ఫీజులుంకు చెక్
జిల్లాలో ఇంటర్ విద్యార్థులు
హాల్‌టికెట్ పొందండిలా..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల్లో ఒకటే టెన్షన్. ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడానికి కార్పొరేట్ విద్యాసంస్థలు నిరాకరించడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితిని అధిగమించి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఫీజులు చెల్లించకపోయినా విద్యార్థులకు హాల్‌టికెట్లు నిరాకరించరాదని ఆదేశాలు ఇచ్చింది. 2022 నుంచి విద్యార్థులు నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అప్పటినుంచి ఇదే విధానం కొనసాగుతుండగా.. ప్రస్తుతం మనమిత్ర యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో కార్పొరేట్ విద్యాసంస్థల ఫీ‘జులుం’కు చెక్ పెట్టినట్లయ్యింది.
సంతకం, స్టాంప్ అక్కర్లేదు
వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్లు పొందిన విద్యార్థులు వివరాలతో పాటు పరీక్షల షెడ్యూల్, సబ్జెక్టుల వివరాలు సరిచూసుకోవాలి. హాల్‌టికెట్‌పై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సంతకం, కళాశాల స్టాంప్ అవసరం లేదు. పరీక్ష సమయానికి కనీసం అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.
56 కేంద్రాలు.. 34,615 మంది విద్యార్థులు
జిల్లాలో ఈనెల సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తంగా 34,615 మంది విద్యార్థులు హాజరుకానుండగా 56 కేంద్రాలను ఏ ర్పాటుచేశారు. సీసీ టీవీల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. కేంద్రాల వద్ద గాలి, వెలుతురు ఉండటంతో పాటు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
ఫస్టియర్ 17,556
సెకండియర్ 17,059
పరీక్షా కేంద్రాలు 56
వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా విద్యార్థులు హాల్‌టికెట్లు పొందవచ్చు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు హెచ్‌టీటీపీ://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్ సైట్‌లో లాగిన్ కావాలి. టెన్త్ హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఇంటర్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెకండియర్ విద్యార్థులు ఫస్టియర్ హాల్‌టికెట్ నంబర్, ఆధార్, పుట్టినతేదీ వివరాలతో హాల్‌టికెట్ పొందవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబరు 95523 00009కు ఏజీ అని మెసేజ్ పంపడం ద్వారా కూడా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫీజు బకాయిలు ఉన్నా హాల్‌టికెట్
వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా నేరుగా విద్యార్థులకు..
ప్రిన్సిపాల్ సంతకం, స్టాంప్ అవసరం లేదు
ఇంటర్ విద్యార్థులకు అవకాశం
జిల్లాలో 34,615 మంది విద్యార్థులు


