రైల్వే ప్రాజెక్టులకు మొండిచేయి
దశాబ్దాల డిమాండ్
● ముందుకు సాగని కోటిపల్లి–నరసాపురం లైన్ పనులు
● నరసాపురం–మచిలీపట్నం కొత్త లైన్ కల నెరవేరేనా ?
నరసాపురం: జిల్లాకు సంబంధిచి నరసాపురం–కోటిపల్లి రైల్వే లైన్, నరసాపురం–మచిలీపట్నం కొత్త రైల్వే లైన్ నిర్మాణం ప్రాజెక్ట్‌లకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో మొండి చేయి మిలిగింది. బడ్టెట్ ప్రవేశపెట్టి దాదాపు నెలరోజులు కావస్తున్నా.. అసలు జిల్లాలో రైల్వే ప్రాజెక్ట్‌లకు కేటాయింపులు ఏమైనా చేశారా? అన్న అంశంపై రైల్వే శాఖ నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నరసాపురం రైల్వే ప్రాజెక్ట్‌ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని ఎదురు చూస్తున్నారు. నరసాపురం కోడలు నిర్మలాసీతారామన్ కీలక రైల్వే ప్రాజెక్ట్‌ల విషయంలో కరుణ చూపించకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
సాగని నరసాపురం–కోటిపల్లి పనులు
కీలకమైన నరసాపురం–కోటిపల్లి రైల్వే లైన్ పనులు ముందుకు సాగడం లేదు. ప్రతీ బడ్జెట్‌లో కొంత మేర నిధులు కేటాయిస్తున్నప్పటికీ పెద్దగా కదలిక లేదు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేయడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా సొమ్ములు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. స్థల సేకరణ పూర్తి కాలేదు. గోదావరిపై మూడుచోట్ల వంతెన పనులు మొదలు కావడం ఒక్కటే పురోగతి. ఈ రైల్వేలైన్ కోసం దాదాపు 200 ఎకరాల భూమి సేకరించాలి. తొలి దశలో 158.55 ఎకరాలు సేకరించారు. తూర్పుగోదావరి జిల్లాలో భట్లపాలెం, కామనగరువు ప్రాంతాలు అమలాపురం మండలంలో భట్నవిల్లి, రోళ్లపాలెం, భట్లపాలెం, పేరూరు పరిధిలో ప్రాంతాల్లో 60 శాతం స్థల సేకరణ జరిగింది. ఈ ప్రాంతాల్లో మిగిలిన 40 శాతంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలి, నరసాపురం ప్రాంతాల్లో భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. ఇంతవరకూ సేకరించిన భూమిలో బాధితులకు పూర్తిస్థాయిలో ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎంపీల కృషితో కేంద్రం ప్రతి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ఈ బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. రూ.2,800 కోట్ల అంచనాతో ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి గోదావరిపై మూడు పాయల వద్ద వంతెన నిర్మాణం జరుగుతోంది. వంతెన నిర్మాణాలకు రూ.700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచి మూడేళ్ల్ల క్రితం ప్రారంభించారు. ఇంతవరకూ నిధుల్లో ఎక్కువ మొత్తం వంతెనలకే సరిపోయింది. 2001లో రూ.800 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ వ్యయం ప్రస్తుతం రూ.2,800 కోట్లకు చేరింది.
బ్రిటిష్ హయాం నుంచి నరసాపురం నుంచి ట్రాక్‌ను మచిలీపట్నం వరకూ పొడిగించాలని ప్రతిపాదన ఉంది. నరసాపురం, మచిలీపట్నం సముద్ర తీర పట్టణాలు కావడం, జలరవాణా ప్రధానంగా ఉండే ఆ రోజుల్లో వీటిని కలపాలని భావించారు. అయితే రెండేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడంలేదు. కోటిపల్లి టు నరసాపురం రైల్వేలైన్ నిర్మాణం పూర్తయితే అటు కోనసీమ నుంచి ఇటు కోస్తాకు రైల్వే ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. మరోవైపు నరసాపురం–మచిలీపట్నం రైల్వే లైన్ నిర్మాణం కూడా సాగితే మొత్తం గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు జిల్లాలకు అనుసంధానంగా నాలుగు వైపుల నుంచి అతిపెద్ద రైల్వే రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది. సముద్ర తీర ప్రాంతాలకు అనుసంధానంగా రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టుల జాప్యంతో గోదావరి జిల్లాలో అన్ని పార్లమెంట్ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ఎంపీలు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది.


