చెద మందు పిచికారీ చేస్తూ ప్రమాదం
నరసాపురం రూరల్: ఇంటికి రంగులు వేసే క్రమంలో జరిగిన ఒక దురదృష్టకర ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మొగల్తూరు పంచాయతీ పరిధిలోని కుక్కలవారి తోటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన వనం రాజేష్ తన ఇంటికి రంగులు వేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న చెద పురుగుల నివారణ కోసం చెదమందు (క్రిమి సంహారక మందు) తో పాటు టర్పంటైన్ ఆయిల్‌ను కలిపి ఒక ప్లాస్టిక్ క్యాన్ ద్వారా పిచికారీ చేస్తున్నారు. ఆ సమయంలో ఊహించని విధంగా స్ప్రేయర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగి వనం రాజేష్‌తో పాటు అతనికి వరుసకు సోదరుడైన వనం సత్యనారాయణరావులకు శరీరమంతా తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెనువెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే నరసాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు బలంగా ఉండటంతో, మెరుగైన చికిత్స నిమిత్తం వారిని భీమవరంలోని మరొక ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు.


