మత్స్య సాగులో.. మరణ మృదంగం | - | Sakshi
Sakshi News home page

మత్స్య సాగులో.. మరణ మృదంగం

Feb 26 2026 7:34 AM | Updated on Feb 26 2026 7:34 AM

మత్స్

మత్స్య సాగులో.. మరణ మృదంగం

మత్స్య సాగులో.. మరణ మృదంగం

ఆక్వా చెరువులపై పాటించని జాగ్రత్తలు

విద్యుత్‌ తీగలు, మోటార్లు, గన్‌పౌడర్‌ పేలి ప్రమాదాలు

పిట్టల్లా రాలిపోతున్న కూలీలు

కై కలూరు: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆక్వారంగం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. కాసుల సంపాదనలో అక్షయపాత్రగా పేరొందిన ఈ రంగాన్ని నమ్ముకుని లక్షలాది మంది జీవిస్తున్నారు. పొట్టకూటి కోసం పలు రాష్ట్రాల నుంచి వలస కూలీలు చేపల, రొయ్యల చెరువులపై కుటుంబాలతో సహా నివసిస్తున్నారు. యజమానుల నిర్లక్ష్యం, కూలీల అవగాహన లోపంతో విద్యుత్‌ తీగలు తగలి కొందరు, మోటర్లలో చిక్కుకుని మరికొందరూ, చెరువులపై వాలే పిట్టలను నాటు తుపాకితో బెదిరించే క్రమంలో గన్‌పౌడర్‌ పేలి ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇటువంటి మరణాలు ఇటీవల పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా సాగు 5.75 లక్షల ఎకరాల్లో ఉంది. ఇందులో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో చేపల సాగు 1.80 లక్షలు, రొయ్యల సాగు 1.10 లక్షలు వెరసి 2.90 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఇక ఆక్వా విద్యుత్‌ సర్వీసులు విషయానికి వస్తే ఏలూరు జిల్లాలో 4,759, పశ్చిమగోదావరిలో 16,374 వెరసి 17,124 ఉన్నాయి. ఆక్వా చెరువు గట్లపై విద్యుత్‌ తీగలను మోటర్లకు అమర్చడానికి కింద అమర్చుతున్నారు. గట్టుపై గడ్డి కోసే క్రమంలో కొడవళ్లకు తీగలు తగిలి, కూలీలు, ప్రజలు మరణిస్తున్నారు. ఇటీవల మహాశివరాత్రి రోజున కలిదిండి మండలం పడమటిపాలెంలో రొయ్యల సాగు ఫ్యాన్‌ సెట్‌ రాడ్‌లో చిక్కుకుని తల్లీకూతురు అక్కడికక్కడే మరణించడం కలిచివేసింది.

కూలీలు పిట్టల్లా రాలిపోతున్నారు

కొల్లేరు సమీప గ్రామాల్లో చేపల, రొయ్యల చెరువులపై రోజువారీ పనిచేయడానికి స్థానిక కూలీల కొరత ఉంది. పైగా అధిక అడ్వాన్సులు చెల్లించాల్సి వస్తోంది. ఇటువంటి తరుణంలో ఒడిశా, ఆసోం, గుజరాత్‌, వెస్ట్‌ బెంగాళ్‌, నేపాల్‌ నుంచి ఆక్వా చెరువులపై పనిచేయడానికి వలస కూలీలు వస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం వీరి సంఖ్య 30 వేల పైనే ఉంటుందని అంచనా. చెరువుపై నివాసం ఉండే వ్యక్తికి నెలకు రూ.15 వేలు, అదే కుటుంబానికి రూ.20 వేలు అందించి గృహవసతితో పాటు సమస్తం చెరువు యజమాని భరిస్తున్నాడు. కొత్తగా వచ్చిన కూలీలకు అవగాహన లేక యంత్రాలు, విద్యుత్‌ తీగలు తగలి మరణిస్తున్నారు.

కొల్లేరుకు గన్‌పౌడర్‌ తయారీ కల్చర్‌

ఆక్వా సాగు చెరువుల్లో చిన్న చేపలను కొల్లేరు పక్షులు తినేస్తాయి. దీనిని నివారించడానికి నెల్లూరు, తమిళనాడుల నుంచి నొక్కలొళ్లు అనే తెగకు చెందిన కుటుంబాలు కొల్లేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరి వద్ద పిట్టలను బెదిరించడానికి నాటు తుపాకీలు ఉంటాయి. గన్‌పౌడర్‌ తయారు చేసే క్రమంలో అవి పేలి అనేక మంది చేపల చెరువు గట్లుపై మృత్యువాత పడుతున్నారు. గతేడాది ఏకంగా భైరవపట్నం గుడారాల్లో గన్‌పౌడర్‌ పేలి అనేక మంది మృత్యువాతపడ్డారు. విద్యుత్‌ తీగలు, మోటర్లు, గన్‌పౌడర్‌ తయారీ క్రమంలో మరణించిన ఘటనలు అనేకం పోలీసు స్టేషన్లకు చేరడం లేదు. యజమానులు ప్రాణాలకు ఖరీదు కట్టి సెటిల్‌మెంట్లు చేస్తున్నారు.

ఆక్వా సాగు కొందరికి కాసులు కురిపిస్తుంటే.. ఈ రంగాన్ని నమ్ముకుని ఉపాఽధి కోసం వచ్చిన కూలీలు మాత్రం ప్రమాదవశాత్తూ మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఆక్వా చెరువులపై కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలకు అవగాహన లేకపోవడంతో మత్స్యసాగు మరణ మృదంగం మోగిస్తోంది.

మత్స్య సాగులో.. మరణ మృదంగం 1
1/2

మత్స్య సాగులో.. మరణ మృదంగం

మత్స్య సాగులో.. మరణ మృదంగం 2
2/2

మత్స్య సాగులో.. మరణ మృదంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement