ఊరు శిథిలం.. జనం శోకం
దొంగలకు అడ్డాగా కాలనీ
ప్రాజెక్టు 41వ కాంటూరు పరిధిలోని కొంతమంది నిర్వాసితులకు మాత్రమే పట్టాలు అందించారు. అంతేకాకుండా మాకు భూమికి భూమి కింద ముంపులో భూములు ఇచ్చారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశాం. ఈ సమస్య పరిష్కారమైతే అందరికీ ఇళ్ల పట్టాలు అందించిన తరువాత, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పించిన తరువాతే అక్కడకు తరలివెళ్తాం.
– తరుసం నరేష్, బోనగిరి సర్పంచ్, కుక్కునూరు
ఆర్‌అండ్‌ఆర్ పరిహారం ఇంటి విలువ పరిహారం ఇచ్చి ఒకేసారి తరలిస్తే నిర్వాసితులందరూ కాలనీలకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉండేవారు. ఇలా వేర్వేరుగా పరిహారం ఇవ్వడంతోనే 41 కాంటూరు నిర్వాసితులు వెళ్ళకుండా ఆగిపోవాల్సి వచ్చింది.
– ఇర్పా వెంకటేష్, అల్లిగూడెం, కుక్కునూరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముంపు బాధితుల వేదన అరణ్య రోదనగా మారింది. పోలవరం ప్రాజెక్టులో ఇళ్లు, భూములు కోల్పోయిన గిరిజనుల గోడును సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకోవడంతో శిథిలమవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించి ఇళ్ళకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిర్వాసితులు కాలనీల వైపు కన్నెత్తి చూడటం లేదు. దాంతో వందల ఇళ్ళు మొండిగోడలుగా మారిపోయాయి. కుక్కునూరు మండలంలోని గిరిజన గ్రామాల్లోని నిర్వాసితులకు పెదరావిగూడెం పంచాయతీ పరిధిలోని వెంకటాపురంలో పోలవరం పునరావాస కాలనీ నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో 758 ఇళ్ళను రూ.78 కోట్ల వ్యయంతో నిర్మించేలా ప్రాజెక్టును ఖరారు చేసి 565 ఇళ్ళను పూర్తి స్థాయిలో పూర్తిచేశారు. 41, 45 కాంటూరు పరిధిలోని గిరిజన గ్రామాల నిర్వాసితుల కోసం ఈ కాలనీని నిర్మించారు. కుక్కునూరు మండలంలో ఉప్పేరు, గణపవరం, తొండిపాక, పెదరావిగూడెం, వేలేరు, సీతారామనగరం పంచాయతీల్లోని గిరిజన నిర్వాసితుల కోసం ఈ ఇళ్ళ నిర్మాణం చేపట్టారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత 41వ కాంటూరు వరకే తరలించాలని నిర్ణయించడంతో 45వ కాంటూరు పరిధిలోని నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.42 లక్షల వ్యయంతో గ్రామ సచివాలయం, వైఎస్సార్ రైతుసేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, ఇలా అన్ని కార్యాలయాలు నిర్మించారు. పాలకులు పునరావాస కాలనీలపై దృష్టి సారించకపోవడం, పరిహారాల పంపిణీలో జాప్యం, ఇతర కారణాలతో కోట్లాది రూపాయలతో నిర్మించిన మెగా కాలనీ శిథిలమవుతుంది.
శిథిలావస్థకు చేరిన ‘కోట్ల’ స్వప్నం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్వాసితుల కోసం 758 ఇళ్ళను భారీ వ్యయంతో ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. నిర్వాసితులు సొంత గూడును వదులుకుని ఇక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని భావించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాలనీ నిర్మాణం పూర్తయినా మౌలిక వసతుల కల్పనలో వైఫల్యం లేదా ఇతర కారణాల వల్ల నిర్వాసితులు ఇక్కడ ఉండటం లేదు. ఫలితంగా పాడుబడ్డ భవనాల్లా కాలనీ శిథిలావస్థకు చేరుకుంది.
నిరుపయోగంగా ఉన్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్
గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం
గిరిజన నిర్వాసితుల కాలనీపై సర్కారు నిర్లక్ష్యం
గత ప్రభుత్వంలో రూ.78 కోట్లతో
758 ఇళ్ల మంజూరు
మూడేళ్లలో 565 ఇళ్ల నిర్మాణం
కనీస సౌకర్యాల కల్పనలో చంద్రబాబు సర్కారు వైఫల్యం
ఆర్ అండ్ ఆర్ కాలనీలపై శీతకన్ను
నిర్వాసితులు లేకపోవడంతో ఈ కాలనీ దొంగలకు అడ్డాగా మారింది. ఇళ్లకు అమర్చిన తలుపులు, కిటికీలు, విలువైన కలపతో చేసిన తలుపులు దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి లోపల ఉండే విలువైన కాపర్ వైర్లను దొంగిలించారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే), హెల్త్ క్లినిక్ భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. కిటికీలు ఊడిపోయి, గోడలు బీటలు వారి అసాంఘిక కార్యక్రమాలకు వేదికలుగా మారుతున్నాయి. జన సంచారం లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కరువవడంతో సాయంత్రం అయితే ఈ ప్రాంతం మందు బాబులకు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులు కళ్ల ముందే ధ్వంసమవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, దొంగతనాలకు గురైన వస్తువులను రికవరీ చేయడంతో పాటు, కాలనీని పునరుద్ధరించి అర్హులైన నిర్వాసితులకు అప్పగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఊరు శిథిలం.. జనం శోకం
ఊరు శిథిలం.. జనం శోకం
ఊరు శిథిలం.. జనం శోకం
ఊరు శిథిలం.. జనం శోకం


