అటకెక్కిన కార్పొరేషన్ రుణాలు
ఎస్సీలకూ మొండిచేయి
భీమవరం(ప్రకాశం చౌక్): ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ రుణాల పేరిట హడావుడి చేసి తీరా నిధుల విడుదల చేయకుండా జాప్యం చేస్తోంది. బీసీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా అర్హులైన యువతకు రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రుణంలో 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుందని దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూలు సైతం చేశారు. ఇదంతా జరిగి దాదాపు ఏడాది కావస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించలేదు. అయినా ఇప్పటికీ రుణాల ఊసెత్తకపోవడంతో దరఖాస్తుదారులు ఎన్నాళ్లీ ఎదురుచూపులు అంటూ నిట్టూరుస్తున్నారు. మరోసారి కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయామంటూ రుణాలపై ఆశలు వదులుకుంటున్నారు.
నిధుల ఊసేది?
కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ 50 శాతం సొమ్మును బ్యాంకులకు విడుదల చేస్తే మిగిలిన 50 శాతం కలిపి బ్యాంకులు లబ్ధిదారులకు రుణంగా మంజూరు చేస్తాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకూ రుణాలకు సంబంధించిన సబ్సిడీ సొమ్ములు విడుదల చేయలేదు. దీంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి. వచ్చిన దరఖాస్తులు బ్యాంకుల్లో మూలన పడ్డాయి.
79 వేల మందికి పైగా..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బీసీ, ఎస్సీ, కాపు తదితర కార్పొరేషన్ల రుణాల కోసం ఏలూరు జిల్లాలో 40,156, పశ్చిమగోదావరిలో 38,893 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బీసీ కార్పొరేషన్‌కు ఏలూరులో 21,838, పశ్చిమగోదావరిలో 17,686 దరఖాస్తులను స్వీకరించారు.
పచ్చ నేతల సమక్షంలోనే..
ఉమ్మడి జిల్లాలో బీసీ, కాపు కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలు కూటమి నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం నేతల సమక్షంలోనే జరిగాయి. 90 శాతం యూనిట్లను కూటమికి చెందిన, కూటమి నాయకులు సిఫార్సు చేసిన వారికి మంజూరు చేసేలా బ్యాంకు మేనేజర్లపై ఒత్తిళ్లు కూడా చేశారు. మీకు రుణం రాదంటూ పలువురు అర్హులైన అభ్యర్థులను టీడీపీ శ్రేణులు ఆందోళనకు కూడా గురిచేశాయి. ఇంతా హడావుడి చేసి రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.
నిధుల కేటాయింపు.. మళ్లింపు
2024–25 బడ్జెట్‌లో బీసీ, కాపు కార్పొరేషన్ రుణాలకు సబ్సిడీ నిధులు కేటాయించామని నాడు విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. అయితే నిధులను ప్రభుత్వం బ్యాంకులకు రిలీజ్ చేయకుండా మళ్లించిందనే ఆరోపణలు ఉన్నాయి.
మంత్రి నిమ్మల తీరు మరీ విడ్డూరం
చంద్రబాబు సబ్సిడీ రుణాలు అందిస్తారంటూ ప్రచారం చేసిన జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు ఒక్క అడుగు ముందుకు వేసి మరీ పాలకొల్లులో లబ్ధిదారులకు సబ్సిడీ రుణాల చెక్కు సైతం అందించారు. తీరా లబ్ధిదారులకు బ్యాంకులకు వెళితే అసలు నిజం తెలిసింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సబ్సిడీ నిధులు విడుదల చేయలేదని తెలుసుకుని ప్రభుత్వ తీరుపై ముక్కున వేలేసుకున్నారు. జిల్లాలో మంత్రి నిమ్మల, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ఉన్నా కార్పొరేషన్ రుణాల ఊసే ఎత్తడం లేదు.
చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీలకు మొండిచేయి చూపింది. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం 9 నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించలేదు. ఏలూరు జిల్లాలో 111 యూనిట్లకు 6,826, పశ్చిమగోదావరి జిల్లాలో 742 యూనిట్లకు 3,181 దరఖాస్తులు వచ్చాయి.
ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
ఊసేలేని బీసీ, ఎస్సీ తదితర కార్పొరేషన్ల రుణాలు
దరఖాస్తులు స్వీకరించి ఏడాది
విడుదల కాని నిధులు.. నిలిచిన యూనిట్లు
బడ్జెట్‌లో కేటాయించిన సొమ్ములు మళ్లింపు!
రుణాల పేరుతో చంద్రబాబు సర్కారు మోసం
ఉమ్మడి జిల్లాలో 79 వేలకు పైగా దరఖాస్తులు
అటకెక్కిన కార్పొరేషన్ రుణాలు


