చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
నరసాపురం రూరల్ : చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని వెస్ట్‌కుక్కిలేరులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వేములదీవి పడమర గ్రామానికి చెందిన బొమ్మిడి యేసుబాబు (53) మత్స్యకారుడు. బుధవారం ఉదయం యథావిధిగా వెస్ట్‌కుక్కిలేరులో చేపల వేట కోసం వెళ్లిన అతడు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఐతం వీరవెంకట సత్యనారాయణ, ఆర్‌ఐ సురేఖ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ముదినేపల్లి రూరల్: ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ చెరువులో పడిన బాలుడు మునిగిపోయి మృతి చెందిన ఘటన మండలంలోని గురజలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గురజకు చెందిన దినేష్ కృష్ణవేణి తమిళనాడుకు చెందిన దినేష్ బాలన్‌తో నాలుగేళ్ల కిందట వివాహం కాగా వీరికి దినేష్ నితీష్ అనే రెండున్నర సంవత్సరాల వయస్సున్న కుమారుడున్నాడు. కృష్ణవేణి కుమారుడిని చిన్నప్పటి నుంచి గురజలోని తల్లి లుక్కా వీరమ్మ వద్దనే ఉంచింది. నితీష్ చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరగడంతో స్థానిక పిల్లలతో మమేకమై ఆడుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న చెరువులో పడి మునిగి మృతి చెందాడు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ పి ప్రదీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
బుట్టాయగూడెం : మండలంలోని దొరమామిడి సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయం, చింతలగూడెం సమీపంలో ఉన్న పోగొండ రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి బి.రాజ్‌కుమార్ మాట్లాడుతూ జల్లేరు జలాశయంలో 48 వేలు, పోగొండ రిజర్వాయర్‌లో లక్షా 20 వేల చేప పిల్లలను విడుదల చేశామన్నారు. ఎంపీపీ తెల్లం రమణ, ఏఎంసీ వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ, అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, మంగయ్యపాలెం సర్పంచ్ మాల్చి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి


