ప్రగడవరం అమ్మాయి.. జర్మనీ అబ్బాయి
చింతలపూడి: ప్రేమకు భాషా భేదం, ఖండాంతరాలు అడ్డుకాదని నిరూపించింది ఈ ప్రేమజంట. ప్రగడవరం అమ్మాయి, జర్మనీ అబ్బాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన జల్లిపల్లి సత్యనారాయణ, కృష్ణకుమారి దంపతుల కుమార్తె ప్రవల్లిక జర్మనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అక్కడ బుక్స్‌బాక్ నగరానికి చెందిన థామస్ ఛాకర్ట్, యుట్టా చాకర్ట్ కుమారుడు యల్మర్‌తో ప్రేమలో పడ్డారు. ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో తెలుగు సంప్రదాయం ప్రకారం మంగళగిరిలో బుధవారం వీరి వివాహం జరిగింది. జర్మనీ నుంచి వచ్చిన యల్మర్ బంధువులు మన దేశ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలను చూసి ముగ్ధులయ్యారు. వివాహానికి వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, మండల అధ్యక్షుడు ఎస్.రమేష్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
కైకలూరు : కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర బుధవారానికి 8వ రోజుకు చేరింది. అమ్మకు విశేషార్చన, నూతన వస్త్ర, పుష్పాలంకరణ, సప్తవరణ కళాశార్చన, ధూపసేవ, బాలభోగం నిర్వహించారు. అమ్మవార్లకు వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా భీమవరంనకు చెందిన గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు, భుజబలపట్నంకు చెందిన పొత్తూరి సురేష్‌రాజు దంపతులు వ్యవహరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కై కలూరుకు చెందిన షిరిడీ సాయి మురళీ కోలాటం, గుడివాడకు చెందిన జై శ్రీ నాట్యమండలి నిర్వహణలో పూల రంగడు హాస్య నాటక ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు జల్లూరి వెంకన్నబాబు, ఆలయ కార్యనిర్వాహణాధికారి కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 28 శనివారం జలదుర్గా, గోకర్ణేశ్వరస్వామి కల్యాణోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మను దర్శించుకోవాలని కోరారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భారతీయ వరి పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందం బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసింది. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థకు చెందిన డా. వి.మానస, డా.జాగృతి రోహిత్, డా. కేవీ రాఘవేంద్ర, డా.సతీష్ చవాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో భారతీయ వరి పరిశోధన సంస్థ, రైతు సాధికార సంస్థ సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు పురోగతిని శాస్త్రవేత్తలు కలెక్టర్‌కు వివరించారు. ప్రకృతి ఆధారిత పద్ధతుల ద్వారా వరి ఉత్పాదకత పెంపు, ఖర్చు తగ్గింపు, రైతుల ఆదాయం మెరుగుదల వంటి అంశాలపై వారు సమగ్ర వివరణ ఇచ్చారు. అలాగే జిల్లాలో ఈ ప్రాజెక్టును మరింత విస్తరించే అవకాశాలపై చర్చ జరిగింది. సమావేశం అనంతరం శాస్త్రవేత్తలు అధిక జింక్ కలిగిన, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న డీఆర్‌ఆర్. ధాన్–48 వరి వంగడాన్ని జిల్లా కలెక్టర్‌కు బహుకరించారు. ఈ సమావేశం ద్వారా జిల్లాలో పోషక భద్రత, రైతు సంక్షేమం, సుస్థిర వ్యవసాయ విధానాల అమలుకు పరస్పర సహకారం మరింత బలపడినట్లు అయ్యింది.
ప్రగడవరం అమ్మాయి.. జర్మనీ అబ్బాయి
ప్రగడవరం అమ్మాయి.. జర్మనీ అబ్బాయి


