట్‌లో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం కాసు ధర రూ. 1.15 లక్షలు పలుకుతోంది. ఏడాది క్రితం వరకూ బంగారం ధరలు పెరిగినా వారానికో 15 రోజులకో రూ.100 నుంచి రూ. 200 మధ్యలో పెరిగేది. ఇప్పుడు రోజూ రూ.1000 వరకూ పెరుగుతుండడంతో సామాన్యులు బంగారం వైపు కన్నెత్తి చూసే ఆలోచన కూడా చేయలేకపోతున్నారు. దీంతో ఆభరణాలు చేయించుకోలేక మిన్నకుండిపోతున్నారు. ఈ కారణంగా స్వర్ణకార వృత్తిలో ఉన్న వారికి చేతి నిండా పనే లేకుండా పోయింది. ఆభరణాల తయారీ మాత్రమే తెలిసిన స్వర్ణకారులు వేరే వృత్తిలోకి వెళ్ళలేక పోతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో ఆకలి కేకలు వేయక తప్పడం లేదు. కుటుంబ పోషణ నిమిత్తం కొంతమంది స్వర్ణకారులు ఏదో ఒక దుకాణంలో సహాయకుడిగా పని చేస్తున్నారు. మరికొంత మంది బ్యాంకుల్లో అప్రైజర్లుగా పని చేసుకుంటున్నారు. గతంలో బ్యాంకు అప్రైజర్లకు వయో పరిమితి ఉండేది కాదు. ప్రస్తుతం బ్యాంకుల్లో అప్రైజర్లుగా పని చేసే వారికి సైతం 60 ఏళ్ళకే పదవీ విరమణ నిబంధన అమలు చేస్తూ ఉండడంతో వారికీ ఆదాయ మార్గాలు మూసుకుపోతున్నాయి.
గతంలో 1500 స్వర్ణకారుల కుటుంబాలు
గతంలో జిల్లాలో స్వర్ణకార వృత్తిలో దాదాపు 1500 కుటుంబాల ఉండేవి. ఆభరణాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన ఆ కుటుంబాలకు మారిన పరిస్థితుల కారణంగా, కార్పొరేట్ దుకాణాల వల్ల వృత్తిని వదిలి వెళ్ళక తప్పడంలేదు. ఈ మేరకు నిపుణులైన ఎంతో మంది స్వర్ణకారులు ఇప్పటికే వృత్తికి దూరమయ్యారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం 150 –200 మధ్య మాత్రమే వృత్తి కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్‌లో బంగారు ఆభరణాలు స్థానికంగా తయారు చేసే వారే కరువైపోతారనడంలో సందేహమే లేదని, అదే పరిస్థితి వస్తే కార్పొరేట్ వ్యాపారులదే రాజ్యంగా ఉంటుందంటున్నారు. బంగార ఆభరణాల ధరలకు రెక్కలు రావడంతో పాటు నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందంటున్నారు.
వ్యాపారాలు లేక ఖాళీగా ఉన్న బంగారు ఆభరణాల దుకాణం
బంగారు ఆభరణాల తయారీలో స్వర్ణకారుడు కృష్ణప్రసాద్
బంగారం ధరలు విపరీతంగా పెరగడం, కార్పొరేట్ దుకాణాల తాకిడి కారణంగా స్వర్ణకారులు ఉపాధికి దూరమైపోయారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను స్వర్ణకారులకూ అమలు చేయాలి. స్వర్ణకార దుకాణాలకు పూర్తి ఉచిత కరెంటు ఇవ్వాలి. స్వర్ణకార కుటుంబంలో ఆడపిల్ల వివాహానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం చేయాలి. 50 సంవత్సరాలు నిండిన స్వర్ణకారుడికి రూ.6 వేలు పెన్షన్ ఇవ్వాలి.
– లక్కోజు రాజగోపాలాచారి,
కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం
స్వర్ణకారులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో స్వర్ణకార క్లస్టర్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి మున్సిపల్ పట్టణంలో మున్సిపాల్టీకి సంబంధించిన షాపుల్లో స్వర్ణకారులకి షాపులు కేటాయించాలి. స్వర్ణకారులకు పోలీస్ వేధింపులు లేకుండా ఓల్డ్ జీవో మార్పు చేసి అమలు చేయాలి. హెచ్‌యూడీ హాల్ మార్క్ సింగిల్ నగలకే పర్మిషన్ స్వర్ణకాడికి ఇవ్వాలి. బ్యాంకు అప్రైజర్ ఉద్యోగాలు విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకే కేటాయించాలి.
– బొద్దూరి నాగభూషణం, అధ్యక్షుడు, ఏలూరు నగర స్వర్ణకార సంఘం
స్వర్ణకారుల ఆకలి కేకలు
స్వర్ణకారుల ఆకలి కేకలు
స్వర్ణకారుల ఆకలి కేకలు


